ఇసుక అక్రమాల్లో ‘అవుట్‌ సోర్స్‌’

ABN , First Publish Date - 2020-07-09T09:45:04+05:30 IST

ఏవిధమైన భవనాల నిర్మాణం లేకుండానే తప్పుడు చిరునామాలతో మూడు జీఎస్‌టీలు చూపించి బల్క్‌ఆర్డర్ల పేరిట ఏకంగా 59 వేల

ఇసుక అక్రమాల్లో ‘అవుట్‌ సోర్స్‌’

బల్క్‌ ఆర్డర్ల పేరిట కాంట్రాక్టర్లతో ఏపీఎండీసీ సిబ్బంది కుమ్మక్కు

మూడు తప్పుడు జీఎస్‌టీలతో  59,500 మెట్రిక్‌ టన్నుల ఇసుక దోపిడీ..

ఏడుగురు అరెస్టు

మొత్తం 21మందిపై బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు


 రాజమహేంద్రవరం, జూలై 8 : ఏవిధమైన భవనాల నిర్మాణం లేకుండానే తప్పుడు చిరునామాలతో మూడు జీఎస్‌టీలు చూపించి బల్క్‌ఆర్డర్ల పేరిట ఏకంగా  59 వేల 500 టన్నుల ఇసుక  కాజేసిన ఓ ముఠా  ఉదంతమిది. బ్లాక్‌ మార్కెట్‌లో లారీ  రూ.20 వేలకు విక్రయించిన విషయం కూడా ధ్రువీకరణ అయింది.  ఏపీ ఎండీసీ తరపున పనిచేస్తున్న కొందరు  అవుట్‌ సోర్సింగ్‌  ఉద్యోగులు, ఇసుక కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి పెద్ద కుంభకోణానికే పాల్పడ్డారు. ఇలా అక్రమాలు చేస్తున్నారనే విషయాన్ని ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ వెలికితీసిన సంగతి తెలిసిందే. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌  ఎఎస్‌పీ ఆధ్వర్యంలో అధికారులు పథకం ప్రకారం వ్యవహరించి, ఈ అక్రమాలను బయటపెట్టారు. 21 మందిపై కేసు నమోదు చేశారు.  బుధవారం ఏడుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు.


దీనికి సంబంధించి బొమ్మూరు సీఐ లక్ష్మణ్‌రెడ్డి కథనం ప్రకారం అపార్టుమెంట్లు, పెద్ద గృహాలు, ఇతర పనుల కోసం   బల్క్‌ ఆర్డర్లు బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. విజయవాడకు చెందిన ఆదిత్య, అనే వ్యక్తి ప్రైవేట్‌గా బల్క్‌ ఆర్డర్లు బుక్‌ చేసుకుని, అతని స్నేహితులు మణికుమార్‌, కాశీ విశ్వనాథ్‌లతో కలసి నెక్కంటి శ్రీనివాస్‌, రాయుడు వీరవెంకట సత్యనారాయణ, రాధా కృష్ణవేణి అనే తప్పుడు చిరునామాలు సృష్టించి వారు భవనాలు నిర్మాణం చేస్తున్నారని చెప్పి, 15 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక బల్క్‌ ఆర్డర్‌ బుక్‌ చేశారు. అందులో 8,300 టన్నులకు సంబంధించి, టన్నుకు రూ.375 వంతున ఏపీఎండీసీకి చెల్లించి, 17 బల్క్‌ ఆర్డర్లను కాకినాడ సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.


కానీ  చివరకు బ్లాక్‌ మార్కెట్‌లో 20 వేల నుంచి 23 వేలకు అమ్మారు. ఇందులో ఏపీఎండీసీ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి చంద్రశేఖర్‌తో కూడా ఒప్పందం పెట్టుకున్నారు. అలాగే కాకినాడకు చెందిన కాశీవిశ్వనాఽథ్‌ మళ్లీ తన మేనమామ చింతకింది నాగవెంకట కృష్షంరాజుకు చెందిన జీఎస్‌టీతో హింగ్లాజ్‌ శ్రీముఖ ఇన్‌ఫ్రా పేరిట అప్‌లోడ్‌ చేసి 27 వేల టన్నుల బల్క్‌ ఆర్డర్‌ బుక్‌ చేశాడు. లేని వినియోగదార్లను సృష్టించి రమణమ్మ పేరిట 5వేల, టన్నులు, శ్రీని వాస్‌ పేరిట 5 వేల టన్నులు, మురళీ పేరిట 5వేల టన్నులు, వీరవెంకట సత్యనారాయణ పేరిట 5వేలు, రాధాకృష్ణ పేరిట 5వేల టన్నులు, రామిరెడ్డి పేరిట  5వేల టన్నులు సరఫరా చేసినట్టు చెప్పి బ్లాక్‌లో  18 టన్నుల లారీ ఇసుకను రూ.20 వేలకు అమ్మేశాడు.


తన స్నేహితుడికి  కూడా ఇదే ధరకు అమ్మడం గమనార్హం. ఇక  కాకినాడకు చెందిన  శేషు అనే వ్యక్తి  రామిరెడ్డి అనే వ్యక్తి పేరు మీద ఉన్న జీఎస్‌టీ తీసుకుని, కాశీవిశ్వనాథ్‌కు ఇవ్వగా, దానితో  అప్‌లోడ్‌ చేసి మరో  1,75,000 టన్నుల ఇసుక బల్క్‌ ఆర్డర్లు బుక్‌ చేశాడు. ఇక్కడ రామిరెడ్డి అనే వ్యక్తి ఫోన్‌ నంబర్‌కు బదులు కాశీవిశ్వనాథ్‌ తన నంబర్‌ అప్‌లోడ్‌ చేసి, వివరాలు తనకు వచ్చేటట్టు జాగ్రత్తలు తీసుకున్నాడు. తర్వాత కల్పిత పేర్లయిన వీరబాబు, ఽశివ, రమేష్‌రెడ్డి, కాశీవిశ్వనాథ్‌ పేర్లపై ఇసుక సరఫరా చూపించాడు. దీనిని కూడా బ్లాక్‌ మార్కెట్‌లో లారీ రూ.18 వేలకు అమ్మారు. ఇలా మరికొన్ని వ్యవహారాలు నడిపారు.


ఇటీవల దివాన్‌చెరువు వద్ద స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆకస్మికంగా జరిపిన దాడుల్లో పవన్‌కుమార్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, మూడు ఇసుక లారీలను సీజ్‌చేసి, ఆరా తీయడంతో ఈ అవినీతి డొంక కదిలింది. ప్రస్తుతం ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.  స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పెద్ద అవినీతినే కట్టడి చేశామన్నారు.

Updated Date - 2020-07-09T09:45:04+05:30 IST