పౌరసత్వం వదులుకున్న 7.5లక్షల మంది భారతీయులు

ABN , First Publish Date - 2022-05-07T14:01:59+05:30 IST

గత 6ఏళ్లలో సుమారు 7.5లక్షల మంది పౌరులు భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. 2016 నుంచి ఇప్పటివరకు ఏడున్నర లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదులుకోగా, దాదాపు 6వేల మంది విదేశీయులు భారత పౌరసత్వం తీసుకున్నారని కేంద్రం వెల్లడించింది. 2016-21 మధ్య డేటా ప్రకారం రాజ్యసభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని తెలియజేసింది.

పౌరసత్వం వదులుకున్న 7.5లక్షల మంది భారతీయులు

న్యూఢిల్లీ: గత 6ఏళ్లలో సుమారు 7.5లక్షల మంది పౌరులు భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. 2016 నుంచి ఇప్పటివరకు ఏడున్నర లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదులుకోగా, దాదాపు 6వేల మంది విదేశీయులు భారత పౌరసత్వం తీసుకున్నారని కేంద్రం వెల్లడించింది. 2016-21 మధ్య డేటా ప్రకారం రాజ్యసభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని తెలియజేసింది. మంత్రిత్వశాఖ సమర్పించిన డేటా ప్రకారం 7,49,765 మంది పౌరులు భారత పౌరసత్వాన్ని వదులుకుని 106 దేశాల్లో స్థిరపడ్డారు. 2019లో అత్యధికంగా 1,44,017 మంది పౌరసత్వం వదులుకున్నారు. ఆ తర్వాత వరుసగా 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 మంది, 2018లో 1,34,561 మంది, 2020లో 85,248 మంది, 2021లో 1,11,287 మంది భారత పౌరసత్వాన్ని వదులుకోవడం జరిగింది. 


ఇక ఈ ఆరేళ్లలో పౌరసత్వం వదులుకున్న 7.5లక్షల మందిలో ఏకంగా 82శాతం మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లో స్థిరపడ్డారు. 2019లో అత్యధికంగా 1.44లక్షల మంది పౌరసత్వం వదులుకుంటే వీరిలో 85శాతం మంది ఈ నాలుగు దేశాలకే వెళ్లినట్లు డేటా చెబుతోంది. 2017 నుంచి సుమారు 2.56లక్షల మంది భారతీయులు పౌరసత్వం వదిలి యూఎస్ వెళ్తే, 91వేల మంది కెనడాలో స్థిరపడ్డారు. 2020-21 మధ్య 31 మంది భారతీయులు పౌరసత్వం వదులుకుని పాకిస్థాన్‌కు వలస వెళ్లారు. అలాగే 2017-21 మధ్య 2,174 మంది భారత పౌరసత్వం కాదని చైనాలో స్థిరపడ్డారు. ఇదే నాలుగేళ్లలో 94 మంది శ్రీలంక వెళ్లడం జరిగింది. మరో 134 మంది నేపాల్ పౌరసత్వం తీసుకున్నారు.


ఇదిలాఉంటే.. 2016-21 మధ్య 5,891 మంది విదేశీయులు భారత పౌరసత్వం తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక బడ్జెట్ సమావేశాల సమయంలో విదేశీ వ్యవహారాల శాఖ 2018-21 మధ్య సుమారు 8,244 మంది విదేశీయులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు లోక్‌సభలో వెల్లడించిన విషయం తెలిసిందే. వీరిలో హిందువులు, సిక్కులు, జైన్, క్రిస్టియన్లు ఉన్నట్లు తెలిపింది. అత్యధికంగా అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది.   

Read more