సెటిల్‌మెంట్లు.. సివిల్‌ పంచాయితీలు

ABN , First Publish Date - 2022-07-04T04:41:13+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం వల్ల చాలా ప్రాంతాల్లో పోలీసుల పనితీరుతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

సెటిల్‌మెంట్లు.. సివిల్‌ పంచాయితీలు
హార్వెస్టర్ను సీజ్ చేయాలని ఆర్టీఓకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు

గద్వాల సర్కిల్‌ పరిధిలో అమలు కాని ఫ్రెండ్లీ పోలీసింగ్‌

ఓ షాడో నాయకుడి సహకారంతో రెచ్చిపోతున్న మండలాల పోలీసులు

సదరు నాయకుడి ప్రమేయం ఉంటే కేసు ఏదైనా సరే సెటిల్‌మెంట్‌

న్యాయం చేయాలని వస్తున్న వారినే వేధిస్తున్నారనే విమర్శలు

వ్యక్తిగత దూషణలు.. విచారణ పేరుతో బాధితులకు బెదిరింపులు


రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం వల్ల చాలా ప్రాంతాల్లో పోలీసుల పనితీరుతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కానీ ఇప్పటికీ కొన్ని పోలీస్‌ స్టేషన్లలో ఈ విధానం అమలవడం లేదు. అది ఆ ప్రాంత పరిస్థితుల ప్రభావమో లేదా పోలీసు అధికారుల పనితీరో కారణాలేమైనా కొన్ని స్టేషన్లలో పాత లక్షణాలు కనిపిస్తూనే ఉన్నాయి. చాలా చిన్న కేసులను కాంప్లికేటెడ్‌గా మార్చడం, పెద్ద కేసులను నీరుగార్చడం వంటి పరిణామాలు తరచూ జరుగుతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో కూడా అలాంటి పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. అక్కడ ఉన్న షాడో నాయకుల సహకారంతో పోలీసు అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రధానంగా గద్వాల సర్కిల్‌ పరిధిలో ఈ సమస్య ఎక్కువగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

- ఆంధ్రజ్యోతి, గద్వాల


 జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం అమలవడం లేదు. పోలీసులు ఒక్కొక్కరి పట్ల ఒక్కో విధంగా స్పందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ షాడో నాయకుడిపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నా నేటికీ చర్యలు తీసుకోని పోలీసులు.. సదరు వ్యక్తి ఏం చెప్పినా తలూపుకుంటూ చేయడం అలవాటుగా మారిందని తెలుస్తోంది. ఈ సర్కిల్‌ పరిధిలో గట్టు, గద్వాల టౌన్‌, గద్వాల రూరల్‌, మ ల్దకల్‌, కేటీదొడ్డి, ధరూర్‌ మండలాలు ఉన్నాయి. అయిజ దారిలో గద్వాల తర్వాత వచ్చే మండ లంలో సదరు నాయ కుడి ప్రమేయం లే కుండా ఏ పనులు కావడం లేదనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. ఈ షాడో నాయకుడు ఇప్పటికే ఇసుక, మట్టిదందాల్లో ఆరితేరగా, సివిల్‌ సెటిల్‌మెంట్లు, క్రిమి నల్‌ సెటిల్‌మెంట్ల వరకూ పోలీసులతో మాట్లాడుకుని డీల్‌ చేసే స్థాయికి ఎదిగాడని తెలుస్తోంది. ఫ్రెండ్లీ పోలీసులు సదరు నాయకుడికి ఫ్రెండ్లీగా ఉంటూ మిగతా వారిని వేధించడమే పనిగా పెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


మచ్చుకు ఉదాహరణలు కొన్ని..

 మల్దకల్‌ మండలం అడివిరావుల చెరువుకు చెందిన రాజు ఇటీవల తనకు చెందిన 1.25 ఎకరాలు అమ్మేందుకు అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.15 లక్షలు తీసుకున్నాడు. మరో రూ.8 లక్షలు ఇవ్వాల్సి ఉంది. అగ్రిమెంట్‌ ప్రకారం ఆగస్టు 10వ తేదీలోగా బ్యాలెన్స్‌ డబ్బులు చెల్లించి, రిజి స్ర్టేషన్‌ చేసుకోవాల్సి ఉంది. అడ్వాన్స్‌గా తీసుకు న్న మొత్తాన్ని రాజు అప్పులు చెల్లించుకున్నాడు. అ యితే ఆ భూమి రాజు పేరిట కాకుండా ఆయన భార్య పేరిట రిజిస్ర్టేషన్‌ అయ్యి ఉంది. భూమి అమ్మకానికి ఆమె అడ్డుపడు తోంది. ఇది గమనిం చిన సదరు కొనుగోలు దారు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు రాజును పిలిపించి ప్రశ్నించగా తాను అనుకున్న అగ్రిమెంట్‌ తేదీలోపు రిజిస్ర్టేషన్‌ చేయిస్తానని, ఒకవేళ చేయించకపోతే డబ్బులు తిరిగి ఇస్తానని పోలీసులకు సమాధానం ఇచ్చాడు.  ఈ కేసులో కూడా సదరు షాడో నేత ప్రమేయం ఉండటంతో అటు కేసు నమోదు చేయకుండా.. ఇటు అగ్రిమెంట్‌ తేదీ వరకు వేచిచూడకుండా రాజును పోలీస్‌స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. తాను ఎంత చెప్పినా వినకుండా పోలీసులు పరుష పదజాలం తో దూషిస్తున్నారని, ఎన్‌కౌంటర్‌ చేస్తానని బెదిరిస్తున్నారని, ఎలాంటి కేసు లేకుండా పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి వేధి స్తున్నారని రాజు ‘ఆంధ్రజ్యోతి’తో వాపోయాడు. అగ్రిమెంట్‌ గడువు ఇంకా తీరలేదని, అయినా పో లీసులు తనను ఎం దుకు వేధిస్తున్నారని ప్రశ్నిస్తున్నాడు. ఈ మేరకు మంగళవారం గద్వాల సీఐకి, బుధ వారం ఎస్పీ కార్యా లయంలో ఫిర్యాదు చేశాడు. మరీ ఉన్నతా ధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి.

మరో ఘటనలో మద్దెలబండకు చెందిన గోకరన్నను గత నెల 24న హార్వెస్టర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక కాలు, చేయి విరిగింది. కాలు శాశ్వత వైకల్యానికి గురైంది. ఈ ఘటనలో అదే రోజు 66/2022 పేరుతో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అయితే ప్రమాదానికి కారణమైన హార్వెస్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. సాధారణంగా ఏ రోడ్డు ప్రమాదం జరిగినా.. వాటికి కారణమైన వాహనాలను పోలీసులు తమ కంట్రోల్‌లో ఉంచుకుంటారు. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఉంటే బీమా క్లెయిమ్‌ చేయిస్తారు. అయితే హార్వెస్టర్‌ను రెండు రోజులపాటు పోలీస్‌స్టేషన్‌లో ఉంచి పంపించారు. గోకరన్న టూవీలర్‌ను మాత్రం స్టేషన్‌లోనే ఉంచారు. సదరు హార్వెస్టర్‌కు ఇన్సూరెన్స్‌, పొల్యుషన్‌ సర్టిఫికెట్ల వాలిడిటీ 2021లోనే పూర్తయ్యింది. ఇలా జరిగినప్పుడు పోలీసులు రవాణాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వాటిని సీజ్‌ చేయాల్సి ఉంటుంది. కానీ రెండు మూడు సార్లు బాధితులతో పోలీసులే సెటిల్‌మెంట్‌కు ప్రయత్నించారని సమాచారం. ఈ ఘటన జరిగి నెల రోజులు దాటినా.. శాశ్వత వైకల్యానికి సంబంధించి మెడికల్‌ సర్టిఫికెట్లు కూడా తెప్పించుకోకపోవడం గమనార్హం. 


భూ పంచాయితీలూ అధికమే..

 ఇటీవలి కాలంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఊపందుకుని ప్లాట్ల ధరలు పెరిగాయి. దాంతో ఎక్కువ మంది వ్యవసాయ భూములపైన పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ భూముల ధరలూ విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతుంటే వాటికి సంబంధించిన వివాదాలు కూడా గతంలో కంటే రెట్టింపయ్యాయి. సాధారణంగా భూ లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో పోలీసులు కలుగజేసుకోకూడదు. కానీ మెజారిటీ పోలీస్‌ స్టేషన్లలో సివిల్‌ పంచాయతీల సెటిల్‌మెంట్లకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. అర్ధ, అంగ బలం ఉన్నవారితో మిలాఖత్‌ అవుతూ.. పేదలకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గద్వాల సర్కిల్‌ పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో కూడా ఈ వివాదాలు తీవ్రమయ్యాయి. పోలీసులు తమకు ఉన్న అధికారాలను అడ్డంపెట్టుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పోలీసుల నిబంధనలు వారికి అనుకూలమైన వారి దగ్గర ఒకలాగా.. వారికి అనుకూలంగా లేని వారి దగ్గర ఒకలా అమలు చేస్తున్నారు. ఉదాహరణకు ఓ గ్రామంలో ఒక రైతు రికార్డులో ఉన్నాడు. పొజిషన్‌లో లేడు. ఆ వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయిస్తే కోర్టుకు వెళ్లి పొజిషన్‌ ఆర్డర్‌ తెచ్చుకోవాలని పోలీసులు సూచించారు. ఇది వాప్తవానికి న్యాయబద్ధమైన ప్రక్రియనే. తమకు ఆ వ్యక్తి అనుకూలంగా లేకపోవడంతో న్యాయబ్ధమైన ప్రక్రియను సూచించి పంపించారు. అదే మండలంలో మరో గ్రామానికి చెందిన పోలీసులకు అనుకూలమైన వ్యక్తి రికార్డులో తాను ఉన్నానని, పొజిషన్‌లో లేనని చెప్పడంతో.. పోలీసులు సదరు సాగులో ఉన్న వ్యక్తిని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు కేసులు ఒకే తరహావి అయినప్పటికీ పోలీసుల చట్టం ఒక్కో చోట ఒక్కోలా పనిచేస్తుందనడానికి ఈ ఘటన అద్దం పడుతోంది. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో భూ లావాదేవీల పంచాయతీలు పోలీస్‌స్టేషన్లలో జరుగుతున్నాయి. క్రిమినిల్‌, సివిల్‌ కేసుల్లో సెటిల్‌మెంట్లకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయా మండలాల్లో స్థానికంగా పలుకుబడి ఉన్న షాడో నాయకుల సహకారంతో రెచ్చిపోతున్నారు. 


నా బండి స్టేషన్‌లో ఉంచారు

 నా బైక్‌ను హార్వెస్టర్‌ ఢీకొని నెల గడిచిపోయింది. నా బండిని స్టేషన్‌లో ఉంచారు. నా కొడుకును బండి కోసం పంపిస్తే ఇవ్వడం కుదరదని చెప్పారు. అదే నాకు తాకిన హార్వెస్టర్‌ను మాత్రం వదిలేశారు. కేసు ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వమంటే ఇవ్వడం లేదు. నేను హార్వెస్టర్‌ యజమాని ఇంటి ముందు బైఠాయిస్తే మాట్లాడుకుందామని పిలిచారు. పంచాయతీ తెగలేదు. నేను ఎన్నిసార్లు అడిగినా పోలీసులు స్పందించడం లేదు. గతంలో నేను ఒకరి దగ్గర భూమి కొనుగోలు చేసి కాస్తులో ఉన్నాను. నాపైనే చీటింగ్‌ కేసు నమోదు చేసి, జైలుకు పంపించారు. నేను సాగు చేసిన భూమిలో మొక్కలు నాటారు. నేను కొనుగోలుదారుడిని ఎవరైనా అక్రమంగా విక్రయిస్తే వారిపైన కేసు నమోదు చేయాలి. కానీ నా దగ్గర రిజిస్టర్‌ డాక్యుమెంట్లు ఉంటే నాకే అన్యాయం చేశారు. 

- గోకరన్న, బాధితుడు, మద్దెలబండ 

స్టేషన్‌కు పిలిచి బెదిరింపులు

 నేను నా సోదరుడు శివరాజు కలిసి మరో సోదరుడికి భూమి అమ్మకానికి అగ్రిమెంట్‌ చేసుకున్నాం. రూ.15 లక్షలు తీసుకుని అప్పులు చెల్లించుకున్నాను. మిగతా డబ్బులు ఇస్తే ఆగస్టు 10వ తేదీలోపు నేను రిజిస్ర్టేషన్‌ చేయాలి. నా భార్య భూమి విక్రయానికి అడ్డుపడుతోంది. ఇదే విషయంలో నన్ను స్టేషన్‌కు పిలిచారు. నేను భూమి రిజిస్ర్టేషన్‌ చేయకపోతే డబ్బులు వాపస్‌ ఇస్తానని చెప్పాను. అయినా గడువు ఇంకా ఉంది. ఒకవేళ నేను మోసం చేస్తే కేసు నమోదు చేయాలి. కానీ స్టేషన్‌కు పిలిచి పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తానని బెదిరిస్తున్నారు. నేను అప్పు చెల్లించిన వారి ప్రామిసరీ నోట్లు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. 

- రాజు, బాధితుడు, అడవిరావులచెరువు


ఆరోపణలు అవాస్తవం

 మల్దకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫ్రెండ్లీ పోలిసింగ్‌ విధానం అమలవుతోంది. అడివిరావులచెరువుకు చెందిన రాజు విషయంలో రూ. 20 లక్షలు తీసుకుని, డబ్బులు ఇవ్వను.. రిజిస్ర్టేషన్‌ చేయను.. అని అనడంతోనే నేను స్టేషన్‌కు పిలిచి విచారించాను. బాధితుడికి న్యాయం చేసేందుకు ప్రయత్నించాం. గోకరన్నకు రోడ్డు ప్రమాదం విషయంలో కూడా ఐదు రోజులపాటు హార్వెస్టర్‌ను స్టేషన్‌లో ఉంచాం. చార్జిషీట్‌లో అన్ని వివరాలు పొందుపర్చాం. కావాలనే కొందరు దీనిపై రాద్ధాంతం చేస్తున్నారు. బాధితుడు, నిందితుల తరపు వారు సెటిల్‌మెంట్‌ చేసుకుంటున్నారు. అది మాకు సంబంధం లేదు. మేము కేసు ప్రకారం చార్జిషీట్‌ వేస్తాం.

- శేఖర్‌, ఎస్‌ఐ, మల్దకల్‌

Updated Date - 2022-07-04T04:41:13+05:30 IST