కదిరిలో కబ్జా గ్యాంగ్‌

ABN , First Publish Date - 2022-06-24T05:36:26+05:30 IST

అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, ప్రజాప్రతినిధులు పట్టణంలో విచ్చలవిడిగా కబ్జాలకు తెగబడుతున్నారు.

కదిరిలో కబ్జా గ్యాంగ్‌

వివాదాలున్న ప్రైవేటు స్థలాలపైనా కన్ను

చొరబడి బెదిరింపులు

సెటిల్మెంట్‌ చేసుకోవాలంటూ అధికారుల ద్వారా ఒత్తిళ్లు

మాట వినకుంటే లిటికేషన్లతో ఇబ్బందులు

కదిరి

అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, ప్రజాప్రతినిధులు పట్టణంలో విచ్చలవిడిగా కబ్జాలకు తెగబడుతున్నారు. విడివిడిగా ఎందుకని ఏకంగా గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. వీరిని కబ్జాగ్యాంగ్‌గా పట్టణవాసులు పిలుస్తున్నారు. వీరు నిత్యం వంకలు, వాగులు, ప్రభుత్వ స్థలాలు, అసైన్డ భూములు, చివరకు వివాదం ఉన్న ప్రైవేటు భూములను సైతం వదలకుండా ఆక్రమించేస్తున్నారు. శ్మశానాలను కూడా వదలట్లేదు. ప్రైవేటు భూముల్లో వివాదం ఉంటే రంగ ప్రవేశం చేసి, సెటిల్మెంట్‌ చేస్తున్నారు. అది కుదరకపోతే ప్రభుత్వ అధికారుల అండ, తమ అధికార బలంతో వారిని ఇబ్బందులు పెడుతున్నారు. దశాబ్దాల కిందటి ఆస్తికైనా వీరు వివాదాలు సృష్టించి, యజమానులను భయభ్రాంతులకు లోనుచేస్తున్నారు. వారి ఆగడాలతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. వారిని నిలువరించాల్సిన ప్రజాప్రతినిధి కూడా వారికే వత్తాసు పలుకుతూ, సన్మానాలు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వ ఆస్తులను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


యథేచ్ఛగా ఆక్రమణలు

పట్టణ శివార్లలో భూముల విలువ రోజురోజుకీ పెరుగుతోంది. దీనిని క్యాష్‌ చేసుకునేందుకు కబ్జాగ్యాంగ్‌ ప్రభుత్వ, అసైన్డ స్థలాలపై గురిపెట్టింది. రైల్వేస్టేషన సమీపంలో ఉన్న కందికుంట నారాయణమ్మ కాలనీలో సర్వే నెం.229/బీలో కొంతమంది స్థలం కొని, ఇళ్లు నిర్మించుకున్నారు. అప్పట్లో ఇది ప్రభుత్వ అసైన్డ భూమి. దానిని పక్క సర్వే నెంబరు వేసి, రిజిస్టర్‌ చేశారు. కొన్నవాళ్లందరూ ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పటికి దాదాపు 16 సంవత్సరాలైంది. ఇప్పుడు ఆ భూమిని తాము కొనుగోలు చేశామంటూ కొంతమంది బెదిరిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. వారి వెనుక స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇళ్ల యజమానులను బెదిరించి, ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఇదే గ్యాంగ్‌ రైల్వేస్టేషన పక్కన కొంత స్థలాన్ని ఇప్పటికే కబ్జా చేసినట్లు తెలుస్తోంది. పట్టణంలోని టీఎ్‌సఎస్‌ రైస్‌మిల్లు పక్కన ప్రభుత్వ స్థలం సర్వేకి సంబంధం లేని వ్యక్తి ద్వారా దరఖాస్తు చేయించారు. ఆయనకు స్థలంతో ఎటువంటి సంబంధం లేదని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. దీని వెనుక కూడా ఆ కబ్జాగ్యాంగే ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఎ్‌సఎస్‌ రైస్‌మిల్లులో కూడా ప్రభుత్వ స్థలం ఉన్నట్లు చెప్పి ప్రైవేటు వ్యక్తులను కూడా బెదిరిస్తున్నట్లు సమాచారం. గతంలో జడ్జి బంగ్లా వద్ద రోడ్లు, రహదారుల శాఖ స్థలాన్ని ఆక్రమించి, అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. అధికార పార్టీకి చెందిన కొంతమంది పెనుగొండరాయుని చెరువుకుపోయే వంకపోరంబోకు భూమిని అక్రమించుకుని, బేసిమట్టాలు వేశారు. ఈ భూమి విలువ రూ.కోటికిపైగా ఉంది. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే టీడీపీ నాయకులు.. జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆక్రమణలు తొలగిస్తామంటూ అధికారులు కాలం వెల్లబుచ్చుతున్నారు. కుమ్మరవాండ్లపల్లిలోని ఓ ప్రైవేటు స్థలానికి సంబంధించి ఇద్దరి మధ్య నెలకొన్న వివాదంలో కబ్జా గ్యాంగ్‌ చొరబడి, బెదిరించే ప్రయత్నం చేసినట్లు బాధితులు చెబుతున్నారు.


సెటిల్మెంట్‌ కాకుంటే లిటికేషనే..

కబ్జా గ్యాంగ్‌ మొదట సెటిల్మెంట్‌ చేసుకోవాలని అధికారులతో చెప్పిస్తుంది. లేదంటే ఆ స్థలాల్లో లిటికేషన పాయింట్లను అడ్డం పెట్టుకుని, బెదిరింపులకు దిగుతుంది. అవసరమైతే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమ అధికార బలంతో ప్రైవేటు వ్యక్తులను సైతం వేధిస్తున్నట్లు సమాచారం. టీఎ్‌సఎస్‌ రైస్‌మిల్లు స్థలం తగాదాను ఆసరాగా చేసుకుని, రెవెన్యూ అధికారుల ద్వారా సెటిల్మెంట్‌ చేసుకోవాలని చెప్పించినట్లు బాధితులు తెలిపారు. అందుకు ససేమిరా అనడంతో తమ అఽధికారబలంతో బాధితులపైనే కేసు పెట్టించినట్లు తెలిసింది. అనేక విధాలుగా లిటికేషన్లు పెట్టి, ఇబ్బందుల పాలుచేస్తున్నట్లు తెలిసింది. కందికుంట నారాయణమ్మ కాలనీలో కూడా ఇదే తంతు కొనసాగుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. 16 సంవత్సరాల కిందట కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు క్రమబద్దీకరణ చేసుకోండంటూ కొంతమంది దళారులు వచ్చినట్లు చెబుతున్నారు. లేదంటే ఎక్స్‌కవేటర్లతో ఇళ్లు పడగొడతామని బెదిరిస్తున్నట్లు సమాచారం. దీంతో వారు భయపడిపోతున్నారు.


పట్టించుకోని అధికారులు

పట్టణంలో కబ్జాగ్యాంగ్‌ ఆగడాలను కట్టడి చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. పెనుగొండరాయుని చెరువు వంక ఆక్రమించుకున్నా.. పట్టించుకోలేదు. టీఎ్‌సఎస్‌ రైస్‌ మిల్లులో కొలతలు వేయాలని సంబంధంలేని వ్యక్తి దరఖాస్తు చేస్తే రెవెన్యూ అధికారులు నిబంధనలు పాటించకుండా ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. కేవలం అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే అధికారులు తమకు నోటీసులు పంపారని బాధితులు వాపోతున్నారు. కందికుంట నారాయణమ్మ కాలనీకి సంబంధించి అసైన్డ భూమిపై వివాదం కొనసాగుతోంది. ఇళ్లు కట్టుకున్న యజమానులు.. తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ అనేకసార్లు తిరుగుతున్నా పట్టించుకోలేదు. వ్యవసాయ భూమిగా 1బీ ఇచ్చిన అధికారులు.. ఇళ్ల యజమానుల అందోళనతో దానిని రద్దు చేశారు. కాలనీలో భూవివాదంపై రెవెన్యూ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా కబ్జాగ్యాంగ్‌ బారి నుంచి తమను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2022-06-24T05:36:26+05:30 IST