తప్పే తేల్చండి!

ABN , First Publish Date - 2022-01-19T08:02:36+05:30 IST

తప్పే తేల్చండి!

తప్పే తేల్చండి!

అక్రమాలు జరిగాయని నివేదిక ఇవ్వండి

‘నీరు-చెట్టు’ పనులపై సర్కారు ఒత్తిడి

వారంలో రెండు అంతర్గత మెమోలు

పాత బిల్లులు ఎగ్గొట్టడమే లక్ష్యం

హైకోర్టు ఆదేశాల అమలుపైనా తాత్సారం

ఇతర శాఖలతోనూ తనిఖీకి యత్నం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

తప్పు జరిగితే ఆ సంగతి తేల్చాల్సిందే. కానీ... ఏమీ లేకపోయినా సరే, ‘తప్పు జరిగిందని చెప్పండి. అక్రమాలున్నాయని నివేదిక ఇవ్వండి’ అని ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘నీరు-చెట్టు’ పనులకు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లపై కక్ష సాధించేందుకు నిరంతర ప్రణాళికలు అమలవుతున్నాయని తెలుస్తోంది. ఎప్పుడో 2017లో చేపట్టిన పనులపై ఇప్పుడు పరిశీలన చేసి నివేదికలు ఇవ్వాలంటూ కింది స్థాయి అధికారులపై సర్కారు ఒత్తిడి తెస్తోంది. నీరు-చెట్టు పనులను తనిఖీచేసి బిల్లులు చెల్లించాలంటూ జల వనరులశాఖకు చెందిన మైనర్‌ ఇరిగేషన్‌ విభాగం ఇంజనీరింగ్‌ అధికారులు సిఫారసు చేస్తూ ఇచ్చిన నివేదికను ఆ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. సొంత ఇంజనీరింగ్‌ అధికారుల నివేదికలనూ బుట్టదాఖలు చేస్తూ, మళ్లీ మళ్లీ ఈ పనులపై తనిఖీలు చేయిస్తోంది. విజిలెన్స్‌ దర్యాప్తు, అంతర్గత దర్యాప్తులనూ చేపట్టింది. ఒకవేళ అవినీతి జరిగితే గతంలో ఆ పనులన్నీ సక్రమంగా జరిగాయని ధ్రువీకరించిన ఇంజనీరింగ్‌ సిబ్బందిపై వేటు వేయాలి. అలా చేస్తే జల వనరుల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులలో తిరుగుబాటు వస్తుందని గ్రహించిన ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యల జోలికి వెళ్లకుండా కాంట్రాక్టర్లపై కక్ష సాధించే ధోరణికి దిగుతున్నారన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.


హైకోర్టు ఉత్తర్వుల అమలులో తాత్సారం..

నీరు-చెట్టు కింద తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించాలంటూ 330మంది కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి నెల రోజుల్లో బిల్లులు చెల్లించాంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేయడంలోనూ ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఆ పనుల్లో అక్రమాలు జరిగాయని న్యాయస్థానానికి నివేదించేందుకు జల వనరుల శాఖ సిద్ధమైంది. ఇందుకోసం కిందిస్థాయి ఇంజనీరింగ్‌ అధికారులపై ఒత్తిడి పెంచేలా ఈ నెల 4, 11 తేదీల్లో అంతర్గత మెమోలు జారీ చేసింది. నీరు-చెట్టు పనులకు నాణ్యత పరిశీలన జరిపి ఈ నెల 11వ తేదీలోగా నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేసిన మెమోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.


అవకతవకలు తేల్చని విజిలెన్స్‌ నివేదిక..

రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా 2017 నుంచి నీరు-చెట్టు కార్యక్రమం కింద చెరువుల్లో పూడిక తీత తదితర పనులు చేపట్టారు. ఈ పనుల ప్రభావంతో రాష్ట్రంలో భూగర్భజల మట్టాలు పెరిగాయని నివేదికలు వెల్లడించాయి. నీరు-చెట్టు కింద చేపట్టిన 28,857 పనులకు ప్రభుత్వం రూ.1,707 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో సీఎ్‌ఫఎంఎ్‌సలో రూ.1,277 కోట్లకు టోకెన్‌ కూడా పడి బిల్లులు పెండింగ్‌ పడ్డాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా నీరు-చెట్టు కార్యక్రమంపై అవినీతి ఆరోపణలు చేసింది. 2019లో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2020 సెప్టెంబరు 4న నీరు-చెట్టు పనులపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. 799 పనులపై విజిలెన్స్‌ తనిఖీ చేపట్టి నాణ్యతా ప్రమాణాలపై సంతృప్తి వ్యక్తంచేసింది. ఎం.బుక్‌లో కొలతలు, వాస్తవ కొలతలు సరిపోయాయని నివేదిక ఇచ్చింది. దీంతో నీరు-చెట్టు పనులకు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జల వనరుల శాఖ కాకుండా ఇతర ఇంజనీరింగ్‌ శాఖల అధికారులతో ఆ పనులపై తనిఖీలు చేయించాలని ప్రభుత్వం భావించింది. అయితే.. ఐదేళ్ల కిందట చేసిన పనులకు ఇప్పుడు తనిఖీలు నిర్వహించడం సాధ్యం కాదని పలు శాఖల ఇంజనీర్లు తేల్చి చెప్పారు. మరోవైపు బిల్లులు చెల్లించేందుకు న్యాయస్థానం ఇచ్చిన గడువు ముంచుకొస్తుండడంతో నీరు-చెట్టు పనులపై నివేదికలు ఇవ్వాలంటూ మైనర్‌ ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. గతంలో తమ సహోద్యోగి ఇచ్చిన నివేదికకు భిన్నంగా పనుల్లో అక్రమాలు జరిగినట్లు నివేదికలు ఇవ్వాలని అంతర్గతంగా అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఎప్పుడో జరిగిన పనులకు ఇప్పుడు తనిఖీలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. గతంలో చేసిందంతా తప్పేనన్నట్లుగా వ్యవహరించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది చిన్న, సన్నకారు రైతులపై కక్షసాధింపు ధోరణే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి న్యాయస్థానం ఆదేశాల మేరకు నెలరోజుల్లో బిల్లులు చెల్లించాల్సి ఉంది. చెల్లించకపోవడంపై సంజాయిషీని వెతుక్కునే పనిలో జల వనరుల శాఖ ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2022-01-19T08:02:36+05:30 IST