రామాపురం భూముల లెక్కలు తేల్చండి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-08-15T10:49:14+05:30 IST

నడిగూడెం మండలం రామాపురం పరిధిలోని సర్వేనెంబర్‌ 190లో భూముల లెక్కలు తేల్చాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు.

రామాపురం భూముల లెక్కలు తేల్చండి : కలెక్టర్‌

నడిగూడెం, ఆగస్టు 14 : నడిగూడెం మండలం రామాపురం పరిధిలోని సర్వేనెంబర్‌ 190లో భూముల లెక్కలు తేల్చాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. భూములను శుక్రవారం ఆయన పరిశీలించి అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. సుమారు 2,200 ప్రభుత్వ భూముల్లో అటవీశాఖకు కేటాయించిన సుమారు 260 ఎకరాలు పోగా, మిగిలిన భూములలో రైతుల వివరాలను పరిశీలించారు. భూమిపై కబ్జాలో ఉన్నవారు, లేనివారు, పాస్‌పుస్తకాలు ఉండి భూమిలేనివారు అక్రమంగా పట్టాలు పొందిన వారి వివరాలను రికార్డు పరంగా నమోదు చేయలన్నారు. సర్వే నెంబరులోని భూమి మొత్తాన్ని సర్వేచేసి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట కోదాడ ఆర్డీవో కిషోర్‌కుమార్‌, తహసీల్దార్‌ జవహర్‌లాల్‌, ఎంఆర్‌ఐ గోపాలకృష్ణ, సర్వేయర్‌ నాగేశ్వరావులు ఉన్నారు. 


హరితహారం మొక్కలను నిర్లక్ష్యం చేస్తే చర్యలు 

పెన్‌పహాడ్‌: హరితహారంలో భాగంగా సూర్యాపేట- నేరేడుచర్ల రోడ్డు వెంట నాటిన మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి హెచ్చరించారు. పెన్‌పహాడ్‌ మండలం లోని జానారెడ్డినగర్‌ నుంచి దూపహాడ్‌ వరకు రోడ్డు వెంట నాటిన మొక్కలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు వెంట నాటిన మొక్కలను మూగజీవాలు తినకుండా కంచెలను ఏర్పాటుచేయాలని అన్నారు. ఆయన వెంట డీఆర్డీవో పీడీ కిరణ్‌కుమార్‌, ఎంపీడీవో వేణుమాధవ్‌, తహసీల్దార్‌ ఆంజనేయులు, ఏపీవో రవి పాల్గొన్నారు.

Updated Date - 2020-08-15T10:49:14+05:30 IST