ప్రతి జిల్లాకు కోవిడ్-19 టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు అసాధ్యం : మహారాష్ట్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-05-29T22:53:06+05:30 IST

మహారాష్ట్రలోని 36 జిల్లాల్లో, ప్రతి జిల్లాకు ఒక పూర్తి స్థాయి కోవిడ్-19

ప్రతి జిల్లాకు కోవిడ్-19 టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు అసాధ్యం : మహారాష్ట్ర ప్రభుత్వం

ముంబై : మహారాష్ట్రలోని 36 జిల్లాల్లో, ప్రతి జిల్లాకు ఒక పూర్తి స్థాయి కోవిడ్-19 టెస్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని బోంబే హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పూర్తి స్థాయి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ,  భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు తెలిపింది. 250 కిలోమీటర్ల పరిథిలో ఒక టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉండాలని ఐసీఎంఆర్ నిర్దేశించిందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామని వివరించింది. 


మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన మత్స్యకారుడు ఖలీల్ ఈ నెల 22న దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బోంబే హైకోర్టు విచారణ జరిపింది. 


ప్రతి జిల్లాకు ఒక పూర్తి స్థాయి కోవిడ్-19 టెస్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.


రాష్ట్ర ప్రభుత్వ శైలి పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం బాధ్యతారహితంగా స్టేట్‌మెంట్ ఇస్తోందని వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని అంగీకరించారు. కోవిడ్-19 టెస్టింగ్ ఫెసిలిటీ ప్రతి జిల్లాకు ఒకటి ఉండాలని తెలిపారు. 


హైకోర్టు ప్రతిస్పందిస్తూ, ప్రభుత్వ వైఖరి ఆమోదయోగ్యం కాదని, ఈ సమస్యను వచ్చే వారానికి పరిష్కరించాలని ఆదేశించింది.


Updated Date - 2020-05-29T22:53:06+05:30 IST