దక్షిణాదిన సుప్రీం బెంచి ఏర్పాటు చేయండి

ABN , First Publish Date - 2021-07-27T07:25:33+05:30 IST

దక్షిణాదిన సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌,

దక్షిణాదిన సుప్రీం బెంచి ఏర్పాటు చేయండి

  • ఉపరాష్ట్రపతి, సీజేఐకు బార్‌ కౌన్సిల్‌ చైర్మన్ల విజ్ఞప్తి


న్యూఢిల్లీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): దక్షిణాదిన సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాల బార్‌ కౌన్సిల్‌ చైర్మన్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో వారిని వేర్వేరుగా కలిసి వినతి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఏ నరసింహా రెడ్డి విలేకరులతో మాట్లాడారు.


దక్షిణాది రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ చాలా కాలంగా ఉందని ఆయన తెలిపారు. సీజేఐ రమణ తెలుగు రాష్ట్రాలకు చెందినవారని, కాబట్టి ఈ అంశంపై ఆయనకు అవగాహన ఉందని తెలిపారు. ధర్మాసనం సాధించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నామన్నారు.


‘‘దక్షిణాది నుంచి సుప్రీంకోర్టులో 20-30 ఏళ్లుగా చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేసులు పరిష్కరించాలంటే మరో 10-15 ఏళ్లు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.’’ అని అన్నారు. అంతేకాకుండా, దక్షిణాదినే కాకుండా కోల్‌కతా, ముంబై, ఢిల్లీలో ఒక్కొక్క ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తమ విజ్ఞప్తికి వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. త్వరలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజును కూడా కలుస్తామని చెప్పారు.


Updated Date - 2021-07-27T07:25:33+05:30 IST