Jun 11 2021 @ 01:10AM

హైదరాబాద్‌లో సెట్‌ చేశారు!

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. సాలా క్రాస్‌బ్రీడ్‌... అనేది ఉపశీర్షిక. పూరి జగన్నాథ్‌ దర్శకుడు. బాక్సింగ్‌ నేపథ్యంలో సినిమా రూపొందుతోంది. హైదరాబాద్‌లో త్వరలో చిత్రీకరణ పునఃప్రారంభించనున్నారు. కొత్త షెడ్యూల్‌ కోసం ప్రత్యేకంగా సెట్‌ వేశారని తెలిసింది. కరోనా ఇంకాస్త తగ్గుముఖం పట్టి, పరిస్థితులు చక్కబడ్డాక చిత్రీకరణ చేయాలనుకుంటున్నారు. విదేశాల్లో ప్లాన్‌ చేసిన షెడ్యూల్‌ అంతా హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. కరోనా నేపథ్యంలో చిత్రబృంతంతో కలిసి విదేశాలు వెళ్లడం కంటే భాగ్యనగరంలో చేయడం ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చారట. జాకీ చాన్‌ సహా పలువురు హాలీవుడ్‌ హీరోల చిత్రాలకు స్టంట్స్‌ రూపొందించిన ఆండీ లాగ్‌ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఆయనతో పాటు కొంతమంది విదేశీ బాక్సర్లను హైదరాబాద్‌ తీసుకురానున్నారు. మిగతా షూటింగ్‌ అంతా ఇక్కడే పూర్తి చేసేలా ప్లాన్‌ చేశారట. ఈ సినిమా కోసం మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో విజయ్‌ దేవరకొండ శిక్షణ తీసుకున్నారు. ఆయనకు జంటగా అనన్యా పాండే, కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత దర్శకుడు శివ నిర్వాణతో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో ఓ సినిమా, దర్శకుడు సుకుమార్‌తో మరో సినిమా చేయనున్నారు విజయ్‌ దేవరకొండ.