సెస్‌.. ప్చ్‌!

ABN , First Publish Date - 2022-05-12T05:24:33+05:30 IST

గ్రంథాలయ సంస్థకు నిబంధనల మేరకు సెస్‌ చెల్లించాల్సినా చెల్లించరు. ఈ నిధుల కోసం నోటీసులు పంపిస్తే పట్టించుకోరు.

సెస్‌.. ప్చ్‌!

సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనం

8 శాతం నిధులకు నోచని గ్రంథాలయ సంస్థ  

దాదాపు రూ.15 కోట్ల బకాయిలు

సర్కారు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న స్థానిక సంస్థలు 

మున్సిపాలిటీలదీ అదే జాడ్యం

నోటీసులకూ స్పందించని వైనం 

ఆఖరుకు సర్కారూ పైసా విదిల్చదు!!

కోర్టుకు వెళ్లే యోచనలో గ్రంథాలయ బాధ్యులు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి సంగారెడ్డి, మే 11 : గ్రంథాలయ సంస్థకు నిబంధనల మేరకు సెస్‌ చెల్లించాల్సినా చెల్లించరు. ఈ నిధుల కోసం నోటీసులు పంపిస్తే పట్టించుకోరు. వెరసి ప్రజలకు విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయాలపై జిల్లాలోని స్థానిక సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న గ్రంథాలయాలను గాడిన పెట్టేందుకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టిసారించడం లేదు. స్థానిక సంస్థల నుంచి సెస్‌ రూపంలో రావాల్సి ఉన్న రూ.15.కోట్ల బకాయిల కోసం జిల్లా గ్రంథాలయ సంస్థ నోటీసుల మీద సోటీసులు పంపిస్తున్నా కనీస స్పందన ఉండడం లేదు. 


రూ.15 కోట్ల బకాయిలు

 సంగారెడ్డి జిల్లాలోని స్థానికసంస్థల నుంచి గ్రంథాలయ సంస్థకు రూ.15కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది.  స్థానిక సంస్థలకు యేటా వచ్చే ఆదాయంలో 8శాతం నిధులను సెస్‌ రూపంలో గ్రంథాలయ సంస్థకు చెల్లించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలను స్థానిక సంస్థలు బేఖాతరు చేస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో జిల్లాలో ఉన్న పటాన్‌చెరు, రామచంద్రాపురం డివిజన్లు. గ్రంథాలయాల సెస్‌ను అసలు చెల్లించడం లేదు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆయా డివిజన్‌ అధికారులకు నోటీసుల మీద నోటీసులు పంపినా స్పందన లే దు. ఈ రెండు డివిజన్ల నుంచే సుమారు రూ.10కోట్ల బకాయిలను జిల్లా గ్రంథాలయ సంస్థకు     చె ల్లించాల్సి ఉన్నది. 


మున్సిపాలిటీలదే అదే తీరు..

జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలదీ దాదాపు అదే తీరు. ఆయా మున్సిపాలిటీలు సుమారు రూ.2.75 కోట్ల బకాయిలను జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సి ఉన్నది. ఇటీవలే జిల్లా గ్రంథాలయ సంస్థ నోటీసు పంపడంతో జహీరాబాద్‌ మున్సిపల్‌ అధికారులు రూ.3.34 లక్షలను చెల్లించారు. అయినా ఈ మున్సిపాలిటీ ఇంకా సుమారు రూ.30లక్షలను సెస్‌ రూపంలో జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సి ఉన్నది. మిగిలిన మున్సిపాలిటీల్లో బొల్లారం రూ.65లక్షలు, తెల్లాపూర్‌ రూ.60 లక్షలు, అమీన్‌పూర్‌ రూ.60 లక్షలు, నారాయణఖేడ్‌ రూ.20లక్షలు, అందోలు-జోగిపేట రూ.40లక్షలు చెల్లించాలి. ఆయా మున్సిపాలిటీలకు జిల్లా గ్రంఽథాలయ సంస్థ ఎన్ని నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడమే లేదని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. మున్సిపాలిటీలలో సంగారెడ్డి, సదాశివపేట నుంచి మాత్రమే రెగ్యులర్‌గా ‘సెస్‌’ తమ ఖాతాలో జమవుతున్నదని ఆ వర్గాలు తెలిపాయి. ఇక 647 గ్రామపంచాయతీల్లో 350కు పైగా గ్రామ పంచాయతీలు పదేళ్లుగా సెస్‌ను గ్రంథాలయ సంస్థకు  చెల్లించడమే లేదని ఆ వర్గాలు వివరించాయి. 


సర్కారూ నిధులివ్వదు

గ్రంథాలయాల నిర్వహణకు ప్రభుత్వం పైసా ఇవ్వడం లేదు. బడ్జెట్‌లో సైతం నిధులు కేటాయించడం లేదు. కనీసం స్థానిక సంస్థల నుంచి సెస్‌ రూపంలో రావాల్సిన నిధుల కోసమైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదు. దాంతో జిల్లాలో గ్రంథాలయాల నిర్వాహణ, మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. జిల్లాలోని అనేక గ్రంథాలయాల్లో ఫర్నీచర్‌, ఫ్యాన్లు లేక పాఠకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


నిర్వహణకే నెలకు రూ.30లక్షలు

సంగారెడ్డిలోని జిల్లా గ్రంథాలయంతోపాటు జి ల్లాలోని వివిధ ప్రాంతాల్లో 19 శాఖ గ్రంథాలయాలున్నాయి. జిల్లాలోని 20 గ్రంథాలయాల నిర్వహణకు ప్రతి నెలా సుమారు రూ.30 లక్షలు కావాల్సి ఉం టుంది. సంగారెడ్డి  జిల్లాలోని గ్రంథాలయాల సిబ్బంది జీతాలకు, రిటైర్డ్‌ అయిన వారికి పెన్షన్‌ రూపం లో ఏడాదికి రూ.87 లక్షలు చెల్లించాల్సి వస్తున్నది. కొన్ని స్థానిక సంస్థల నుంచి అడపాదడపా సెస్‌ రూపంలో వస్తున్న నిధులను వీటికే వినియోగించాల్సి వస్తుందని గ్రంథాలయ సంస్థ వర్గాలు తెలిపాయి. 


కోర్టుకు వెళ్లాల్లి వస్తుందేమో!

- నరహరిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, సంగారెడ్డి

స్థానిక సంస్థల నుంచి గ్రంథాలయ సంస్థకు రావాల్సిన సెస్‌ బకాయిల చెల్లింపుల కోసం కోర్టుకు వెళ్లాల్సి వస్తుందేమో. బకాయిల కోసం ఎన్నిసార్లు నోటీసులు పంపినా కొన్ని స్థానిక సంస్థలు స్పందించడం లేదు.  అందుకే ఆయా స్థానిక సంస్థలపై కోర్టుకు వెళ్లి నోటీసులు పంపే యోచనలో ఉన్నాం. 

Read more