సదుపాయాలు లేకుండా సేవలు...!

ABN , First Publish Date - 2021-05-07T04:35:53+05:30 IST

‘కరోనా బాధితులు వారికి నచ్చిన ఆసుపత్రులకు నేరుగా వెళ్లి చేరవచ్చు. రిపోర్టు లేకపోయినా లక్షణాలు కనిపిస్తే అదే ఆసుపత్రిలో సిటీ స్కాన్‌ చేయించుకుని దీని ఆధారంగా చేరవచ్చు. ఏదో ఒక కారణం చెప్పి ఎవరినీ వెనక్కి పంపించడానికి వీల్లేదు’ ఇదీ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్కు అధికారులు చెబుతున్న మాట.

సదుపాయాలు లేకుండా సేవలు...!
వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్కు సదుపాయం ఉన్న ఎస్‌.కోట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి

అక్కరకు రాని వైఎస్‌ఆర్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు

 ఆక్సిజన్‌కు కేంద్రాసుపత్రి, మిమ్స్‌ దిక్కు

 శృంగవరపుకోట, మే 6: ‘కరోనా బాధితులు వారికి నచ్చిన ఆసుపత్రులకు నేరుగా వెళ్లి చేరవచ్చు. రిపోర్టు లేకపోయినా లక్షణాలు కనిపిస్తే అదే ఆసుపత్రిలో సిటీ స్కాన్‌ చేయించుకుని దీని ఆధారంగా చేరవచ్చు. ఏదో ఒక కారణం చెప్పి ఎవరినీ వెనక్కి పంపించడానికి వీల్లేదు’ ఇదీ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్కు అధికారులు చెబుతున్న మాట.  క్షేత్ర స్థాయిలో ఇందుకు విరుద్దంగా జరుగుతోంది. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్కు ఉన్న అనేక ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఇక్కడకు వచ్చేవారిలో ఆక్సిజన్‌ అవసరం ఉన్న వారిని కేంద్రాసుపత్రి(మహారాజ ఆసుపత్రి), మిమ్స్‌కు పంపించేస్తున్నారు. ఆ ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ అవసరమయ్యే బెడ్‌లు కరువవుతున్నాయి. బెడ్‌లు ఖాళీ అయ్యే వరకు క్యాజువాల్టీలో ఉంచి వైద్యం చేస్తున్నారు. వేపాడ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి ఊపిరి అందకపోవడంతో బుధవారం సాయంత్రం శృంగవరపుకోట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తీసుకువచ్చారు. 70కు దిగువకు పల్స్‌ పడిపోవడంతో కేంద్రాసుపత్రికి రిఫర్‌ చేశారు. అక్కడే చెరో 50 బెడ్‌లతో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్కులో రెండు ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. కానీ వాటి లో సరిపడినంత ఆక్సిజన్‌ నిల్వలు లేకపోవడంతో కేంద్రాసుపత్రికి పంపినట్లు సీహెచ్‌సీ వైద్యులు చెబుతున్నారు. కేంద్రాసుపత్రిలో బెడ్‌లు ఖాళీగా లేక గురువారం సాయంత్రం 3గంటల వరకు క్యాజువాల్టీలో చికిత్స అందించారు. ఆ తర్వాత మిమ్స్‌కు తరలించారు. పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. జిల్లాలో మిమ్స్‌, మహారాజా, పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు కలిపి 31 వరకు వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ నెట్‌వర్కులోనివి కొవిడ్‌ సేవల కోసం అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ సామాజిక ఆసుపత్రుల్లో బెడ్‌లకు అక్సిజన్‌ సిలిండర్‌ల ద్వారా సేవలు అందిస్తున్నారు. ఒక సిలిండర్‌ ఒక రోగికి నాలుగు గంటలకంటే ఎక్కువ రాదు. ఒక్కో ఆసుపత్రిలో 10నుంచి 15 సిలిండర్ల వరకు మాత్రమే ఉన్నాయి. సిలిండర్‌ నిండుకుంటే మరొకటి సమకూర్చుకోవడం సీహెచ్‌సీలకు కష్టసాధ్యమవుతోంది. ఈ పరిస్థితిలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోయిన వారిని రిఫర్‌ చేయకతప్పని పరిస్థితి వస్తోంది. ఆరోగ్య శ్రీ నెట్‌ వర్కు ఉన్న  ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్‌ల సదుపాయాలు లేవు. లెక్కల్లో 50 బెడ్‌లు చూపించినప్పటికీ 5నుంచి 10 మాత్రమే సెంట్రలైజ్డ్‌ ఆక్సిజన్‌ అందించే సదుపాయం ఉంది. కొన్నటిలో 20పైబడి బెడ్‌లు ఉన్నప్పటికీ సెంట్రలైజ్డ్‌ ఆక్సిజన్‌కు ఏర్పాటు చేసిన పైపులు సరిగా పని చేయడం లేదు. ప్రైవేటు నెట్‌ వర్కు ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ అధికారులు అందించిన చేయూత ప్రభుత్వ సామాజిక ఆసుపత్రులకు అందించి ఉంటే ఈ కష్టకాలంలో మరింతగా సేవలు అందేవని పలువురు అంటున్నారు. 


Updated Date - 2021-05-07T04:35:53+05:30 IST