ప్రయాణం అయోమయం

ABN , First Publish Date - 2020-05-22T10:36:58+05:30 IST

రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రారంభమైన ఆర్టీసీ బస్‌ సర్వీసులు తొలిరోజు మ ధ్యాహ్నానికే

ప్రయాణం అయోమయం

ప్రారంభించిన రోజే ఆగిన బస్సులు

కలెక్టర్‌ ఆదేశాలతో నిలిచిన సర్వీసులు

ఒంగోలు డిపో నుంచి బస్సులు బంద్‌

ఇతర డిపోల నుంచి ఒంగోలుకు రవాణా లేదు

బస్టాండ్‌లో చిక్కుకున్న ప్రయాణికులు


ఒంగోలు (ప్రగతిభవన్‌)మే 21 : రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రారంభమైన ఆర్టీసీ బస్‌ సర్వీసులు తొలిరోజు మధ్యాహ్నానికే నిలిచిపోయాయి. బస్‌లు నడపడానికి అధికార యంత్రాంగం చేసిన కసరత్తు నిరుపయోగమైంది. కలెక్టర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు ఒంగోలు నగరం రెడ్‌ జోన్‌ పరిధిలో ఉన్నందున సర్వీసులను నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఒంగోలు డిపో నుంచి బస్‌లు నడపలేమని అధికారులు తెలిపారు.


తొలిరోజు జిల్లాలో..106 సర్వీసులు

రాష్ట్రప్రభుత్వం రవాణా కార్యకలాపాలు ప్రారంభించే చర్యల్లో భాగంగా నడిపిన ఆర్టీసీ సర్వీసులు జిల్లాలోని ఎనిమిది డిపోల నుంచి ఉదయం 7 నుంచి రాత్రి 7గంటల వరకు 106 సర్వీసులు నడిపామని ఆర్‌ఎం విజయగీత చెప్పారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సర్వీసులు నడిపామని చెప్పారు. బస్‌లలో భౌతికదూరం పాటించడం వల్ల ప్రజల నుంచి స్పందన అధికంగా ఉందన్నారు.


ఒంగోలు నుంచి బస్‌లు బంద్‌ 

ఒంగోలు నగరంలో కరోనా కేసులు 34 ఉన్నందున రెడ్‌జోన్‌ పరిధిలోకి వెళ్లడంతో ఒంగోలు డిపో నుంచి బస్‌ సర్వీసులు నిలిపివేయాలన్న కలెక్టర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి ఒంగోలు డిపో పరిధిలో ఏ ఒక్క బస్‌ బయటకు రాదు. అలాగే ఇతర డిపోల నుంచి కూడా ఒంగోలు నగరానికి బస్‌లు రావని అధికారులు తెలిపారు. బయట జిల్లాల నుంచి నడిచే బస్‌లు బైపాస్‌ మీదుగా గమ్యస్థానానికి వెళ్తాయి తప్ప డిపో లోపలకు రావని, ప్రజలు ఈ మార్పును గమనించాలని కోరారు.


డిపోలో చిక్కుకు పోయిన ప్రయాణికులు

గురువారం నుంచి బస్‌లు నడుస్తుండటంతో లాక్‌డౌన్‌ కారణంగా బంధువుల ఇళ్లల్లో చిక్కుకున్న అనేకమంది విజయవాడ, గుంటూరు, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి ఒంగోలు చేరుకుని తిరిగి ఇక్కడ బస్‌లు మారి ప్రయాణం చేయాలని అనుకున్నారు. ఇలా అనేకమంది ప్రయాణికులు మధ్యాహ్నం నుంచి బస్‌ సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలియకపోవడంతో బస్టాండ్‌లోనే చిక్కుకుపోయారు. వారిలో మహిళలు, పిల్లలు, ఉన్నారు. బస్‌లు ఉండేది లేనిది అధికారులు తెలపక పోవడంతో వారి బాధ వర్ణనాతీతం.


ఇప్పుడు తామెలా ఇళ్లకు చేరాలని ఆందోళన చెందారు. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్లాల్సిన ఒక కుటుంబం ఒంగోలు వరకు బస్‌లు తిరుగుతుండటంతో ఇక్కడకు చేరారు. కానీ ఇక్కడి నుంచి బస్‌లు రద్దుచేయడంతో చంటిపిల్లలతో ఎలా ఇంటికి చేరాలో అర్థం కాక బస్టాండ్‌లోనే కూర్చుండిపోయారు. అధికారుల నిర్ణయంతో 20మంది వరకు ప్రయాణికులు చిక్కుకుపోయారు. కావలి నుంచి వ్యక్తిగత పనిమీద ఒంగోలు వచ్చిన మస్తాన్‌ అనే చిరుద్యోగి మాట్లాడుతూ కావలి నుంచి బస్‌లు తిరుగుతుండటంతో ఒంగోలు వచ్చానని అకస్మాత్తుగా బస్‌లు ఆపివేస్తే ఎలా తిరిగివెళ్లాలని, తన పరిస్థితి వలసకూలీల మాదిరే అయ్యిందన్నారు. ఇక నడిచి పోవడం తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-05-22T10:36:58+05:30 IST