- కురుమ సంఘం ఆందోళనతో మాకు సంబంధం లేదు
- కొమురవెల్లి ఆలయ ఒగ్గు పూజారుల సంఘం
చేర్యాల, జనవరి 23: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆచార, సంప్రదాయాలేవీ మార్చలేదని ఆలయ ఒగ్గు పూజారుల సంఘం ప్రతినిధులు బొద్దుల కిష్టయ్య, ఎక్కలదేవి మల్లేశం, మక్కపల్లి మల్లేశం, బొద్దుల కనకయ్య అన్నారు. పూర్వ పద్ధతులను యథావిధిగా ఆచరిస్తున్నప్పటికీ, పలువురు వ్యక్తిగత స్వార్థం కోసం దుష్ప్రచారం చేయడం తగదని చెప్పారు. ఇటీవల దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట కురుమ సంఘం నాయకుడు చేసిన ఆందోళన, నిరసనతో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం మల్లన్న ఆలయంలో ఈవో బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతితో సమావేశమై పలు వివరాలు తెలిపారు. పట్నంవారం సందర్భంగా కరోనా ఆంక్షలతో మాత్రమే పెద్దపట్నం, అగ్నిగుండాలను నిలిపేశామని చెప్పారు. సంప్రదాయం ప్రకారం సోమవారం అంతర్గతంగా పట్నం వే శార ని తెలిపారు.
తమను గర్భగుడిలోకి రానివ్వలేదని కొందరు అసత్య ప్రచారం చేయడం సబబు కాదన్నారు. మల్లన్న ఆలయంలో బ్రాహ్మణులు ఎవరూ లేరని, ఎనిమిది మంది అర్చకులు, నలుగురు వేద పారాయణదారులు, 159 మంది ఒగ్గు పూజారులు మాత్రమే పనిచేస్తున్నారని వివరించారు. కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన వారిలో తమ వారు ఎవ్వరూ లేరని చెప్పారు. సంప్రదాయాన్ని విధ్వంసం చేస్తున్నారని ఆరోపణలు చేసిన వారికి ఆలయంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆందోళనలు చేస్తున్నవారు ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే పనులు వీడి, ఆలయాభివృద్ధికి సహకరించాలని ఒగ్గు పూజారుల సంఘం ప్రతినిధులు కోరారు.