ల్యాబ్‌ ఉంది..సిబ్బంది లేరు!

ABN , First Publish Date - 2020-02-20T10:16:38+05:30 IST

జబ్బు చేసిందని ఆసుపత్రికి వెళ్లితే గతంలో డాక్టర్‌ రోగి నాడి పట్టుకొని, కంటి పాపలను పరీక్షించి వ్యాధి

ల్యాబ్‌ ఉంది..సిబ్బంది లేరు!

జిల్లా ఆసుపత్రికి ప్రత్యేక డయాగ్నస్టిక్‌ సెంటర్‌ మంజూరు

57రకాల వ్యాధుల నిర్ధారణకు పరీక్షలు

ఏడాది క్రితమే  భవనం సిద్ధం

ఇప్పటికీ ప్రారంభంకాని సేవలు

గత జ్వరాల సమయంలో ‘ప్రైవేటు’ ఆదాయం రూ.150కోట్లు

మళ్లీ ప్రారంభమవుతున్న ఫీవర్‌ సీజన్‌


ఖమ్మం సంక్షేమవిభాగం, ఫిబ్రవరి 19: జబ్బు చేసిందని ఆసుపత్రికి వెళ్లితే గతంలో డాక్టర్‌ రోగి నాడి పట్టుకొని, కంటి పాపలను పరీక్షించి వ్యాధి నిర్ధారించేవారు. అవసరమైన మేరకే మందులు ఇచ్చేవారు. కానీ.. ప్రస్తుత వైద్య విధానం పూర్తిగా కమర్షియల్‌గా మారింది. సాధారణ జ్వరం వచ్చినా అవసరమైనవీ కానివీ పరీక్షలు చేసి, వేలాది రూపాయల బిల్లులు వేస్తున్నారు. గత జ్వరాల సీజన్‌లో ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులకు వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారానే రూ.150కోట్లు వరకు వచ్చినట్లు అంచనా! ఈ పరిస్థితిని మార్చేందుకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు భవనం నిర్మించారు. ఏడాది క్రితమే ఇది అందుబాటులోకి వచ్చింది. కానీ.. ఇప్పటి వరకూ సేవలు ప్రారంభం కాకపోవడం గమనార్హం.


కార్పొరేట్‌కు దీటుగా..

జిల్లా ఆసుపత్రికి రూ.21కోట్లతో డయాగ్నస్టిక్‌ కేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. వెనువెంటనే ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు ఆరు నెలల్లోనే భవనం నిర్మాణం పూర్తి చేశారు. తర్వాత హైదరాబాద్‌ నుంచి వచ్చిన అధికారులు భవనాన్ని పరిశీలించి పలుమార్పులు చేయించారు. పూర్తి స్థాయిలో రూపుదిద్దుకున్న భవనాన్ని మెడికల్‌ ఇంజనీరింగ్‌ ఈఈ హుస్సేన్‌చౌదరి ఏడాది క్రితమే జిల్లా ఆసుపత్రి అధికారులకు అప్పగించారు.


మెరుగైన విధానంలో పరీక్షలు..

జిల్లాలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు అర్బన్‌ ఆరోగ్య కేంద్రాలు, మూడు కమ్యూనిటీ హెల్త్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వైద్యసేవల కోసం వచ్చిన రోగుల నుంచి ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇతర వైద్యసిబ్బంది రక్త నమూనాలను సేకరిస్తారు. ఈ శ్యాంపిల్స్‌ను జిల్లా డయాగ్నిస్టిక్‌ కేంద్రానికి కొరియర్‌ వ్యవస్థ ద్వారా అదే రోజు తీసుకొస్తారు. రిపోర్టు నేరుగా రోగి, స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి, జిల్లా వైద్యశాఖకు వాట్సప్‌నకు వెళ్తుంది. ఆ తర్వాత కొరియర్‌ వ్యవస్థ ద్వారా ఆయా ఆరోగ్యకేంద్రానికి రోగి నివేదికలు 24గంటల్లోగా చేరనున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి పైసా ఖర్చు లేకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేలా హబ్‌, స్పోక్‌ విధానంలో డయాగ్నస్టిక్‌ సెంటర్‌ను అందుబాటులోకి తేవడం ముఖ్య ఉద్దేశం.


57 రకాల వ్యాధుల నిర్ధారణ..

ఈ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ ద్వారా 57రకాల వ్యాధులను నిర్ధారిస్తారు. సాధారణ జ్వర పరీక్షల నుంచి క్లినికల్‌ పాథాలజీకి చెందిన సీబీపీ, టీసీ, డీసీ, ప్లేట్‌లెట్స్‌, ఆర్‌బీసీ, పీసీబీ వంటి 13రకాలు పరీక్షలు చేస్తారు. మైక్రోబయాలజీకి చెందిన ఆర్‌పీఆర్‌, సీఆర్‌పీ పరీక్షలూ అందుబాటులోకి రానున్నాయి. మోకాళ్లకు సంబంధించిన పరీక్షలతోపాటు చికున్‌గున్యా, టైఫాయిడ్‌, డెంగీ తదితర 8 రకాల పరీక్షలు చేస్తారు. క్లినికల్‌ బయో కెమిస్ట్రీకి చెందిన మధుమేహం, లివర్‌, కిడ్నీ, గుండె, థైరాయిడ్‌ వంటి మరో 36 పరీక్షలూ చేస్తారు.


ఉద్యోగులు రాలే.. పరికరాలు లేవు

నిరుపేద రోగులకు ఎంతో మేలు చేసే ఈ వ్యాధినిర్ధారణ కేంద్రానికి భవనం సిద్ధంగా ఉన్నప్పటికీ.. అవసరమైన పరికరాలు మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఉద్యోగులను సైతం నియమించలేదు. రాష్ట్రంలో కరీంనగర్‌ తర్వాత ఖమ్మానికే ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రం మంజూరైంది. ఆ తర్వాతనే మిగతా జిల్లాలకు మంజూరు చేశారు. రూ.21లక్షలతో ఏడాది క్రితమే భవనం నిర్మించినప్పటికీ.. పరికరాల ఏర్పాటు, ఉద్యోగుల నియామకం జరగలేదు. దీంతో ఏడాదికాలంగా భవనం తాళాలు వేసి కనిపిస్తోంది. ఇప్పటికైనా కలెక్టర్‌ కర్ణన్‌ చొరవ తీసుకొని, జ్వరాల సీజన్‌కు ముందే జిల్లా వ్యాధి నిర్దారణ పరీక్షల కేంద్రం రోగులకు అందుబాటులోకి తీసుకరావాలని రోగులు కోరుతున్నారు.

Updated Date - 2020-02-20T10:16:38+05:30 IST