సమ్మెతో స్తంభించిన సేవలు

ABN , First Publish Date - 2022-08-06T06:59:44+05:30 IST

రెవెన్యూ శాఖలో కీలకమైన క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామ రెవె న్యూ అసిస్టెంట్లు (వీఆర్‌ఏ) నిరవధిక సమ్మెలోకి వెళ్లడంతో రెవెన్యూ కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. గ్రామ స్థాయి నుంచి పై అధికారి వరకు కీలకభూమిక పోషించే వీఆర్‌ఏల ఆందోళనతో కార్యకలాపాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సమ్మెతో స్తంభించిన సేవలు

12రోజులుగా కొనసాగుతున్న వీఆర్‌ఏల నిరవధిక దీక్షలు 

వంటావార్పు, రోడ్లు ఊడుస్తూ నిరసనలు  

ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లా వాసులు

హామీలు అమలయ్యేంత వరకూ  నిరవధిక సమ్మె : వీఆర్‌ఏలు

బోధన్‌ రూరల్‌,  ఆగస్టు 5: రెవెన్యూ శాఖలో కీలకమైన క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామ రెవె న్యూ అసిస్టెంట్లు (వీఆర్‌ఏ) నిరవధిక సమ్మెలోకి వెళ్లడంతో రెవెన్యూ కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. గ్రామ స్థాయి నుంచి పై అధికారి వరకు కీలకభూమిక పోషించే వీఆర్‌ఏల ఆందోళనతో కార్యకలాపాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా, సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిండు అసెంబ్లీలో వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకూ సమ్మె విరమించబోమని భీష్మించుకుని సమ్మెలో కూర్చున్నారు.

ఫ ఆందోళనతో నిలిచిన సేవలు

వీఆర్‌ఏల ఆందోళనలతో జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో నిత్యం వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కుల, ఆదాయ తదితర పనుల నిమిత్తం ప్రజలు తహసీల్దార్‌ కార్యాలయాలకు వస్తుంటారు. అయితే క్షేత్రస్థాయిలో సేవలందించే వీఆర్‌వో, వీఆర్‌ఏలు లేకపోవడంతో తహసీల్దార్‌ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కూలిన ఇళ్లు, నీటమునిగిన పంట వివరాలు, గ్రామాల్లో చెరువుల నిర్వహణతో పాటు పూర్తిస్థాయి సమాచారం వీఆర్‌ఏల వద్ద ఉంటుంది. అయితే వీఆర్‌ఏలు నిరవధిక సమ్మె చేస్తుండటంతో రెవెన్యూ కార్యాలయాల్లో పనులు మందకొడిగా సాగుతున్నాయి. వీఆర్‌ఏలు లేకపోవడంతో గ్రామాల్లో సమసలు పేరుకుపోతున్నాయి. తహసీల్దార్‌ కార్యాలయాలకు వస్తున్న బాధితులు అధికారులు లేక వెనుదిరుగుతున్నారు.

ఫ కొనసాగుతున్న సమ్మె

ప్రభుత్వం వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరుకుంది. తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట దీక్ష కొనసాగిస్తూ ప్రతి రోజూ వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. ఆర్డీవో, తహసీల్దార్‌లకు వినతిపత్రాలు, రోడ్లు ఊడుస్తూ, వంటావార్పు, అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలను ఇస్తున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకూ నిరవధిక సమ్మె కొనసాగుతుందన్నారు. డిమాండ్లను అంగీకరించేం త వరకూ సమ్మె విరమించబోమని స్పష్టం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ 2017లో ప్రగతి భవన్‌లో వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వగా, 2020 అసెంబ్లీలో వీఆర్‌ఏలకు పే స్కేల్‌ ఎంప్లాయిస్‌గా మారుస్తామని ప్రకటించారని,  2022 బడ్జెట్‌ సమావేశాల్లో వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చారని వీఆర్‌ఏలు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటి వరకు వాటిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని హామీలు అమలయ్యేంత వర కూ నిరవధిక సమ్మె కొనసాగుతుందని వీఆర్‌ఏల సంఘం నాయకులు చెబుతున్నారు. 

ప్రధాన డిమాండ్లు ఇవీ..

2020 సెప్టెంబర్‌ 9న అసెంబ్లీ  సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించిన వీఆర్‌ఏల పే స్కేల్‌ను వెంటనే అమలు చేయాలి

 అర్హత కలిగిన వీఆర్‌ఏలకు వెంటనే పదోన్నతులు కల్పించాలి 

 55 సంవత్సరాలుపై బడిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగం ఇస్తూ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలి.

హామీలను అమలు చేయాలి

: సతీష్‌, వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు, బోధన్‌ 

ప్రభుత్వం వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. హామీలు అమలయ్యేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగుతోంది. 

వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలి  

: నీరడి గంగాధర్‌, వీఆర్‌ఏ, బోధన్‌ 

వీఆర్‌ఏ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగుతుంది. ప్రభుత్వం వెంటనే డిమాండ్లను అంగీకరించాలి.

Updated Date - 2022-08-06T06:59:44+05:30 IST