ప్రైవేట్‌లో కొవిడ్‌ వైద్యం

ABN , First Publish Date - 2020-07-07T10:38:48+05:30 IST

ప్రైవేట్‌లో కొవిడ్‌ వైద్యం

ప్రైవేట్‌లో కొవిడ్‌ వైద్యం

ఆరోగ్యశ్రీ ద్వారా  సేవలు

ఒంగోలులో నాలుగు ఆసుపత్రులకు అనుమతి

అన్ని వైద్యశాలల్లో కిట్లతో నిర్ధారణ పరీక్షలు

విపత్తు సమయమిది.. సేవలను విస్తృతం చేయండి

ప్రైవేటు  డాక్టర్లకు  కలెక్టర్‌ భాస్కర్‌  పిలుపు


ఒంగోలు నగరం, జూలై 6: జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేటు వైద్యశాలల్లో  బాధితులకు చికిత్స అందించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతానికి రిమ్స్‌లోనే చికిత్స చేస్తున్నారు. అక్కడ 500 పడకలు మాత్రమే ఉండగా అధికారులు ఐసోలేషన్‌ వార్డుల్లో 600పడకలను సిద్ధం చేయగా  అవన్నీ బాధితులతో నిండిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభు త్వం నిమగ్నమైంది.


ఒంగోలులోని నాలుగు ప్రైవేటు వైద్యశాలల్లో ఇక నుంచి కరోనాకు ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించనుంది. నల్లూరి నర్శింగ్‌హోం, సంఘమిత్ర, కిమ్స్‌, వెంకటరమణ వైద్యశాలలకు అనుమతి ఇవ్వనుంది. ఈ నాలుగే కాకుండా జిల్లాలోని ఏ వైద్యశాల ముందుకొచ్చినా అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లోనే కరోనా నిర్ధారణకు పరీక్షలు నిర్వహించ నున్నారు. ఇందుకు అవసరమైన కిట్లు వేలల్లోనే జిల్లాకు వస్తున్నాయని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ప్రకటించారు. జిల్లాలో ప్రతిరోజూ 3500మందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అనుమతిని కోరుతూ కలెక్టర్‌  ప్రభుత్వానికి నివేదించారు. త్వరలోనే అనుమతి రానుంది.  


రిమ్స్‌లో ఫుల్‌.. ప్రత్యామ్నాయంపై దృష్టి

రిమ్స్‌లో ఐసోలేషన్‌ వార్డు నిండిపోవటంతో క్విస్‌ ఇంజనీరింగ్‌ కళాశా లను కరోనా వార్డుగా మార్చేందుకు నిర్ణయించారు. ఇందులో కరోనా బాధితులను ఉంచేందుకు సిద్ధమవుతున్నారు. దీంతోపాటు ప్రస్తుతం కొవిడ్‌ సెంటర్‌గా ఉన్న ట్రిపుల్‌ ఐటీలో అనుమానిత లక్షణాలు ఉన్న వారికి ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 


అంకితభావంతో పనిచేయాలి

‘విపత్తు సమయమిది.. వైద్యులు తమ సేవలను విస్తృతం చేయాలి. కరోనా లక్షణాలతో వచ్చే రోగులకు ర్యాపిడ్‌ కిట్లతో పరీక్షలు చేసి వైద్య సేవలు అందించాలి’ అని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ప్రైవేటు వైద్యులను కోరారు. ఆయన సోమవారం సాయంత్రం ప్రైవేటు వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశ్రీ కింద కరోనా రోగులకు వైద్య సహా యం అందించాలని కోరారు. 

Updated Date - 2020-07-07T10:38:48+05:30 IST