పరహితమే పరమార్థం!

ABN , First Publish Date - 2020-08-28T05:30:00+05:30 IST

సత్కర్మ, సమాజ సేవ, సజ్జన సేవ అత్యుత్తమమైన కర్మలు. వాటి వల్ల లభించే పుణ్య ఫలం ఎలా ఉంటుందో భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి పద్యం ద్వారా తెలుసుకుందాం!...

పరహితమే పరమార్థం!

సత్కర్మ, సమాజ సేవ, సజ్జన సేవ  అత్యుత్తమమైన కర్మలు. వాటి వల్ల లభించే పుణ్య ఫలం ఎలా ఉంటుందో భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి పద్యం ద్వారా తెలుసుకుందాం!


  • ఖలునిన్‌ సజ్జనుఁగాగ మూర్ఖజను సఖ్యావంతునిన్‌ గాఁగ దా
  • యల సన్మిత్రులుఁగా నగోచరముఁ బ్రత్యక్షంబుగా బ్రాణహృ
  • త్కలనంబైన మహావిషం బమృతముంగా జేయు సత్కర్మము
  • జ్వల నిష్ఠానిధివై భజింపుము వయస్యా వాంఛితార్థాప్తికిన్‌



పరహితము ఎంత గొప్పది అంటే... ‘ఖలుని సజ్జనుఁగాగ..’ చెడ్డవాణ్ణి కూడా మంచివాణ్ణి చేస్తుంది. చిన్న వయసులో... తెలియనితనంలో చెడ్డ పనులు చేసి ఉండొచ్చు. చెడ్డ పేరు వచ్చి ఉండొచ్చు. తరువాత అయినా బుద్ధి మార్చుకుని మంచి పనులు చేస్తే ఆ చెడ్డ పేరు పోదా! మంచి పనులు అంటే దానాలు చేయడం, దీనజనులను ఆదుకోవడం. ‘మూర్ఖజను సఖ్యావంతునింగాఁగ’... గట్టి ప్రయత్నం చేస్తే ఎంత మూర్ఖుడైనా మంచి పండితుడవుతాడు. ‘దాయల సన్మిత్రులుగా’... శత్రువులు మిత్రులుగా మారతారు. ఒక మంచి పని వల్ల శత్రువులు, మిత్రులుగా మారతారు. ‘అగోచరము బ్రత్యక్షముగా’... జ్ఞానము పొందే ప్రయత్నం చేస్తే, పుస్తకాలు చదివితే, మంచి వాళ్లను కలిసి నాలుగు మంచి మాటలు వింటే, దాన్ని మననం చేసుకొని, అన్వయం చేసుకుంటే తెలియని విషయాలు కూడా తెలుస్తాయి. కనిపించనిది కూడా కనిపిస్తుంది. ‘బ్రాణహృత్కలనంబైన మహావిషం బమృతముంగా జేయు’... ప్రాణాలు హరించే విషం కూడా అమృతంగా మారుతుంది. ‘ఉజ్వల నిష్ఠానిధివై భజింపుము’... మంచి పనులను గొప్ప నిష్ఠతో చేయాలి. నియమంతో చేయాలి. జీవితంలో నీవు ఏదైనా గొప్ప లక్ష్యం సాధించాలనుకొంటే మానవ ప్రయత్నం చేస్తూ, నలుగురిని కలుపుకొని పోతే అప్పుడు అది సాధ్యమవుతుంది.

- గరికిపాటి నరసింహారావు


Updated Date - 2020-08-28T05:30:00+05:30 IST