మార్గం సుగమం

ABN , First Publish Date - 2022-08-05T06:14:10+05:30 IST

మార్గం సుగమం

మార్గం సుగమం

ఓవైపు సగం విస్తరణ

బెంజ్‌-1 ఫ్లై ఓవర్‌ సర్వీసు రోడ్డు విస్తరణకు టెండర్లు

హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్‌హెచ్‌ అధికారుల నిర్ణయం

నోవాటెల్‌ వైపున విస్తరణకే టెండర్లు 

ఎస్వీఎస్‌ జంక్షన్‌ వైపు అభ్యంతరాలు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : హైకోర్టు ఆదేశాలను అనుసరించి బెంజిసర్కిల్‌ సర్వీసు రోడ్డు విస్తరణ పనులకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) ఎట్టకేలకు టెండర్లు పిలిచింది. రెండు ఫ్లై ఓవర్ల వెంబడి కాకుండా ప్రస్తుతానికి ఒకవైపున సగం.. అంటే బెంజ్‌-1 ఫ్లై ఓవర్‌ నోవాటెల్‌ వైపే విస్తరణకు టెండర్లు పిలిచారు. బెంజ్‌-2 ఫ్లై ఓవర్‌ విస్తరణ పనులు తర్వాత చేపట్టాలని ఎన్‌హెచ్‌ భావిస్తోంది. అయితే, మొదటి ఫ్లై ఓవర్‌ వెంబడి ఎస్వీఎస్‌ జంక్షన్‌ వైపు సర్వీసు రోడ్డుకు టెండర్లు పిలవలేదు. వాస్తవానికి ఒకే సర్వీసు రోడ్డు కాబట్టి మొత్తంగా ఒకేసారి టెండర్లు పిలవాలి. ఇందుకు భిన్నంగా ఎన్‌హెచ్‌ అధికారులు టెండర్లు పిలిచారు. ఎస్వీఎస్‌ జంక్షన్‌ వైపు టెండర్లు పిలవటానికి పలువురు భవన యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అభ్యంతరాలను, కోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని నోవాటెల్‌ వైపే విస్తరణ పనులకు సమాయత్తమవుతున్నారు.

ఢిల్లీ పెద్దల్లో కదలిక

హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ ఉన్నతాధికారులు ఓ మెట్టు దిగారు. బెంజిసర్కిల్‌ సర్వీసు రోడ్డు విస్తరణలో భాగంగా భూములకు పరిహారం ఇచ్చే విషయంలో ఢిల్లీలోని ఓ ఉన్నతాధికారి అత్యుత్సాహం చూపించారు. ఆ కారణంగానే భూ సేకరణ ఖర్చు నుంచి ఎన్‌హెచ్‌ తప్పుకొంది. మార్కెట్‌ విలువతో సమానంగా రిజిస్ర్టేషన్‌ విలువలు ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో విస్తరణ కోసం భూములు ఇవ్వటానికి ముందుకొచ్చిన భవన, స్థల యజమానులు కోర్టుకెళ్లారు. రెండో ఫ్లై ఓవర్‌ అయ్యే వరకు ఇది తేలలేదు. రెండో ఫ్లై ఓవర్‌ వెంబడి కూడా సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలని స్థానికులు కోర్టును ఆశ్రయించటంతో రెంటినీ దృష్టిలో ఉంచుకుని సర్వీసు రోడ్లను విస్తరించాలని హైకోర్టు ఎన్‌హెచ్‌కు నిర్దేశించింది. ఈ విషయాన్ని ఇక్కడి ఎన్‌హెచ్‌ అధికారులు ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వస్తుందనుకున్న అధికారులు కేంద్రం ప్రతిపాదించిన పరిహారాన్ని ఇచ్చేందుకు అంగీకరించినట్టుగా తెలిసింది. దీంతో మొదటి ఫ్లై ఓవ ర్‌ వెంబడి యుద్ధప్రాతిపదికన టెండర్లు పిలిచారు. 

నోవాటెల్‌ వైపు విస్తరణకు ముందుకు రాని కాంట్రాక్టర్లు

నోవాటెల్‌ నుంచి బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌-1 సర్వీసు రోడ్డు వైపు పిలిచిన టెండర్లకు కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాలేదు. రాష్ట్రస్థాయిలో పిలిచే టెండర్లకు డబ్బు ఇవ్వట్లేదని కాంట్రాక్టర్లెవరూ ముందుకు రావట్లేదు. ఈ విస్తరణ వల్ల ఇబ్బందులు వస్తే మొదటికే మోసం వస్తుందన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు ఉద్దేశపూర్వకంగానే టెండర్లు వేయటం లేదా అనే చర్చ నడుస్తోంది. 

ఎస్వీఎస్‌ జంక్షన్‌ వైపు అభ్యంతరాలు

ఎస్వీఎస్‌ జంక్షన్‌వైపు దాదాపు సర్వీసు రోడ్డు లేదు. జంక్షన్‌కు వచ్చే సరికి ప్రైవేట్‌ భవనాలు, స్థలాలు ఫ్లై ఓవర్‌కు ఆనుకుని ఉంటాయి. పటమటలంకకు వెళ్లే ప్రజలు సర్వీసు రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవన, స్థల యజమానులు కూడా నష్టపోతున్నారు. గతంలో ఈ ప్రాంతం వెంబడి భవన, స్థల యజమానులంతా తమ స్థలాలు ఇవ్వటానికి ఎన్‌హెచ్‌కు అంగీకారం తెలిపారు. సర్వీస్‌ రోడ్డు చేపట్టడం లేదని ఎన్‌హెచ్‌ అధికారులు కోర్టుకు కూడా వెళ్లారు. ఇప్పుడేమైందో తెలియదు కానీ, కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్యను గుర్తించిన ఎన్‌హెచ్‌ అధికారులు ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో పనులు కావాలనే ఆపారా? లేకపోతే మొక్కుబడిగా టెండరును పిలిచారా? అనేది తేలాల్సి ఉంది. ఎన్‌హెచ్‌ అధికారులైతే ఎస్వీఎస్‌ జంక్షన్‌ వైపున ఉన్న భవన, స్థల యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు. హైకోర్టు తీర్పు ప్రాతిపదికన పనులు చేపడుతున్నామని, మీరు కూడా కోర్టును ఆశ్రయించారు కాబట్టి సమస్య వస్తుందని, సహకరించాలని కోరుతున్నారు. 

త్వరలో బెంజ్‌-2 టెండర్లు 

బెంజ్‌-2 ఫ్లై ఓవర్‌కు కూడా టెండర్లు పిలవాల్సి ఉంది. దీనిప్రకారం భూ సేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. దీంతో పాటు అలైన్‌మెంట్‌ను సిద్ధం చేయాలి. దీనికనుగుణంగా భవన, స్థల యజమానులకు నోటీసు ఇవ్వటంతో పాటు వారి అంగీకారాన్ని కూడా తీసుకోవాలి. ఈ అంశాలన్నీ రెవెన్యూ పరిధిలో ఉన్నాయి. కాబట్టి దీనికి కొంత సమయం పడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక టెండర్లు పిలవాలని ఎన్‌హెచ్‌ అధికారులు భావిస్తున్నారు.

Updated Date - 2022-08-05T06:14:10+05:30 IST