రీ సర్వేలో చిక్కులెన్నో..

ABN , First Publish Date - 2022-08-11T06:00:37+05:30 IST

విజయవాడ నగరంలో పెజ్జోని పేట ఉంది.

రీ సర్వేలో చిక్కులెన్నో..

ఒకవైపు గ్రామాల్లో పూర్తి కానేలేదు  

 ఎదురౌతున్న ఇబ్బందులపై అనుభవాలు పెంపొందించకుండానే.. పట్టణాల్లోకి ఎంటర్‌ 

 నగరాలు, పట్టణ ప్రాంతాల్లో సమస్యల పుట్ట

 దశాబ్దాల తరబడి పట్టాలు లేవు.. క్రమబద్దీకరణా జరగలేదు  

 రికార్డుల్లో ఉండేది ఒకటి.. క్షేత్రస్థాయిలో కనిపించేది మరొకటి 

 రికార్డుల స్వచ్ఛీకరణ జరగకుండా.. సర్వే చేసి ఉపయోగమేంటో..

 విజయవాడలో సర్వేకు ప్రాతిపదిక శూన్యం

విజయవాడ నగరంలో పెజ్జోని పేట ఉంది. ఇది చెరువు భూమి. దశాబ్దాలుగా ఆక్రమణలకు గురైంది. రికార్డుల్లో ఒక రకంగా ఉంది. క్షేత్రస్థాయిలో నివాసాలు ఉన్నాయి. వీటికి ఎలా హక్కు కల్పిస్తారన్నది ప్రశ్నగా ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన భూ సర్వే ఇంకా ఓ కొలిక్కే రాలేదు. మొదటి దశలో చేపట్టిన సర్వే పది శాతంలోపు కూడా పూర్తి కాలేదు. క్షేత్రస్థాయిలో ఎదురౌతున్న సమస్యలు ఇంకా అనుభవంలోకే రాలేదు. రీ సర్వేకు ఎంతో సంక్లిష్టమైన నగరాలు, పట్టణాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్దేశిస్తోంది. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో రెండు మునిసిపల్‌ కార్పొరేషన్లు, నాలుగు మునిసిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో రీ సర్వే చేపట్టాల్సి ఉంటుంది. రికార్డుల స్వచ్ఛీకరణ జరగకుండా.. పట్టణ ప్రాంతాల్లో ఏ ప్రాతిపదికన రీ సర్వే చేపడతారన్నదానిపై స్పష్టత లేదు. పట్టణాల్లో రీ సర్వేపై బుధవారం విజయవాడలో వర్క్‌షాప్‌ నిర్వహించినప్పటికీ.. ఎలా చేయాలో నిర్దేశించారే... తప్ప స్పష్టత మాత్రం కరవైంది. రీ సర్వేలో వచ్చే ఎన్నో ఇబ్బందులకు వర్క్‌షాప్‌ సమాధానాలు చెప్పలేకపోయింది. క్షేత్రస్థాయిలో వచ్చే ఈ సమస్యలకు ఏ రకంగా పరిష్కారం చూపుతారన్నది వేచి చూడాల్సిందే. 

ఆంధ్రజ్యోతి, విజయవాడ : నగర, పట్టణ ప్రాంతాల్లో భూ హక్కును కల్పించటానికి రీ సర్వే చేపట్టాలంటే రికార్డుల స్వచ్ఛీకరణ నూరు శాతం జరిగితే తప్ప సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. రికార్డుల స్వచ్ఛీకరణపై దృష్టి సారించకుండా రీ సర్వే చేస్తే క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 

 విజయవాడ, మచిలీపట్నంలలో పరిస్థితి ఇలా

 విజయవాడ నగరం ప్రపంచంలోనే అత్యంత జన సాంధ్రతతో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతంగా ఓ జాతీయ సర్వేలో తేలింది. ఇక్కడ 13 లక్షల జనాభా ఉంది.    విజయవాడ ను ఆనుకుని ఉండే అనేక గ్రామాలు విజయవాడలో అంతర్భాగంగా ఉంటాయి. ఒకవైపు కృష్ణానది, నగరం మధ్యగా నాలుగు కాలువలు, నగరంలో కొండలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు నివాసిత ప్రాంతాలు. ఈ ప్రాంతాల భూములు రికార్డుల్లో ఒక రకంగా.. క్షేత్రస్థాయిలో మరో రకంగా ఉంటాయి. కృష్ణా పరివాహక ప్రాంతం అంతా రెవెన్యూ, కార్పొరేషన్‌ రికార్డుల్లో కృష్ణానదిగా ఉంది. ఇంటి పట్టాలు ఇచ్చిన వరకు సమస్య లేదు. విజయవాడలో భవానీపురం నుంచి కృష్ణలంక వరకు కరకట్ట వెంబడి వేలాది ఆవాసాలు ఉన్నాయి. శాశ్వత కట్టడాలు ఏర్పడ్డాయి. రికార్డుల ప్రకారం చూస్తే చాలా ప్రాంతాలు ఇంకా కృష్ణానది పరిధిలోనే ఉన్నాయి. వీటిని రీ సర్వే చేసేటపుడు రికార్డులను సరి చేయకుండా ఎవరికి హక్కు కల్పిస్తారు? చట్టబద్ధంగా అది సాధ్యమేనా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నగరం మధ్యగా వెళ్లే బందరు కాలువ, ఏలూరు కాల్వ, రైవస్‌ కాల్వ, బుడమేరు కాల్వల వెంబడి ఆక్రమించుకుని  వేలాది కుటుంబాలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. నగరంలో ఈ ప్రాంతాలు అంతర్భాగమైపోయాయి. వీటిని రీ సర్వే చేసేటపుడు ఎవరికి హక్కు కల్పిస్తారు? ఎవరి పేరుతో హక్కు కల్పిస్తారు? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. విజయవాడలో 29 శాతం జనాభా కొండ ప్రాంతాల మీదనే నివసిస్తోంది. పశ్చిమ ప్రాంతంలో ఇంద్రకీలాద్రి, గాంధీహిల్‌, ఫ్రైజర్‌పేట, మిల్క్‌ఫ్యాక్టరీ కొండ ప్రాంతాలు జనావాసాలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. విజయవాడ తూర్పు ప్రాంతంలో మాచవరం, గిరిపురం, మొగల్రాజపురం, గంగిరెద్దుల దిబ్బ కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఈ కొండల మీద దాదాపుగా మూడున్నర లక్షల జనాభా నివసిస్తోంది. ఇలాంటి ప్రాంతాలకు సంబంధించి సర్వే చేసి హక్కు ఎవరికి కల్పిస్తారు? 

 పట్టణ ప్రాంతాల్లో ఇలా  

 ఎన్టీఆర్‌ జిల్లాలో జగ ్గయ్యపేట పట్టణ ప్రాంతంలో రీ సర్వే చేయటం అత్యంత సంక్లిష్టం. ఎందుకంటే జగ్గయ్యపేట ప్రాంతం అంతా గ్రామ కంఠం భూముల కిందనే రికార్డుల్లో ఉంది. ఇరిగేషన్‌ ఎర్ర కాల్వ కట్ట (ఎర్ర చెరువు ఫీడింగ్‌ కెనాల్‌) వెంబడి రెండు వైపులా జనావాసాలు పెరిగాయి. వీటికి ఎలాంటి పట్టాలు లేవు. చెరువు ముంపు ప్రాంతా లుగా ఉన్న దుర్గాపురం జనావాస ప్రాంతమైంది. చెరువు బజార్‌ వేపలవాగు వెంబడి ఆక్రమణలు జరిగాయి. దేవదా య భూముల్లో ఆక్రమణలు పెరిగిపోయాయి. తొర్రగుం టపాలెం, విద్యానగర్‌, రైల్వేకట్టల్లో జనావాసాలు పెరిగాయి. కృష్ణా జిల్లా గుడివాడలో బేతవోలు, బిళ్లపాడు వెళ్లేదారి, దేవాలయ భూములు ఆక్రమించి ఇళ్లు వేసుకున్నారు. 

 రికార్డుల స్వచ్ఛీకరణతోనే.. రీసర్వే సాధ్యం 

ప్రభుత్వం ఇలాంటి నగర, పట్టణ ప్రాంతాలకు సంబంధించి క్రమబద్ధీకరణ చేయటం కానీ, వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద రెగ్యులరైజ్‌ చేయటం చేసి రికార్డుల స్వచ్ఛీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ల్యాండ్‌ చేంజ్‌ క్లాసిఫికేషన్స్‌ కూడా చేయాల్సి ఉంటుంది. వీటిపై సమగ్ర సర్వే చేసి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటే తప్ప రీ సర్వే చేయటం వల్ల ఉపయోగం కలిగే పరిస్థితి అయితే ఉండదు. 

 జనావాసాల పరిస్థితేంటి?

విజయవాడలో పోరంబోకు భూములు అనేక రకాలు ఉన్నాయి. శ్మశాన పోరంబోకు, చెరువు పోరంబోకు, కాలువ పోరంబోకు ఇలాంటి అనేక పోరంబోకు భూముల్లో పక్కాఇళ్లు ఉన్నాయి. ఇరిగేషన్‌ స్థలాలన్నీ బెజవాడలో చాలా వరకు ఆక్రమణలకు గురై ప్రజల ఆవాస ప్రాంతాలుగా మారిపోయాయి. మరి వీటిని రీ సర్వే చేసి ఎవరికి హక్కు కల్పిస్తారు? మచిలీపట్నం నగరం కార్పొరేషన్‌గా కొత్తగా అవతరించింది. జలాల్‌పేట చెరువు ప్రాంతం అంతా ఇప్పుడు జనావాస ప్రాంతమైంది. మచిలీపట్నం బైపాస్‌ రోడ్డు వెంబడి ఆక్రమణ భూముల్లో జనావాసాలు ఏర్పడ్డాయి. ఎస్టేటు ఏరియాలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. బందరు బైపాస్‌ రోడ్డులో శ్మశాన వాటికలు కూడా ఆక్రమణలకు గురై జనావాసాలుగా ఏర్పడ్డాయి. కేంద్రీయ విద్యానగర్‌ ఎదురుగా హిందూ శ్మశాన వాటికలో పది ఎకరాలు ఆక్రమణలకు గురై జనావాసాలుగా ఏర్పడ్డాయి. 




Updated Date - 2022-08-11T06:00:37+05:30 IST