ఓటర్ల జాబితాల నవీకరణ

ABN , First Publish Date - 2022-08-05T05:41:29+05:30 IST

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో ఓటర్ల జాబితా నూతనీకరణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఓటర్ల జాబితాల నవీకరణ

ఒకటీ రెండురోజుల్లో ఇంటింటి సర్వే

 ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం

 పాఠశాలల మూసివేతతో పోలింగ్‌ కేంద్రాల్లోనూ మార్పులు

ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో గరిష్టంగా 1500 మంది ఓటర్లు

 మూడు నెలలకోసారి ఓటరుగా చేరేందుకు అవకాశం

 కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో ఓటర్ల జాబితా నూతనీకరణకు అధికారులు  కసరత్తు చేస్తున్నారు. ఓటర్ల జాబితాల్లో పేర్లున్నవారి ఆధార్‌ నెంబర్లను సేకరించి ఓటరుకార్డుకు అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టనున్నారు. బీఎల్‌వోలు ఇంటింటికీ తిరిగి ఆధార్‌ నెంబరు అనుసంధానం చేసే ప్రక్రియ ఒకటీ, రెండు రోజుల్లో ప్రారంభం కానుంది.  - మచిలీపట్నం

 ఇంటింటికీ వెళ్లి సర్వే  

 పాత పద్ధతిలోనే ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై బూత్‌ లెవల్‌ అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వేచేస్తారు. ఈ సర్వేలో భాగంగా ఓటరు తన ఆధార్‌కార్డు నెంబరు తెలియజేయాలా వద్దా అనే అంశంపై నిర్బంధమేమీ లేదు. ఆధార్‌ కార్డు నంబరును బలవంతంగా సేకరించవద్దని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టంచేసిన నేపథ్యంలో ఈ వెసులుబాటును ఇచ్చారు. జిల్ల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారు. ఓటర్లకు సంబంధించిన ఆధార్‌కార్డు నంబర్లను గోప్యంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో ఈ నియమాన్ని పాటించాలని జిల్లాస్థాయి అధికారులు బీఎల్‌వోలకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.   

మార్పులు, చేర్పులకు మారిన దర ఖాస్తులు 

 ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకోసం ఇచ్చే దరఖాస్తులను ప్రస్తుతం మార్పు చేశారు.  ఓటరుగా చేరేందుకు ఫారం-6తోపాటు, ఫారం-6బీని కూడా పూర్తిచేసి జతచేసి ఇవ్వాలి. ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులకు ఫారం-8ను ఇస్తే సరిపోతుంది. గతంలో మార్పులు, సవరణ కోసం ఫారం-8బీని ఇవ్వాల్సి వచ్చేది. ఓటర్ల జాబితాలో నుంచి పేరును తొలగించేందుకు ఫారం-7ను ఇస్తే సరిపోతుంది.

 మూడు నెలలకోసారి అవకాశం  

గతంలో ప్రతిఏటా జనవరి 1వ తేదీనాటికి 18 సంవవత్సరాలు నిండినవారిని ఓటర్లుగా చేర్చేందుకు అవకాశం ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ విఽధానంలో మార్పులు చేశారు. జనవరి, ఏప్రిల్‌, జూలై, అక్టోబరు నెలల్లో 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండినవారిని ఓటర్లుగా చేర్చేందుకు అవకాశం కల్పించారు. కళాశాలల వద్ద యువత ఓటరుగా చేరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్‌వీఎస్‌పీ, ఓటరు పోర్టల్‌, వీహెచ్‌ఏ యాప్‌ల ద్వారా  ఓటరుగా చేరేందుకు అవకాశం కల్పించారు.

 మూసివేసిన పాఠశాలల్లో పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయా  

 ఇటీవల కాలంలో జిల్లాలోని 108కిపైగా ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వం మూసివేసింది. సంబంధిత పాఠశాల భవనాలు గతంలో పోలింగ్‌కేంద్రాలుగా ఉండేవి. ప్రస్తుతం అవి ఆయా  యాజమాన్యాల ఆధీనంలోకి వెళ్లాయి. వీటిలో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారా, లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారా అనే అంశంపైనా రాజకీయపార్టీల నాయకులు ఇటీవల కలెక్టర్‌తో జరిగిన సమావేశంలో ప్రశ్నించారు. ఈ తరహా ప్రాంతాల్లో వేరే పోలింగ్‌ కేంద్రాలను గుర్తిస్తామని కలెక్టర్‌ తెలిపారు. 

 జిల్ల్లాలో 14,89,563 మంది ఓటర్లు 

జిల్లాలోని మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, పెడన, పెనుమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14,89,563 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 7,27,595 మంది, మహిళాఓటర్లు 7,61,878 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 90 మంది ఉన్నారు.

 నిబంధనలు ఇవీ  

 ఇకనుంచి ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు మించకూడదని నిర్ణయించారు. ఏదైనా ప్రాంతంలో 1500 మంది ఓటర్ల కన్నా మించి ఉంటే మరో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. గతంలో ఒక ఇంటిలో భార్యాభర్తలుంటే భార్య ఒకపోలింగ్‌ కేంద్రంలో, భర్త మరో పోలింగ్‌ కేంద్రంలో  ఓటు వేయాల్సి వచ్చేది.  ఇక నుంచి ఒక కుటుంబంలోని వారు, ఒక వీధిలోని వారు ఒకే పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటుహక్కు వినియోగించుకునేలా  జాబితా లను సవరిస్తారు.  ఇదే అంశంపై మూడురోజుల క్రితం కలెక్టర్‌ రంజిత్‌బాషా రాజకీయపార్టీల నాయకులతో సమావేశం నిర్వహించిన సమయంలో చర్చకు వచ్చింది. ఈ లోపాలను సరిదిద్దుతామని కలెక్టర్‌ తెలిపారు. ఓటరు ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనే పోలింగ్‌ కేంద్రం ఉండేలా చూస్తారు. మరణించిన ఓటర్లపేర్లను సేకరించి ఓటరు జాబితాలనుంచి తొలగిస్తారు. ఓటర్ల జాబితాల్లో ఒకే ఓటరుపేరు రెండు, మూడుసార్లు నమోదై ఉంటే ఈ వివరాలు సేకరించి ఒకచోట మాత్రమే ఓటరుజాబితాలో పేరు ఉంచి మిగిలిన చోట్ల తొలగిస్తారు. 

Updated Date - 2022-08-05T05:41:29+05:30 IST