సర్వర్‌ షట్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-07-22T07:12:29+05:30 IST

సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో సర్వర్‌ చుక్కలు చూపెడుతోంది.

సర్వర్‌ షట్‌డౌన్‌
సర్వర్‌ పనిచేయకపోవడంతో రెండ్రోజుల క్రితం కనిగిరిలో గుంపులుగా ఉన్న క్రయవిక్రయదారులు

పదిహేనురోజులుగా నిలిచిన రిజిస్ర్టేషన్లు 

ఈసీలు, నకళ్లు రాక ఇక్కట్లు 

పంట రుణాల సమయంలో రైతులకు తప్పని పాట్లు 

15 రోజులుగా ప్రదక్షిణలు.. రూ.5 కోట్ల మేర నష్టం

సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో సర్వర్‌ చుక్కలు చూపెడుతోంది. గంట పనిచేస్తే రోజంతా నిలిచిపోతోంది. ఆన్‌లైన్‌ పనిచేయక పోతుండటంతో రిజిస్ర్టేషన్లు నిలిచిపోయాయి. అలాగే ఈసీలు, నకళ్లు రావడం లేదు. జిల్లావ్యాప్తంగా అన్ని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో గత పదిహేను రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రిజిస్ర్టేషన్లకు వచ్చిన ప్రజలు రోజుల తరబడి తిరుగుతున్నారు. డాక్యుమెంట్‌ సబ్‌మిట్‌ చేస్తే ఎన్నిరోజులకు రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కార్యాలయాల వద్ద రాత్రి వరకూ వేచిచూస్తున్నారు. ఉదయాన్నే సర్వర్‌ వస్తుందని తెలిసి కొందరు తెల్లవారుజామునే చేరుకుంటున్నారు. కరోనా నిబంధనలను పాటించకుండా గుంపులుగుంపులుగా పడిగాపులు కాస్తున్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు  సైతం ఉదయాన్నే వచ్చి సాయంత్రం వరకు ఎదురుచూసి, చివరకు ఉసూరుమంటూ వెళ్లిపోతున్నారు. సమస్య ఎప్పటికి తీరుతుందో అధికారులకే అర్థం కాని పరిస్థితి నెలకొంది.

కందుకూరు/ఒంగోలు క్రైం, జూలై 21: సర్వర్‌ డౌన్‌.. ఆన్‌లైన్‌ పనిచేయడం లేదు.. ఇదీ నిత్యం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సిబ్బంది చెబుతున్న మాటలు. ఈసీలు, నకళ్లకు ఇదే సమాధానం. జిల్లాలోని 18 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో లావాదేవీలు స్తంభించాయి. దీంతో రియల్‌ రంగం కుదేలైంది. అదే క్రమంలో స్థిరాస్తి రుణం పొందాలన్నా ఎలాంటి సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అందడం లేదు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభ సమయంతోపాటు రిజిస్ట్రేషన్లకు ఇదే కీలక సమయం. దీంతో క్రయ, విక్రయదారులు రోజూ కార్యాలయాలకు రావటం తిరిగి వెళ్లిపోవటం పరిపాటైంది. గత పదిహేనురోజులుగా జిల్లాలోని అన్ని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమస్య కేవలం మన జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఎన్‌ఈసీ సర్వర్లు ఇంతవరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కలిపి నిర్వహణలో ఉండగా ఏపీ సర్వర్‌ని విడదీసే ప్రక్రియ నడుస్తున్నదని, ఆ కారణంగా ఒక్కోరోజు అసలు పనిచేయక పోతుండగా ఒక్కోరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కంప్యూటర్‌ ముందు కూర్చుంటే ఒకటి రెండు డాక్యుమెంట్ల రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని కార్యాలయ అధికారులు చెబుతున్నారు.


వివాదాలకు దారితీస్తున్న సమస్య

రిజిస్ర్టేషన్లు ఎప్పటి నుంచి సజావుగా జరుగుతాయో తెలియజేస్తే ప్రజలకు రోజూ కార్యాలయానికి వచ్చి పడిగాపులు కాయాల్సిన దుస్థితి తప్పుతుంది కదా అని అధికారులను ప్రశ్నిస్తే ‘మాకు తెలిస్తే కాగా.. మీకు చెప్పగలిగేది’ అన్న సమాధానం వస్తోంది. దీంతో రిజిస్ర్టేషన్ల కోసం వచ్చేవారు నిత్యం పనులు మానుకుని తిరుగుతూ వ్యయప్రయాసలకు గురవుతున్నారు. రిజిస్ర్టేషన్‌ ఎంత చిన్నదైనా కొనుగోలుదారు, అమ్మకందారుతో పాటు ఇద్దరు సాక్షులను కూడా తీసుకుని రావాల్సి ఉంది. ఆ నలుగురు, వారి సహాయకులు కొందరు అదేపనిగా తిరగాల్సి వస్తూ ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కొనుగోలుదారు, అమ్మకందారుల మధ్య భేదాభిప్రాయాలు వస్తుండటమే గాక వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. అగ్రిమెంట్‌ సమయం పూర్తి అయిన వారు రిజిస్ర్టేషన్‌ ఎప్పుడు జరిగితే అప్పుడు చేయించుకోండి ముందు మాకు నగదు చెల్లించండి అని అమ్మకందారులు, రిజిస్ర్టేషన్‌ జరగకుండా నగదు ఎలా చెల్లించగలమని కొనుగోలుదారులు పట్టుబడుతుండటంతో గొడవలు తలెత్తుతున్న పరిస్థితి. ఇంతకాలం సమస్య ఉండేలా విభజన ప్రక్రియ చేపట్టడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం సాంకేతిక సమస్య ఉత్పన్నమయ్యే ముందు  ముందస్తు సమాచారం ఇవ్వటం ద్వారా సర్వర్‌ ఉన్నప్పుడే ప్రజలకు అవసరమైన పనులు పూర్తిచేసుకునేలా చూడకపోవటం మరింత అన్యాయమని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


రూ.5 కోట్ల మేర నష్టం

గత పదిహేనురోజులుగా రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోవడంతో సుమారుగా ఖజానాకు రూ.5కోట్లు మేరకు నష్టం వాటిల్లింది. ప్రతిరోజూ సరాసరి రూ.30లక్షల చొప్పున ఆదాయం వస్తుంది. జిల్లాలో ఒంగోలు, మార్కాపురం ఆర్‌వోలతోపాటు మొత్తం 18 కార్యాలయాలు ఉన్నాయి. 15 రోజులకు సుమారుగా రూ.5కోట్లు మేర నష్టం ఉంటుందని అంచనా కాగా కోట్లలో లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఎక్కువమంది ఇబ్బందులకు గురవుతున్నారు.


ఈసీలు, నకళ్లు రాక పాట్లు 

ఈసీలు, నకళ్లు కూడా రాకపోతుండటంతో సామాన్యుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. రిజిస్ర్టేషన్లు అయితే విధిలేని పరిస్థితుల్లో వేచి ఉంటామని కానీ ఈసీలు, నకళ్లు కూడా రాకపోతుండటంతో నానా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు సమయం కావడంతో బ్యాంకు లావాదేవీలకు ఈసీలు ఎంతో కీలకం కాగా పదిహేను రోజులుగా వాటి కోసం దరఖాస్తు చేసిన వారు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. పది రోజులుగా మీసేవ కేంద్రాల్లో ఈసీ, నకలు కోసం దరఖాస్తు చేసేందుకు కూడా వీలు లేకుండా సర్వర్‌ని నిలిపివేయగా శనివారం నుంచి పునరుద్ధరించారు. అయితే సర్వర్‌ పునరుద్ధరించినట్లు కనిపిస్తుందే తప్ప నమోదు చేయాలంటే పనిచేయటం లేదని మీసేవ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. రైతులే గాక వ్యాపారులు, ఇతరత్రా అన్నివర్గాల ప్రజలకు తిప్పలు తప్పటం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సమస్య సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇబ్బంది లేకుండా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల్లో సేవలు ఎప్పటినుండి అందుబాటులోకి వస్తాయో ప్రకటించటం ద్వారా ప్రజలకు తిరిగే అవసరం లేకుండా వ్యయప్రయాసలైనా తప్పించాలని కోరుకుంటున్నారు. 


ఆన్‌లైన్‌ సేవలు మెరుగవుతాయి

విజయలక్ష్మి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ 

గత రెండురోజులుగా డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అవుతున్నాయి 15 రోజులుగా లావాదేవీలు నిలిచిన మాట వాస్తవమే. అమరావతిలో సర్వర్‌కు సంబంధించి పనులు జరుగుతున్నాయి. అవి పూర్తికావస్తున్నాయి. త్వరలో పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ సేవలు మెరుగుపడతాయి.




Updated Date - 2021-07-22T07:12:29+05:30 IST