రేషన్‌ పంపిణీలో సర్వర్‌ టెన్షన్స్‌

ABN , First Publish Date - 2021-01-25T06:44:15+05:30 IST

ఇంటింటికీ రేషన్‌ అన్నారు.. ఇప్పటి వరకు సర్వర్..

రేషన్‌ పంపిణీలో సర్వర్‌ టెన్షన్స్‌

డోర్‌ డెలి‘వర్రీస్’‌! 

డీలర్లకు తరుగు లేకుండా బియ్యం ఇవ్వగలరా?

ప్రతి బియ్యం బస్తాకు సీల్‌, నెంబరు తప్పనిసరి

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు వచ్చే ధాన్యంలోనే తరుగు 

మ్యాపింగ్‌తో కొందరు డీలర్లకే సంతోషం

కొందరికి తగ్గిపోయిన కార్డుల కేటాయింపు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రేషన్‌ డోర్‌ డెలివరీ సమీపిస్తున్న కోద్దీ... వర్రీస్‌ కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. ఎలాగైనా పథకాన్ని అమలు చేయాలనుకుంటున్నారు తప్ప అనేక అంశాల మీద ఇప్పటికీ స్పష్టత లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో అధికార వ్యవస్థలు, కార్డుదారులు, డీలర్లకు సంబంధించి అనేక సందేహాలున్నాయి. రేషన్‌ డోర్‌ డెలివరీ సమీపిస్తున్నా, ఇవి సమాధానాలు లేని ప్రశ్నలుగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకుంటున్న రేషన్‌ డోర్‌ డెలివరీ కంటే ముందు పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. వీటిపై ఇప్పటికైనా సివిల్‌ సప్లయిస్‌ ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం కూడా దృష్టి సారిస్తే మంచిది. 


ఇంటింటికీ రేషన్‌ అన్నారు.. ఇప్పటి వరకు సర్వర్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే ప్రయత్నమే చేయలేదు. దీంతో రేషన్‌ పంపిణీలో ఈ నెల కూడా సర్వర్‌ సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. కార్డుదారులు ఇబ్బందులు పడకుండా ఉండాలన్నా.. ఇంటింటికి వెళ్లే వలంటీర్లు, వీఆర్వోలు, మొబైల్‌ వాహన యజమానులు ఇబ్బందులు పడకుండా ఉండాలన్నా, సర్వర్‌ సామర్ధ్యాన్ని మెరుగు పరుచుకోవాల్సి ఉంటుంది. బియ్యం, ఇతర నిత్యావసరాలను బస్తాల్లోనే ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి చౌక దుకాణాలకు పంపిణీ చేస్తారు. వీటిని కాటా వేయటం లేదు. ఇలా చేయటం వల్ల తరుగు ఉంటే చౌక దుకాణ డీలరే భరించేవాడు. రేషన్‌ డోర్‌ డెలివరీలో ప్రతి బస్తాకు కోడ్‌ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రతి బస్తాను కాటా వేసి, దానికి సంచి బరువు జోడించి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన ప్రతి బస్తా కోడ్‌ను ఈ పోస్‌లో నమోదు చేసి, కాటా పెట్టి మొబైల్‌ డెలివరీ వాహనదారునికి డీలర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆచరణలో సాధ్యం కాదని అధికార వర్గాలే అంటున్నాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు వచ్చే ధాన్యం తూకం సక్రమంగా ఉంటేనే.. చౌక దుకాణానికి కూడా అదే పరిమాణంలో వెళుతుంది. మరి చౌక దుకాణాలకు తరుగు లేకుండా పూర్తి రేషన్‌ను అందించగలరా అన్నది నేటికీ ప్రశ్నగానే ఉంది. 


మ్యాపింగ్‌ తలనొప్పి

గతంలో ఏరియాలవారీగా రేషన్‌ దుకాణాలకు కార్డులను కేటాయించేవారు. దీంతో దుకాణాలన్నింటికీ  కాస్త అటు ఇటుగా కార్డుల సంఖ్యలో, కోటా విషయంలో న్యాయం జరిగేది.  ప్రస్తుతం సచివాలయాల వారీగా కార్డులను దుకాణాలకు కేటాయించడంతో భారీ వ్యత్యాసాలు వచ్చాయి. పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో సచివాలయాల్లో కార్డుల సంఖ్య అధికంగా ఉన్న చోట డీలర్లకు గతం కంటే అధికంగా వచ్చాయి. ఇలాంటి వారికి ఇపుడు కమీషన్‌ బాగా పెరిగింది. కాలనీలు, అపార్టుమెంట్‌లు ఉన్న చోట, సచివాలయాలు తక్కువ. ఇలాంటి చోట్ల డిపోలకు గతంలో ఉన్న సంఖ్య కంటే తక్కువగా కార్డులు కేటాయించారు. దీంతో వీరికి కమీషన్‌ బాగా తగ్గిపోతోంది. 


దుకాణాల అద్దెలను భరించగలరా? 

కార్పొరేషన్‌, మునిసిపాలిటీల పరిధిలో దుకాణాల అద్దెలు అధికంగా ఉంటాయి. ఇప్పటి వరకు డీలర్లు తమకు వచ్చే కమీషన్‌తో పాటు ఖాళీ బియ్యం సంచులను అమ్మగా వచ్చిన ఆదాయం, నాన్‌ పీడీఎస్‌ సరుకులు అమ్మగా వచ్చిన దానితో అద్దెలు, దిగుమతి చార్జీలు, హెల్పర్‌ జీతాలు వంటి ఖర్చులు భరించగా, మిగిలింది ఇంటికి తీసుకువెళ్లేవారు. ప్రస్తుతం ఖాళీ బియ్యం సంచులను వాపసు తీసుకోవాలనే నిబంధన రావడం, కార్డుదారునికి, డీలర్‌కు మధ్య సంబంధం తెగిపోవడం, నాన్‌ పీడీఎస్‌ సరుకులు అమ్ముకునే వెసులుబాటు పోవడంతో ఇపుడు కేవలం కమీషన్‌తోనే డీలర్‌ దిగుమతి చార్జీలు, దుకాణం అద్దె భరించాలి. నూతన విధానంలో సచివాలయాల వారీగా కార్డుల కేటాయింపు జరగడం, కార్డుల సంఖ్య తగ్గిపోవడంతో వచ్చే కమీషన్‌ దుకాణం అద్దెలకు కూడా రాదని డీలర్లు వాపోతున్నారు.

Updated Date - 2021-01-25T06:44:15+05:30 IST