సర్వర్‌ ప్రాబ్లమ్‌!

ABN , First Publish Date - 2022-05-30T04:58:20+05:30 IST

పీఎం కిసాన్‌ ఈకేవైసీ నమోదు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది.

సర్వర్‌ ప్రాబ్లమ్‌!
చేవెళ్ల మండలం నారాయణదాస్‌గూడలో ఈకేవైసీ నమోదు కోసం లబ్ధిదారుల పడిగాపులు

  • పీఎం కిసాన్‌ ఈకేవైసీ నమోదులో సాంకేతిక సమస్యలు
  • ఆధార్‌కు ఫోన్‌ నెంబర్‌ లింక్‌ చేయడంలో అవస్థలు
  • ఈనెల 31తో ముగియనున్న గడువు 
  • జూన్‌ 30 వరకు గడువు పొడిగించినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం
  • అధికారికంగా ఇంకా ఉత్తర్వులు వెలువడలేదంటున్న అధికారులు
  • జిల్లాలో కిసాన్‌ పథక లబ్ధిదారులు 1,75,773 మంది రైతులు
  • ఇప్పటివరకు ఈకేవైసీ చేయించుకున్నవారు 60,877 మంది 


పీఎం కిసాన్‌ ఈకేవైసీ నమోదు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. బయోమెట్రిక్‌ ప్రక్రియలో సర్వర్‌ సమస్య ఉత్పన్నం కావడం పెద్ద తలనొప్పిగా మారింది. రైతులు పనులు మానుకొని సీఎస్‌సీ కేంద్రాలు, ఆధార్‌, మీసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, మే 29) : జిల్లాలో ఈకేవైసీ నమోదుకోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రాల వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. ప్రధానంగా ఆధార్‌కు ఫోన్‌ నెంబర్‌ లింకు లేకపోవడంతో ఈకేవైసీలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇప్పటివరకు జిల్లాలో ఈకేవైసీని 34.6శాతం మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. పీఎం కిసాన్‌లో ప్రభుత్వం కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు ఆప్షన్‌ ఇవ్వకపోవడంతో చాలామంది రైతులు ఈ పథకానికి నోచుకోవడం లేదు. ఈకేవైసీ పూర్తిచేసుకున్న రైతులకు మాత్రమే ప్రస్తుతం రూ.2వేల చొప్పున చెల్లిస్తారు.. నమోదు పూర్తికాకుంటే ఈ సీజన్‌ నుంచి డబ్బులు నిలిపివేయనున్నారు.

రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పనిసరిగా ఈనెలాఖరు వరకు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. పలు రాష్ర్టాల్లో లక్షల సంఖ్యలో బోగస్‌ పేర్లను లబ్ధిదారులుగా నమోదు చేసుకుని గత సీజన్‌లో నిధులు కాజేసినట్లు కేంద్రం గుర్తించింది. వానాకాలం సీజన్‌లో అర్హులను గుర్తించేందుకు ఈకేవైసీని తప్పనిసరిగా చేసింది. కాగా ఈనెల 31 గడువును విధించింది. ఈ గడువును జూన్‌ 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఇంకా అధికారికంగా తమకు ఉత్తర్వులు వెలువడలేదని జిల్లా వ్యసాయాధికారులు చెబుతున్నారు. 


ఈకేవైసీ ఇప్పటివరకు 34.6 శాతమే పూర్తి

కేంద్ర ప్రభుత్వం రైతుల పంటల సాగు కోసం పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఏడాదికి రూ.6 వేల పెట్టుబడి సాయాన్ని విడతలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అయితో కొందరు బోగస్‌ పేర్లను నమోదు చేయించుకుని లబ్ధిపొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఈ పథకానికి అర్హులుగా ఉన్నవారు ఆధార్‌కు ఫోన్‌ నెంబర్‌ లింక్‌ చేసుకుని ఈకేవైసీ చేయించుకున్న వారికే పెట్టుబడి సాయం అందుతుందని కేంద్రం ప్రకటించింది. ఈనెల 31లోగా ఈకేవైసీ చేయించుకున్న వారికే పెట్టుబడిసాయం అందుతుందని కేంద్రం ప్రకటించింది. జిల్లాలో 1,75,773 మంది రైతులు పీఎం కిసాన్‌ పథకానికి అర్హులుగా ఉన్నారు. అందులో ఇప్పటివరకు 60,877మంది రైతులు మాత్రమే ఈకేవైసీ చేయించుకున్నారు. అంటే 34.6 శాతం మాత్రమే ఈకేవైసీ చేయించుకున్నారు. 


అనుసంధానం ఇలా..

రైతులు ముందుగా పీఎం కిసాన్‌ పథకం వివరాలు ఇచ్చినా తమ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ కార్డును అనుసంధానం చేసుకోవాలి.. తదుపరి ఆధార్‌ కార్డుకు ఫోన్‌ నెంబర్‌ను అనుసంధానం చేయాలి. అనంతరం పీఎం కిసాన్‌ పోర్టల్‌లో ఆధార్‌ ఆధారితంగా ఈకేవైసీ చేస్తున్నప్పుడు ఫోన్‌ నెంబర్‌కు వచ్చే రెండు ఓటీపీలను నమోదు చేస్తేనే ఈకేవైసీ పూర్తవుతుంది. సెల్‌ఫోన్‌లో పీఎం కిసాన్‌ యాప్‌ ద్వారా లేదంటే పోర్టల్‌ ద్వారా నేరుగా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లో కూడా ఈకేవైసీని పూర్తిచేయాలి. ఆధార్‌ ద్వారా ఈకేవైసీని పూర్తిచేసిన అర్హులైన రైతులు బ్యాంక్‌ ఖాతాకు నిధులు విడుదల చేస్తారు. బోగస్‌ రైతులు జాబితా నుంచి తొలగించబడుతారు. 


అవగాహన కరువు

ఆధార్‌ అనుసంధానం, ఈకేవైసీ చేసుకోవడం గురించి చాలామంది రైతులకు క్షేత్రస్థాయిలో తెలియదు. దీంతో అర్హులైన రైతులు వివిధ పథకాల కింద రావాల్సిన లబ్ధిని కోల్పోవాల్సి వస్తుంది. తెలిసిన వారు వెళ్లినా మీ సేవ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, ఆధార్‌కు ఫోన్‌ నెంబర్‌లు లింక్‌ లేకపోవడం వంటి కారణాలతో మళ్లీమళ్లీ తిరగాల్సి వస్తోంది. ప్రభుత్వం వ్యవసాయ అధికారుల ధాన్యం నాణ్యత ధ్రువీకరణ పనుల్లో నిమగ్నమై ఉండగా ఈకేవైసీ పూర్తి చేయించేందుకు రైతులకు అవగాహన కల్పించలేక పోతున్నారు. 


సర్వర్‌ సమస్య వస్తుంది

పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌ సర్వర్‌ సమస్య ఎదురవుతుంది. ఈ సమస్య కారణంగా ఒక రైతు పేరు కిసాన్‌ సమ్మాన్‌లో ఈకేవైసీ నమోదు చేసేందుకు 10 నుంచి 20 నిమిషాల టైం పడుతుంది. దీంతో మిగతా లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడం లేదు. ఆధార్‌కు ఫోన్‌ నెంబర్‌ లింకు లేకపోవడం, కొంత మంది లబ్ధిదారులకు సెల్‌ఫోన్‌ లేకపోవడంతో కిసాన్‌ సమ్మాన్‌ పథకానికి దూరమవుతున్నారు.

- మల్లేష్‌, సీఎస్‌సీ కేంద్ర నిర్వాహకుడు 


నమోదు చేసుకోండి

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కోసం రైతులు ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. బ్యాంకు ఖాతాకు ఆధార్‌ కార్డును, ఆధార్‌కు ఫోన్‌ నెంబరను లింక్‌ చేసుకుంటేనే కేంద్ర  ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాం అందుతుంది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఈకేవైసీ నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాను. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఈకేవైసీ నమోదుపై అవగాహన కల్పిస్తున్నాం. 

- గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి







Updated Date - 2022-05-30T04:58:20+05:30 IST