ఈసారైనా ‘సర్వేపల్లి’ పూర్తవుతుందా!?

ABN , First Publish Date - 2022-05-27T05:15:50+05:30 IST

సర్వేపల్లి కాలువ ఆధునికీకరణ పనులు ఈ ఏడాదైనా పూర్తవుతాయా.. అన్న ప్రశ్న ఇప్పుడు రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

ఈసారైనా ‘సర్వేపల్లి’ పూర్తవుతుందా!?
అర్ధంతరంగా ఆగిన సర్వేపల్లి కాలువ పనులు

గతేడాది మొదలైన పనులు

ఆశించిన స్థాయిలో జరగక పెండింగ్‌

ఈ ఏడాది కూడా ఆయకట్టుకు క్రాప్‌ హాలిడే

సాగు ముగిసి నెలవుతున్నా ఊపందుకోని పనులు

మూడో ఏడాది కూడా హాలిడే అంటే ఇబ్బందులే..!


నెల్లూరు, మే 26 (ఆంధ్రజ్యోతి) : సర్వేపల్లి కాలువ ఆధునికీకరణ పనులు ఈ ఏడాదైనా పూర్తవుతాయా.. అన్న ప్రశ్న ఇప్పుడు రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. గతేడాదే ఈ కాలువ కింద ఆయకట్టుకు క్రాప్‌ హాలిడే ప్రకటించి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఆశించిన స్థాయిలో పనులు జరగలేదు. రబీ సీజన మొదలవడంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా సర్వేపల్లి కాలువ కింద క్రాప్‌ హాలిడే ప్రకటించారు. మరి ఈ ఏడాదైనా పనులు పూర్తవుతాయో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే రబీ పంట ముగిసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కాలువ పనులు ఊపందుకోలేదు. ఇలాగే జరిగితే వచ్చే ఏడాది కూడా క్రాప్‌ హాలిడే అంటే ఇబ్బందేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు నగర పరిధిలో సర్వేపల్లి కాలువను ఆధునికీకరించేందుకు దాదాపు రూ.100 కోట్లతో గతేడాది పనులు మొదలు పెట్టారు. కాలువకు ఇరువైపులా రీటైనింగ్‌ వాల్‌ నిర్మించడంతోపాటు కాంక్రీట్‌ బెడ్‌ వేయాల్సి ఉంది. మొదటి దశలో మూడు కిలోమీటర్ల మేర ఈ పనులు చేయాల్సి ఉంది. గతేడాది కొంత మేర రీటైనింగ్‌ వాల్స్‌ నిర్మించారు. ఈ కాలువ గట్టున ఉన్న పేదలను ముందస్తు జాగ్రత్తగా ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. వారు కూడా ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయా అని ఎదురుచూస్తున్నారు. కాగా బిల్లుల సమస్యతో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. గతేడాది మాదిరిగా పనులు జరిగితే ఈ ఏడాది కూడా పనులు పూర్తి చేయడం కష్టమవుతుంది. డెల్టా పరిధిలోని సర్వేపల్లి కాలువ కింద ఏటా 50 వేల ఎకరాల వరకు సాగు జరుగుతుంటుంది. గతేడాది రెండో పంట కింద సర్వేపల్లి కాలువ మినహా మిగతా అంతా నీటి కేటాయింపులు జరిపారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. దీంతో ఆ ప్రాంత రైతులు, రైతు కూలీలు ఉపాధి కోసం బయట ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. కాగా ఈ పనులపై ఇరిగేషన ఎస్‌ఈ కృష్ణమోహనను వివరణ అడగ్గా పనులు మొదలైనట్లు చెప్పారు. అయితే రామలింగాపురం జంక్షన వద్ద ఫ్లైఓవర్‌ పనులు జరుగుతుండడంతో సర్వేపల్లి కాలువ పనులు వేగంగా చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వీలైనంత వేగంగా పనులు పూర్తి చేయించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. 

Updated Date - 2022-05-27T05:15:50+05:30 IST