లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డుకు ఎంపికైన సీరం ఇన్‌స్టిట్యూట్ చైర్మన్‌

ABN , First Publish Date - 2021-07-31T22:05:19+05:30 IST

సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ సైరస్

లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డుకు ఎంపికైన సీరం ఇన్‌స్టిట్యూట్ చైర్మన్‌

పుణే : సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ సైరస్ పూనావాలా ప్రతిష్ఠాత్మక లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డ్, 2021కు ఎంపికయ్యారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారంతో సత్కరిస్తున్నారు. లోకమాన్య తిలక్ ట్రస్ట్ ప్రెసిడెంట్ దీపక్ తిలక్ ఈ వివరాలను ప్రకటించారు. 


దీపక్ తిలక్ మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి సమయంలో డాక్టర్ సైరస్ పూనావాలా విశేషంగా కృషి చేశారని చెప్పారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ ద్వారా ఆయన అనేక మంది ప్రాణాలను కాపాడటానికి సాయపడ్డారన్నారు. ఆయన నాయకత్వంలో కోట్లాది కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను రికార్డు సమయంలో ప్రపంచానికి అందుబాటులోకి వచ్చాయన్నారు. రకరకాల వ్యాక్సిన్లను అందుబాటు ధరలకు తయారు చేయడంలో ఆయన ముందు వరుసలో ఉన్నారని తెలిపారు. 


ఆగస్టు 13న జరిగే కార్యక్రమంలో డాక్టర్ పూనావాలాకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ పురస్కారంతోపాటు రూ.1 లక్ష నగదు, ఓ మెమెంటో ప్రదానం చేస్తామన్నారు. 


లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డును ప్రతి సంవత్సరం లోకమాన్య బాల గంగాధర్ తిలక్ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 1న ఇస్తూ ఉంటామని, ఈసారి కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసి, ఆగస్టు 13న నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పురస్కారాన్ని బహూకరించడం 1983 నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. సామ్యవాద నేత ఎస్ఎం జోషీ, మాజీ ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్‌పాయి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వంటి ప్రముఖులకు ఈ పురస్కారాలను ప్రదానం చేసినట్లు తెలిపారు. 


Updated Date - 2021-07-31T22:05:19+05:30 IST