అధికారుల తీరుపై గరం.. గరం..

ABN , First Publish Date - 2022-08-05T05:51:37+05:30 IST

‘అధికారుల నిర్లక్ష్యం మితి మీరింది.. ఎంత చెప్పినా ధోరణి మారడం లేదు.. డివిజన్లలో సమస్యలపై ప్రజలు మమ్మ ల్ని నిలదీస్తున్నారు.. జవాబు చెప్పలేకపోతున్నాం.. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లాం.. గుర్తించిన సమస్యలను అధికారులకు తెలియచేశాం.. పెడ చెవిన పె డుతున్నారు.. ఇలా అయితే ఎలా’ అంటూ అధికారులపై కార్పొరేటర్లు మండిపడ్డారు.

అధికారుల తీరుపై గరం.. గరం..
సమావేశ మందిరంలోకి సభ్యులతో కలిసి వస్తున్న మేయర్‌ గుండు సుధారాణి

పనుల పూర్తి చేయడం లేదు..
ఫిర్యాదు చేసినా పెడచెవిన పెడుతున్నారు..
పట్టణ ప్రగతి సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు..
బల్దియా కౌన్సిల్‌ సమావేశంలో కార్పొరేటర్ల ఆగ్రహం
డివిజన్‌ రూ.50 లక్షల మంజూరు
నగరాభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నాం : మేయర్‌ గుండు సుధారాణి
సమావేశానికి సైకిల్‌పై వచ్చిన చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌


జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), ఆగస్టు 4 : ‘అధికారుల నిర్లక్ష్యం మితి మీరింది.. ఎంత చెప్పినా ధోరణి మారడం లేదు.. డివిజన్లలో సమస్యలపై  ప్రజలు మమ్మ ల్ని నిలదీస్తున్నారు.. జవాబు చెప్పలేకపోతున్నాం.. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లాం.. గుర్తించిన సమస్యలను అధికారులకు తెలియచేశాం.. పెడ చెవిన పె డుతున్నారు.. ఇలా అయితే ఎలా’ అంటూ అధికారులపై కార్పొరేటర్లు మండిపడ్డారు. హనుమకొండలోని బల్దియా ప్రధాన కార్యాలయంలో గురువారం సర్వసభ్య సమావేశం జరిగింది. మేయర్‌ సుధారాణి అధ్యక్షత వహించారు.

సమావేశంలో మొత్తం ప్రతిపాదించిన ఎజెండాలోని ఆరు అంశాలనును కౌన్సిల్‌ ఆమోదించింది.  పట్టణ ప్రగతి సమస్యలపైనే సమావేశంలో అధికంగా చర్చ జరిగింది. అధికారపక్షంతో పాటు విపక్ష సభ్యులు కూడా అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. పట్టణ ప్రగతి సమస్యల పరిష్కారానికి డివిజన్‌కు రూ.30లక్షలు కేటాయించాలన్న ఎజెండాలోని సప్లమెంటరీ అంశం సభ్యుల డిమాండ్‌తో డివిజన్‌కు రూ.50లక్షల కేటాయింపుతో మార్పు చోటు చేసుకుంది. వరద ముప్పు సమస్యలను సభ్యులు ప్రస్తావించారు. లోతట్టు ప్రాంతాలతో పాటు నగరంలోని ప్రధాన రహదారులు కూడా జలమయం అవుతున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం చేపట్టాలన్నారు.

సమావేశం ఆరంభానికి ముందుగా బల్దియా కార్యాలయం ప్రాం గణంలో మేయర్‌ గుండు సుధారాణితో కలిసి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్పొరేటర్లకు హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలను పంపిణీ చేశారు. బల్దియా సమావేశానికి చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ భద్రకాళి ఆలయం నుంచి సైకిల్‌పై వచ్చా రు. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌ నిషేధం అంశాలపై ప్రజల్లో చైత న్యం కలిగించే స్ఫూర్తిగా ఆయన సైకిల్‌పై బల్దియా కార్యాలయానికి చేరుకున్నారు. డిప్యూటీ మేయర్‌కు వాహనం కేటాయింపు అంశం సమావేశంలో చర్చకు దారి తీసిన క్రమంలో.. ‘నిబంధనలు ఈ మేరకు ఉన్నాయా..?’ అంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రశ్నించారు. సమావేశంలో ఈ అంశంపై చర్చ సరైంది  కాదన్నారు.  మొత్తంగా వాహన కేటాయింపు అంశం ఆమోదం పొందింది.

డివిజన్లలో తిరగలేకపోతున్నాం..

డివిజన్లలోని సమస్యలపై విపక్షాలతోపాటు అధికార సభ్యులు కూడా ఏకరువు పెట్టారు. పైప్‌లైన్‌ లీకేజీలు, మిషన్‌ భగీరథ సమస్యలపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్లలో విద్యుత్‌ స్తంభాల మార్పు, ఇళ్లపై నుంచి విద్యుత్‌ తీగలు.. తదితర సమస్యల పరిష్కారం ఎప్పడంటూ కార్పొరేటర్లు అధికారులను నిలదీశారు. ఈ విషయంలో విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యంగా ఉందన్నారు. ఎస్‌ఈ మధుసూదన్‌ దీనిపై సమాధానమిస్తూ.. దెబ్బతిన్న స్తంభాల మార్పు జరిగిందన్నారు. దీనిపై కార్పొరేటర్లు ఒక్కసారిగా లేచి ‘ఎక్కడా చేశారో రండి చూద్దాం..’ అంటూ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో తాను కొత్తగా వచ్చానని, సమయం ఇవ్వాలంటూ సమాధానం చెప్పడంతో సమావేశం ముందుకు సాగింది.

డివిజన్‌కు రూ.50లక్షల మంజూరు
పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యల తక్షణ పరిష్కారానికి డివిజన్‌కు రూ.30లక్షలు తొలుత ప్రతిపాదించారు. నిధులు సరిపోవని, అంచనాలు అధికం గా ఉన్నాయనే డిమాండ్‌తో డివిజన్‌కు రూ.50 లక్షలు కేటాయిస్తున్నట్లు మే యర్‌ సుధారాణి ప్రకటించడంతో సభ్యులు ఆనందంతో ఆమోద అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. రూ.5లక్షలు అత్యవసరమైన పనుల వినియోగానికి తక్షణమే వి డుదల చేస్తున్నట్లు మేయర్‌ ప్రకటించారు. మిగతా నిధుల వినియోగం ఆయా డివిజన్లలో పనుల నిర్వహణకు టెండర్‌ ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు.

జర్నలిస్టులను అనుమతించాలి

కౌన్సిల్‌ సమావేశాలకు జర్నలిస్టులను అనుమతించాలని కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ వెంకన్న సమావేశంలో డిమాండ్‌ చేశారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులను సమావేశాలకు అనుమతించకపోవడం సరైంది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫ్లోర్‌ లీడర్లకు కార్యాలయంలో ప్రత్యేక గదులు కేటాయించాలని కోరారు. అన్నపూర్ణ భోజన కేంద్రాలను అండర్‌ రైల్వే గేట్‌ ప్రాంతంలో కేటాయించాలని కార్పొరేటర్‌ మరుపల్ల రవి కోరారు. అధికారుల తీరు మారకుంటే తాము నిరసన చేపట్టాల్సి ఉంటుందని కార్పొరేటర్‌ జోషి స్పష్టం చేశారు.

నగరాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నాం
- మేయర్‌ గుండు సుధారాణి

నగరాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. వరద ముప్పు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం అ య్యాయి. రూ.300కోట్ల అంచనాలతో డీపీఆర్‌ సిద్ధం చేశారు. పారిశు ధ్య నిర్వహణకు అధునాతన వాహనాల సమకూర్పు జరిగింది. స్వానిధిలో దేశంలోనే వరంగల్‌ నెంబర్‌వన్‌గా నిలిచింది. నగరంలోని 20 ప్రధాన రహదారులు, 40కాలనీలో ఏర్పడే ముంపు సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా బృందాల ఏర్పాటు జరిగింది. 66 డివిజన్లలో సాధారణ నిధుల ద్వారా రూ.151కోట్ల పనులు జరుగుతున్నాయి. రూ.191.8కోట్ల అంచనాలతో చేపట్టే 1163 పనులు టెండర్‌ ప్రక్రియ లో ఉన్నాయి. స్మార్ట్‌సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయి. కీలక పనులు ముగింపు దశకు చేరాయి. పట్టణ ప్రగతి, నగరబాట సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. డివిజన్‌కు రూ.50 లక్షలు కేటాయింపు జరిగింది.

అభివృద్ధి నిరంతర ప్రక్రియ : చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌

అభివృద్ధి నిరంతర ప్రక్రియ. నగరాభివృద్ధికి రాజీపడేది లేదు. ముఖ్యంగా వరంగల్‌ నగరంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టితో ఉన్నారనేది సుస్పష్టం. నగరం ఐటీ, పర్యాటక రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. స్మార్ట్‌ ప్రాజెక్టు పనులతో నగర రూపురేఖలు మారుతున్నాయి. నిధుల కొరత లేకుండా పనుల పూర్తి జరుగుతోంది.

ప్రత్యేక సమావేశం నిర్వహించాలి : సారయ్య, ఎమ్మెల్సీ
ప్రజాప్రతినిధులు, అధికారులు, గుత్తేదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. పనులు జరగడంలో అధికారులు, గుత్తేదారుల పాత్ర కీలకం. వీరు నిర్లక్ష్యంచేస్తే ఆ ఫలితాన్ని ప్రజాప్రతినిధులు అనుభవించాల్సి వస్తుంది. అధికారుల తీరు మారాలి. పనులు పూర్తి చేయని గుత్తేదారులకు నోటీసులు జారీ చేసి తొలగించండి.

విలీన గ్రామాలకు నిధులు కేటాయించాలి : ఎమ్మెల్యే అరూరి  రమేష్‌

విలీన గ్రామాలకు అధిక నిధులు కేటాయించాలి. గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదు. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టండి. ఇంజనీరింగ్‌ విభాగంలో సిబ్బంది కొరత ఉంది. ఈ విషయమై మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలి.



Updated Date - 2022-08-05T05:51:37+05:30 IST