సిజేరియన్లపై సీరియస్‌!

ABN , First Publish Date - 2022-05-19T09:00:28+05:30 IST

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అవసరం లేకపోయినా జరుగుతున్న సిజేరియన్‌ ప్రసవాలపై వైద్యారోగ్య శాఖ సీరియస్‌ దృష్టిని సారించింది.

సిజేరియన్లపై సీరియస్‌!

  • ఇక ప్రతిరోజూ శస్త్ర చికిత్సలపై ఆడిట్‌
  • ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో తప్పనిసరి 
  • కడుపుకోతల కట్టడికి వైద్యశాఖ చర్యలు  


హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అవసరం లేకపోయినా జరుగుతున్న సిజేరియన్‌ ప్రసవాలపై వైద్యారోగ్య శాఖ సీరియస్‌ దృష్టిని సారించింది. ఇలాంటి శస్త్ర చికిత్సలను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రతీరోజూ సీ- సెక్షన్‌ ఆడిట్‌ను తప్పనిసరి చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ సీజేరియన్‌ ఆడిట్‌ ఫార్మాట్‌ను పంపారు. సీజేరియన్‌ డెలివరీ చేస్తే అందుకు గల కారణాలను తప్పనిసరిగా ఆ ఆడిట్‌ ఫార్మాట్‌లో నమోదు చేయాలి. ప్రతిరోజూ తమ ఆస్పత్రుల్లో జరిగే సీ-సెక్షన్‌ వివరాలను ఆడిట్‌ చేసి ప్రభుత్వానికి పంపాలి. కాగా, ఎక్కువగా సిజేరియన్‌ డెలివరీలు జరుగుతున్న ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. సిజేరియన్‌ డెలివరీలను తగ్గించేందుకు వైద్యశాఖ చేసిన సిఫారసులను తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది.


అలాగే ఆడిట్‌పై తప్పనిసరిగా నెలవారీగా సమీక్షలు చేయాలని సూచించింది. రాష్ట్రంలోని 40 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 61 శాతానికి మించి సీజేరియన్‌ ఆపరేషన్లు జరుగుతున్నట్లు వైద్యశాఖ పరిశీలనలో వెల్లడైంది. గతేడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబరు చివరి వరకు వైద్యశాఖ సర్కారీ ఆస్పత్రుల్లో ప్రసవాలపై జరిపిన అధ్యయనంలో ఇది వెల్లడైంది. అందులో మహబూబాబాద్‌ జిల్లా గూడూరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో అత్యధికంగా 88 శాతం జరిగాయి. ఆ తర్వాత హుజురాబాద్‌  ఏరియా ఆస్పత్రిలో 87 శాతం, నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో 84,  నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ సీహెచ్‌సీలో 80, వేములువాడ సీహెచ్‌సీలో 78, మంథని సీహెచ్‌సీలో 76, పరకాల సీహెచ్‌సీలో 77 శాతం జరిగాయి. ఏరియా ఆస్పత్రుల విషయానికొస్తే కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, మహబూబాబాద్‌, ములుగు, నాగార్జున సాగర్‌, దేవరకొండ, భైంసా, గోదావరిఖని, హుజూర్‌నగర్‌, సూర్యాపేటలలో సగటున 61 శాతానికిపైగా చోటు చేసుకున్నాయి. ఇక హైదరాబాద్‌ కింగ్‌కోఠీ జిల్లా ఆస్పత్రితో పాటు జగిత్యాల, కరీంనగర్‌, ఖమ్మం, సిరిసిల్ల జిల్లా ఆస్పత్రుల్లో 61 శాతానికిపైగా జరిగాయి. ఇవేకాక మరో 98 సర్కారీ దవాఖానాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సగటు కంటే ఎక్కువగానే జరిగినట్లు తేలింది.  


ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి హరీశ్‌రావు 

దేశంలోనే సిజేరియన్‌ ప్రసవాలు ఎక్కువగా తెలంగాణలోనే జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతీ వంద ప్రసవాల్లో 61 శాతం సీజేరియన్‌ డెలివరీలే జరుగుతున్నాయి. ఇదే విషయం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో కూడా వెల్లడైంది. దీన్ని తీవ్రమైన ఆందోళన కలిగించే అంశంగా వైద్యశాఖ పరిగణించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ అంశాన్ని సీరియ్‌సగా తీసుకున్నారు. రాష్ట్రంలో కడుపు కోతలు తగ్గించేందుకు పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇలాంటి ఆపరేషన్లు ఎక్కువగా జరిగే కరీంనగర్‌ జిల్లాపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటులో 90 శాతానికిపైగా సిజేరియన్‌ ఆపరేషన్లు జరుగుతున్నాయి. దీంతో ఆ జిల్లాపై  వరుసగా సమీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైౖవేటు ఆస్పత్రుల గైనకాలజిస్టులను పిలిచి, ఇలాంటి ఆపరేషన్లను తగ్గించేందుకు సహకరించాలని కోరారు. 



ఆడిట్‌పై వైద్యారోగ్య శాఖ సూచనలివే... 

ప్రతి ఆస్పత్రి విఽధిగా ప్రతీ రోజూ (ఒకవేళ సీజేరియన్‌ ఆరోజు చేస్తే) ఆడిట్‌ నిర్వహించాలి.

అత్యవసర పరిస్థితుల్లోనే సిజేరియన్‌ ఆపరేషన్‌ ద్వారా ప్రసవం చేయాలి. కేసు షీట్‌లో గర్భధారణ చరిత్ర, ప్రసవ సమయ స్థితి, తదితర అంశాలను రాయాలి. 

ఆస్పత్రి వారీగా ఒకటి, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో మరొక కమిటీ ఉండాలి. ఆ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలి. 

ఆడిట్‌ ఫార్మాట్‌ను సీజేరియన్‌ డెలివరీ చేసిన వైద్యులే నింపాలి. ఒకవేళ ఆ రోజు ఆడిట్‌ ఫార్మాట్‌ నింపలేకపోతే మరుసటి రోజు డ్యూటీకి వచ్చిన వెంటనే ఫిలప్‌ చేయాలి. అలాగే అందుకు గల కారణాలు రాయాలి. వైద్యుడి అభిప్రాయాలను అందులో జోడించాలి. 

సీజేరియన్స్‌పై ప్రతీనెలా తప్పనిసరిగా ఆస్పత్రుల స్థాయిలోనే సమీక్ష నిర్వహించుకోవాలి. ఆడిట్‌ రిపోర్టును ప్రతినెలా 5వ తేదీ సాయంత్రం లోగా జిల్లా పరిఽధిలోని ఆస్పత్రులంతా జిల్లా వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు పంపాలి. వారు జిల్లాకు సంబంధించిన సమాచారం అంతా కలపి ప్రతీ నెలా 10వ తేదీలోగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు పంపాలి. 


Updated Date - 2022-05-19T09:00:28+05:30 IST