సిండికేట్‌పై సీరియస్‌!

ABN , First Publish Date - 2022-08-02T06:41:36+05:30 IST

మద్యం బార్ల లైసెన్సులలో పలుచోట్ల సిండికేట్‌ వ్యవహారం కొనసాగగా, మరికొన్ని చోట్ల వ్యాపారులు పోటీపడి భారీమొత్తానికి దక్కించుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే ఒంగోలులో వ్యాపారులు సిండికేట్‌ అయిన విషయం తేటతెల్లమైంది.

సిండికేట్‌పై సీరియస్‌!

ఒంగోలులో మద్యం వ్యాపారుల రింగ్‌పై ప్రభుత్వం ఆరా

దృష్టిసారించిన ఎస్‌ఈబీ కమిషనర్‌ 

చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు బాలినేని ఫిర్యాదు 

వ్యాపారుల్లో ఒక సామాజికవర్గం వారే అధికంగా ఉండటమే కారణమా?

మద్యం బార్ల లైసెన్సులలో పలుచోట్ల సిండికేట్‌ వ్యవహారం కొనసాగగా, మరికొన్ని చోట్ల వ్యాపారులు పోటీపడి భారీమొత్తానికి  దక్కించుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే ఒంగోలులో వ్యాపారులు సిండికేట్‌ అయిన విషయం తేటతెల్లమైంది. రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాకేంద్రాల్లోనూ ఇలాంటి తంతే జరిగినట్లు స్పష్టమైంది. అయితే  ఒంగోలులో  వ్యవహారంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. దీంతో నగరంలో బార్ల లైసెన్సుకు నిర్వహించిన ఈ-పాటను రద్దు చేసి తిరిగి నిర్వహిస్తారా? అనే అంశం చర్చనీయాంశమైంది. సాక్షాత్తూ మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ సిండికేట్‌ వ్యవహారంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో బార్ల నిర్వహణ కోసం వేలం విధానానికి ప్రభుత్వం శ్రీకారం పలికిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు ఆదివారం వేలం నిర్వహించారు. వేలం తంతుని చూస్తే ఒంగోలులో వ్యాపారులు సిండికేట్‌ అయి లైసెన్సులు దక్కించుకున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒంగోలు, మార్కాపురం, చీరాల, కందుకూరులలో కనీస ఫీజుని ఏడాదికి రూ.35లక్షలుగా నిర్ణయించారు. మార్కాపురంలో ఐదు బార్లకు గాను ఒక బార్‌ లైసెన్సుకి అత్యధికంగా రూ.1.47కోట్లు పలకగా, మిగిలిన నాలుగు బార్లకు కూడా రూ. కోటిపైనే పాట జరిగి వ్యాపారులు దక్కించుకున్నారు. కందుకూరులోని మూడింటిలో ఒక్కో బారుకి రూ.35లక్షలు కనీస లైసెన్సు ఫీజుని ప్రభుత్వం నిర్ణయించగా అన్ని బార్లకు రూ.కోటికి పైగా చెల్లించేలా వ్యాపారులు దక్కించుకున్నారు. చీరాలలో ఆరు బార్లకి అత్యధికంగా రూ.86 లక్షలు, ఆ తర్వాత రూ.85లక్షలు ధర పలికింది. ఏమైనా అక్కడ కూడా రూ.57లక్షలకు పైగానే ప్రతి బార్‌ని వ్యాపారులు దక్కించుకున్నారు. ఙ


అటు భారీగా... ఇటు సిండికేటుగా..

ఇక నగరపంచాయతీల విషయానికొస్తే అద్దంకి, దర్శిలో ఉన్న ఒక్కో బార్‌ లైసెన్సుకి అధికమొత్తంలో వేలం జరిగింది. అద్దంకిలో ఒక బార్‌ లైసెన్సుకి ఏడాదికి రూ.1.37 కోట్లు చెల్లించేందుకు సిద్ధమై ఒకరు పాట పాడారు. ఆ తర్వాత దర్శిలో రూ.1.47 కోట్లకు బార్‌ లైసెన్సును ఒక పాటదారుడు దక్కించుకున్నాడు. నగర పంచాయతీ అయిన చీమకుర్తిలో కూడా ఒక బార్‌కు రూ.1.07కోట్ల ఫీజు లభించింది. కనిగిరిలో రూ.61 లక్షలు, గిద్దలూరులో రూ.21లక్షల ప్రకారం అక్కడ బార్‌ లైసెన్సులను వ్యాపారులు చేజిక్కించుకున్నారు. అయితే విచిత్రంగా ఒంగోలులో వ్యాపారులు సిండికేట్‌ అయి అతి తక్కువ మొత్తానికే లైసెన్సులు పొందగలిగారు. ఒంగోలులో మొత్తం 15 బార్లకు గాను ఒక్కోదానికి రూ.35 లక్షలు కనీస వేలం ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. 15 బార్లకు కేవలం 19 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అందులోనూ అత్యధిక ధరకు ఒక బార్‌ లైసెన్సుని రూ.39లక్షలకే పొందారు. ఇతర బార్లు కూడా రూ.37 లక్షల లోపు ధరకే వేలంలో వ్యాపారులు దక్కించుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పలికిన ధరలను, ఒంగోలులో పలికిన ధరలను చూస్తేనే ఇక్కడ వ్యాపారులు సిండికేట్‌ అయి వేలంలో పాల్గొన్నారన్న విషయం తేటతెల్లమవుతోంది. ఇలాంటి పరిస్థితే రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లలో కూడా నెలకొందని అంటున్నారు. అయితే ఒంగోలులో ఈ సిండికేట్‌ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించడం చర్చనీయాంశమైంది. 


బాలినేని ఫిర్యాదు 

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఇతర పట్టణాలు, నగర పంచాయతీల్లో వచ్చిన ఆదాయం కూడా ఒంగోలు బార్‌ లైసెన్సుల ద్వారా రాకపోవటానికి కారణం ఏమిటని స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సోమవారం సాయంత్రం కలెక్టరుకి ఫోన్‌చేసి అడిగినట్లు తెలిసింది. ఈ విషయమై తక్షణం విచారించి అవసరమైతే వేలం రద్దు చేసి తిరిగి నిర్వహించటం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరిగేలా చూడాలని కోరినట్లు సమాచారం. ఆతర్వాత కలెక్టరు కూడా సదరు శాఖ కమిషనర్‌తో ఈ విషయమై చర్చించినట్లు తెలిసింది. తదనుగుణంగా ఒంగోలులో బార్‌ల లైసెన్సుల వ్యవహారంపై మొత్తం యంత్రాంగం దృష్టిసారించింది. జరిగిన ఈ వేలంను రద్దు చేసి తిరిగి నిర్వహించే అవకాశం ఉందా లేదా అనే విషయంపై న్యాయశాఖ అధికారులు ఇచ్చే సూచనకు అనుగుణంగా యంత్రాంగం ముందుకుపోయే అవకాశం కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలోని ఇతర కొన్ని ప్రధాన నగరాల్లో వ్యాపారులు కలిసిపోయిన తరహాలోనే ఒంగోలులోనూ సిండికేట్‌ అయ్యారు. అయితే ఇక్కడ బార్‌ల వ్యాపారుల్లో ఎక్కువమంది తెలుగుదేశానికి మద్దతుగా ఉండే ఒక సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారన్న ఉద్దేశంతోనే వైసీపీ నేతలు ఫిర్యాదు మేరకు యంత్రాంగం దృష్టిసారించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందనేది వేచిచూడాలి.



Updated Date - 2022-08-02T06:41:36+05:30 IST