పీఆర్‌సీపై తీవ్ర మోసం

ABN , First Publish Date - 2022-01-22T09:07:08+05:30 IST

వేతన సవరణ విషయంలో ఉద్యోగులను జగన్‌ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసింద ని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.

పీఆర్‌సీపై తీవ్ర మోసం

ఉద్యోగుల పోరాటానికి టీడీపీ మద్దతు: చంద్రబాబు

జీతాలు పెంచాలని అడిగితే తగ్గించిన ప్రభుత్వం ఇదొక్కటే

అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): వేతన సవరణ విషయంలో ఉద్యోగులను జగన్‌ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసింద ని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఉద్యోగులు తమకు జరిగిన అన్యాయంపై చేసే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. జీతాలు పెంచాలని అడిగితే తగ్గించింది ఒక్క వైసీపీ సర్కారు మాత్రమేనని దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన తమ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వైసీపీ పాలనతో రాష్ట్ర ప్రజ లు విసిగిపోయారని చెప్పారు. ‘విధానాలు, పన్నులు, అధికారిక దోపిడీతో ప్రతి ఒక్కరి జీవితాన్నీ ఈ ప్రభుత్వం నష్టపరుస్తోంది. ఇప్పటికే కొన్ని వర్గాలు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో అనేక వర్గాల ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. పోలీసులు, కేసులు దానిని ఆపలేవు’ అని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల దోపిడీ అనేకచోట్ల విపరీతంగా ఉందని, మండల, నియోజకవర్గ స్థాయి నేతలు ఈ అవినీతి, దోపిడీపై స్థానికంగా గట్టి పోరాటం చేయాలని సూచించారు.


ఓటమి తప్పదని వైసీపీకి అర్థమైంది..

ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీకి దారుణమైన ఓటమి తప్పదని, ఈ విషయం ఆ పార్టీ వర్గాలకు కూడా ఇప్పటి కే అర్థమైందని చంద్రబాబు అన్నారు. తమ కష్టాలు పోవాలంటే మళ్లీ టీడీపీ రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని.. అలాగని టీడీపీ నేతలు ప్రజా సమస్యలపై పోరాడడం మానవద్దని గట్టిగా సూచించారు. ఒక రాజకీయ పార్టీగా నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉండాలని.. ప్రజల్లో ఉండి పనిచేస్తుంటేనే పార్టీ అయినా.. నాయకుడైనా మనగలుగుతారని తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కొన్నిచోట్ల అనుకున్న స్థాయిలో పోరాటాలు జరగడం లేదని, అటువంటి చోట్ల నేతలు తమ పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు. టీడీపీ మరింత దూకుడుగా ఉండాలని అనేక వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల ఆకాంక్షలు అందుకోలేనివారు వెనకబడిపోతామని గుర్తించాలని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న మండల, గ్రామ కమిటీల నియామకాన్ని సత్వరం పూర్తి చేయాలని నాయకులను ఆదేశించారు. ఓటర్ల జాబితా నవీకరణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వలంటీర్ల ద్వారా దొంగ ఓటర్లను చేర్పించడం.. ఒక ప్రాంతంలోని ఓటర్లను చెల్లాచెదురు చేసి వేర్వేరు డివిజన్లకు మార్చడం వంటి కుయుక్తులను అడ్డుకోవాలని ఆదేశించారు.


కరోనా రోగులను ఆదుకోండి

పోరాటాలు ఎంత ముఖ్యమో కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. దీనిలో భాగంగానే ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా కరోనా రోగులకు ఉచిత సేవలను మళ్లీ మొదలుపెట్టినట్లు తెలిపారు. అవకాశం ఉన్నంతవరకూ కరోనా రోగులకు వైద్య సేవలు అందించాలని కోరారు. నిరుడు కరోనా సమయంలో ట్రస్టు బాగా పనిచేసిందన్న పార్టీ నేతలు... మేనేజింగ్‌ ట్రస్టీ భువనేశ్వరి కృషిని ప్రశంసించారు.


బాబుకు పరామర్శ

కరోనాకు గురైన చంద్రబాబును ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు పరామర్శించారు. ఆరోగ్యం గురించి వాకబు చేశారు. వెంటనే కోలుకున్నానని, రెండో రోజు నుంచే ఫోన్‌ ద్వారా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని ఆయన చెప్పారు.

Updated Date - 2022-01-22T09:07:08+05:30 IST