Abn logo
Apr 10 2020 @ 00:15AM

గాలివాన బీభత్సం

నేలవాలిన వరి, అరటి

ధ్వంసమైన బొప్పాయి

తడిసిన ధాన్యం, మిర్చి

రైతులకు తీవ్ర నష్టం


న్యూస్‌ నెట్‌వర్క్‌, ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 9: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వందలాది ఎకరాల్లో మిర్చి, వరి, అరటి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనూహ్యంగా గాలివాన కురివడంతో ఆరబెట్టిన ధాన్యం, మిర్చిని రైతులు కాపాడుకోలేకపోయారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అరటి, బొప్పాయికి మార్కెట్‌ సౌకర్యం లేక రైతులు పంటను కోయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గాలివాన దెబ్బకు పండ్లు నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం పరిహారం అందజేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


జిల్లా వ్యాప్తంగా పంట నష్టం

సంజామల మండలంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి వరి పంట నేలకొరిగింది. ఆరబెట్టిన మిరప, వరి ధాన్యం తడిసిపోయింది. అనూహ్యంగా వర్షం కురవడంతో రైతులు ధాన్యం, మిర్చిపై పట్టలు కప్పుకొనే వ్యవధి కూడా లేకపోయింది. దీంతో తీవ్రంగా నష్టపోయారు.


మహానంది మండలంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురిసింది. వరి, అరటి పంటలు నేలకొరిగాయి. రైతులకు లక్షలాది రూపాయల నష్టం జరిగింది. చేతికి వచ్చిన పంట మట్టిపాలు కావడంతో రైతులు కంటతడి పెట్టుకున్నారు. 


బండి ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో  గురువారం మధ్యాహ్నం గాలివాన కురిసింది. ఉన్నట్టుండి ఆకాశం మబ్బులు కమ్మి గాలి రేగింది. ఒక్క సారిగా వాన పడింది. దీంత కోతకు వచ్చిన వరి పంట నేల కూలింది. కళ్ళాల్లో వరి ధాన్యం తడవకుండా చూసేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. 


పాములపాడు మండలంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి వరి పైరు నేల వాలింది. రబీలో సాగుచేసిన వరి చివరి దశకు చేరుకుంది. ఈ సమయంలో వర్షంతో తీవ్రంగా నష్టపోయామని వరి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో కేసీ ఆయకట్టు కింద 72 హెక్టార్లలో వరి సాగుచేశారు. వేంపెంట. కృష్ణానగర్‌, శాంతినిలయం, భానకచెర్ల, పాములపాడు, మిట్టకందాల గ్రామాల్లో వరి పైరు నేలవాలింది. దీంతో దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణానగర్‌లో విద్యుత్‌ స్తంభాలు, పొలాల్లో వృక్షాలు కూలాయి. గ్రామానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఏఈ రాజేందర్‌ సంఘటన స్థలానికి చేరుకుని విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. మొక్కజొన్న రైతులు అకాల వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


చాగలమర్రి మండలంలో గురువారం సాయంత్రం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. చిన్నవంగలిలో 50 ఎకరాల్లో అరటి, బొప్పాయి పంటలు ధ్వంసమయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా పంటను కోయకుండా అలాగే ఉంచారు. ఈ సమయంలో వర్షంతో రైతులకు  రూ.50 లక్షల దాకా నష్టం వాటిల్లింది. ఎకరాకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. గ్రామానికి చెందిన రైతులు రామగురివిరెడ్డి, గురుశేఖర్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, సంజీవరాయుడు తదితరులకు చెందిన 30 ఎకరాల్లో అరటి, 20 ఎకరాల్లో బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లింది. 


కొలిమిగుండ్ల మండలం మదనంతపురం గ్రామ పరిధిలో గురువారం సాయంత్రం  పెనుగాలులతో కురిసిన వర్షాలకు సుమారు 100 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అరటికి డిమాండ్‌ తగ్గింది. నెల క్రితం టన్ను రూ.16 వేలు ఉండగా ప్రస్తుతం రూ.2 వేలకు పడిపోయింది. వర్ష బీభత్సంతో ఆ పంట కూడా నేలపాలైంది. మదనంతపురం గ్రామానికి చెందిన రైతు యాతం శివరామిరెడ్డికి చెందిన మూడు ఎకరాలు, తిమ్మారెడ్డికి చెందిన మూడు ఎకరాలు, గంగరాజుకు చెందిన రెండు ఎకరాలు, లక్ష్మీకాంతరెడ్డికు చెందిన మూడు ఎకరాల అరటి తోటలు నేలకూలాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని  రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యానవనశాఖ ద్వారా నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. 


మద్దికెర మండలంలో గురువారం తెల్లవారుజామున 14.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆరబెట్టిన మిరప, ఉల్లి దిగుబడులు తడిసిపోయాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. 


శ్రీశైలం, సున్నిపెంట, లింగాలగట్టులో గురువారం మధ్యాహ్నం రెండు గంటల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ ప్రాంతాల్లోని ప్రధాన వీధులు వర్షపు నీటితో నిండిపోయాయి. సున్నిపెంటలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. మూడు రోజులుగా మండల వ్యాప్తంగా వర్షం కురుస్తోంది.


731.81 హెక్టార్లలో పంట నష్టం: జేడీఏ

జిల్లాలో ఈ నెల 8న కురిసిన వడగండ్ల వాన, ఈదురుగాలులకు 731.81 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశామని వ్యవసాయశాఖ జేడీ విల్సన్‌ గురువారం తెలిపారు. మొక్కజొన్న 66.2 హెక్టార్లు, వరి 665 హెక్టార్లలో దెబ్బతినిందని, ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపామని ఆయన తెలిపారు. రైతువారిగా పూర్తి స్థాయిలో ఎంత నష్టం జరిగిందో అంచనా వేయాలని మండల వ్యవసాయాధికారులను ఆదేశించామని ఆయన తెలిపారు. జూపాడుబంగ్లా, మిడ్తూరు, అవుకు, హోళగుంద, హాలహర్వి మండలాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. జిల్లాలో జరిగిన పంట నష్టంపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి త్వరలోనే అందజేస్తామని జేడీఏ తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement