సెమీస్‌కు సెరెనా

ABN , First Publish Date - 2020-09-10T08:51:26+05:30 IST

ఓపెన్‌ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించేందుకు అమెరికా టెన్నిస్‌ క్వీన్‌ సెరెనా విలియమ్స్‌ రెండు మ్యాచ్‌ల దూరంలో ..

సెమీస్‌కు సెరెనా

యూఎస్‌ ఓపెన్‌

ఒసాక, జ్వెరెవ్‌, పాబ్లో కూడా


న్యూయార్క్‌: ఓపెన్‌ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించేందుకు అమెరికా టెన్నిస్‌ క్వీన్‌ సెరెనా విలియమ్స్‌ రెండు మ్యాచ్‌ల దూరంలో నిలిచింది. యూఎస్‌ ఓపెన్‌లో బల్గేరియా క్రీడాకారిణి స్వెతానా పిరొంకోవాను ఓడించి సెమీ్‌సకు చేరుకొంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సెరెనా 4-6, 6-3, 6-2తో పిరొంకోవాపై నెగ్గింది. తొలి సెట్‌ ఆరంభం నుంచే పిరొంకోవా ధాటిగా ఆడింది. సెరెనా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన బల్గేరియా ప్లేయర్‌ 3-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.


5-3తో ఉన్నప్పుడు రెండుసార్లు సెట్‌ పాయింట్లు చేజార్చుకున్నా.. పదో గేమ్‌ నెగ్గి తొలి సెట్‌ను దక్కించుకుంది. ఇక రెండో సెట్‌ తొలి గేమ్‌లోనే సెరెనా సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన పిరొంకోవా 1-0 ఆధిక్యంలో నిలిచింది. కానీ, తర్వాతి నుంచి విజృంభించిన విలియమ్స్‌ 6-3తో రెండో సెట్‌ను సొంతం చేసుకొంది. నిర్ణాయక మూడో సెట్‌లో మరింత దూకుడు పెంచిన సెరెనా 6-2తో నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. మ్యాచ్‌లో సెరెనా మొత్తం 11 ఏస్‌లు సంధించింది. 


రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌ నవోమి ఒసాక యూఎస్‌ ఓపెన్‌లో జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌ ఒసాక 6-3, 6-4తో షెల్బీ రోజర్స్‌ (అమెరికా)ను వరుస సెట్లలో ఓడించింది. కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌ చేరిన అమెరికా అన్‌సీడెడ్‌ ప్లేయర్‌ జెన్నిఫర్‌ బ్రాడీతో ఒసాక అమీతుమీ తేల్చుకోనుంది. మొత్తం ఏడు ఏస్‌లు కొట్టిన ఒసాక..24 విన్నర్లు సంధించింది. మరో మ్యాచ్‌లో బ్రాడీ 6-3, 6-2తో యూలియా పుతిన్‌త్సెవా (కజకిస్థాన్‌)పై అలవోకగా నెగ్గింది. టోర్నీలో బ్రాడీ ఇప్పటిదాకా ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. 


పాబ్లో పోరాటం..


పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌తోపాటు స్పెయిన్‌ సంచలనం పాబ్లో కర్నెనో బుస్టా సెమీస్‌ బెర్త్‌ను సొంతం చేసుకున్నారు. హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌లో పాబ్లో 3-6, 7-6(5), 7-6(4), 0-6, 6-3తో 12వ సీడ్‌ డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా)పై పోరాడి నెగ్గాడు. నాలుగు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో డెనిస్‌ 26 ఏస్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడినా.. 11 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. జర్మనీ స్టార్‌ జ్వెరెవ్‌ 1-6, 7-6(5), 7-6(1), 6-3తో 27వ సీడ్‌ బోర్నా కోరిక్‌పై గెలుపొందాడు. 


ఒసాక భావోద్వేగం..


జాతి వివక్ష, సామాజిక న్యాయంపై ప్రజా చైతన్యం కోసం తనవంతు కృషి చేస్తున్న ఒసాకకు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు చెబుతున్నాయి. పోలీసుల కాల్పులో మరణించిన నల్లజాతీయుడి పేరున్న మాస్క్‌లను మ్యాచ్‌ల సందర్భంగా నవోమి ధరిస్తున్న విషయం తెలిసిందే. క్వార్టర్స్‌ మ్యాచ్‌ సందర్భంగా ఇటీవల మరణించిన అహ్‌మౌద్‌ ఆర్బెరీ, ట్రేవన్‌ మార్టిన్‌ కుటుంబాలు ఒసాకాకు వీడియో సందేశాన్ని పంపాయి. మృతులకు ఆమె ఇస్తున్న గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాయి. ఆ సందేశం చూసిన ఒసాక తీవ్ర భావోద్వేగానికి గురైంది. వర్ణ వివక్షపై అవగాహన కోసం తాను చేస్తున్న ప్రయత్నం ఇదని ఆమె చెప్పింది. 

Updated Date - 2020-09-10T08:51:26+05:30 IST