సెప్టెంబర్ 17: రాజకీయ క్రీడలో ఎవరిది గెలుపు?

ABN , First Publish Date - 2022-09-08T06:43:25+05:30 IST

రాహుల్ గాంధీ తిరుమల కొండ మీదకు మెట్ల దారిన వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. పగుళ్లు పెరుగుతున్న భారత్‌ను జోడించడానికని ఆయన పాదయాత్ర ప్రారంభించారు....

సెప్టెంబర్ 17: రాజకీయ క్రీడలో ఎవరిది గెలుపు?

రాహుల్ గాంధీ తిరుమల కొండ మీదకు మెట్ల దారిన వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. పగుళ్లు పెరుగుతున్న భారత్‌ను జోడించడానికని ఆయన పాదయాత్ర ప్రారంభించారు. చూశారా, రాహుల్ గాంధీ తాను బ్రాహ్మడినని హిందువునని గతంలో చెప్పుకున్నారు, ఇప్పుడు రాజకీయ యాత్రకు ముందు దేవుణ్ణి దర్శించారు, మా వల్లనే కదా ఈ మార్పు అని బిజెపి అభిమానులు సంతోషిస్తున్నారు. నిజమే, గత ఎనిమిదేళ్లలో భారతీయ జనతపార్టీ ప్రభావాన్ని ప్రతిపక్షాలు కూడా అనివార్యంగా అంగీకరించవలసి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా పఠించవలసి వచ్చింది, మమతా బెనర్జీ చీటికి మాటికి అమ్మవార్ల దర్శనం చేసుకోవలసి వచ్చింది. పాడుపడిన గుడుల పునరుద్ధరణకు స్టాలిన్ ఎన్నికల వాగ్దానం చేయవలసి వచ్చింది. కానీ, కొద్దిగా రాజీపడినా, ఆ ముగ్గురూ బిజెపి జైత్రయాత్రకు బాధితులు కాకుండా తప్పించుకున్నారని కూడా గుర్తించవలసి ఉంది. సైద్ధాంతిక వైఖరుల మీద ప్రాణప్రదమైన పట్టింపులు లేనప్పుడు, ఆచరణాత్మకతో లేక అవకాశవాదమో కానీ, ప్రత్యర్థిని నిరాయుధుడిని చేయగల ఎత్తుగడలను ఆశ్రయించడం మంచిదనిపిస్తుంది. విధానపరమైన యుద్ధంలో ప్రత్యర్థులు బలహీనపడ్డారని తెలిసిన విజేత, ఎప్పుడూ అదే రకం యుద్ధం సాగితే తనకు ఎదురు ఉండదనుకుంటాడు. ఆ విషయం తెలియని బలహీనుడు, అదే యుద్ధరంగంలో శ్లేష్మంలో ఈగలా కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఉనికి ముఖ్యమైన కాలంలో, ఉనికే ముఖ్యం.


బహుశా, ఎత్తుగడల రసాయనం తెలంగాణకు కూడా ప్రవహించినట్టుంది. రెండు దశాబ్దాలుగా బిజెపి అదే పనిగా పదునుపెట్టుకుంటున్న ఖడ్గం సెప్టెంబర్ 17ను కెసిఆర్ ఒక్కసారిగా మొద్దుబార్చగలిగారనిపిస్తుంది. విమోచన దినోత్సవం తామే జరిపి, తెలంగాణ ప్రభుత్వాన్ని, కెసిఆర్‌ను బోనులో నిలబెట్టాలనుకున్న బిజెపి, మజ్లిస్ సమేతంగా టిఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్ణయం తీసుకునేసరికి అవాక్కయింది. టిఆర్ఎస్ దిగివచ్చిందా, ఇన్నాళ్ల నుంచి నిలబడ్డ వైఖరి నుంచి దిగజారిందా అన్న ప్రశ్నలకు పెద్దగా చెలామణీ లేదు. ఎత్తుకు పై ఎత్తు పడిందా లేదా? మునుగోడుకు ముందు ముందస్తు పైచేయి దొరికిందా లేదా? – అన్నవిప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నలు. తెలంగాణకు విముక్తో విమోచనమో జాతీయసమైక్యతో సిద్ధించిన రోజు మాత్రమే కాదు, దేశస్వాతంత్ర్యానికి సంబంధించిన సంబరాలలో సైతం, తమలపాకు స్పందనకు, తెలంగాణ నుంచి తలుపుచెక్క ప్రతిస్పందన లభించింది. మోదీ దేశభక్తికి దీటుగా, ఆ మాటకు వస్తే, కాసింత ఎక్కువగా కెసిఆర్ దేశభక్తి, పలుకొలతల పతాకాలు రెపరెపలాడాయి! దీనికి కూడా బిజెపి పూర్తి క్రెడిట్ తీసుకోవచ్చును. అదే సమయంలో, అధికార విస్తరణకు అవరోధాలు ఏర్పడడం నిజం కాదా?


రాహుల్ హిందూత్వం తమ వల్లనే అని ఆనందించినట్టే, సెప్టెంబర్ 17 పాటింపు తమ ఘనతే అని ఆనందించవచ్చును కదా? ఎంత జాతీయ అధికారపార్టీ స్థాయికి ఎదిగినా తెలంగాణలో మాత్రం బిజెపి మజ్లిస్‌తో సమస్థాయి పార్టీగానే తనను తాను భావించుకుంటుంది. అది ఆ ద్వంద్వంలో బందీ అయిపోయింది. మజ్లిస్ చెప్పినందువల్లనే కెసిఆర్ సెప్టెంబర్ 17ను గుర్తిస్తున్నాడు తప్ప, సొంతంగా కాదు అని చెబుతూ, తెలంగాణ ప్రభుత్వాన్ని మజ్లిసే నడిపిస్తున్నది అనే పాత పాట బిజెపి పాడుతున్నది. మొత్తానికి, చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఒక అంశం ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది, ఏ పేర్లతో అయితేనేమి అందరూ అధికారికంగానో, అనధికారికంగానో తెలంగాణపై పోలీసు చర్య వార్షికోత్సవాలను జరుపుకుంటారు. విద్రోహదినమనో, దురాక్రమణ దినమనో అక్కడక్కడ చిన్న చిన్న అసమ్మతి వ్యక్తీకరణలు వినిపించవచ్చును తప్ప, తక్కినదంతా ఒకే పాట. సర్దార్ పటేల్‌కు నిజాం అభివాదం చేస్తున్న ఫోటోను విస్తృతంగా ప్రచారంలో పెట్టవచ్చు. రాజకీయ లాభం తెచ్చే అంశంగా మాత్రం సెప్టెంబర్ 17 నిర్వీర్యం అయిపోయింది.


తెలంగాణలోకి విస్తరించాలనుకునే రాజకీయశక్తులు, ఈ రాష్ట్రం చరిత్రను కనీసంగా తెలుసుకోవాలి. గస్తీ నిషాన్‌కు దస్తీ–నిషాన్‌కు తేడా తెలియనివాళ్లు జాగ్రత్తగా హోంవర్క్ చేయాలి! ‘‘సమైక్యత ఏమిటి సమైక్యత, రజాకార్లు చేసిన దుర్మార్గాలన్నీ మరచిపోవాల్నా’’ అని ఒక పెద్ద నాయకుడు ప్రశ్నిస్తున్నారు. రజాకార్ల కాలంలో జరిగిన అఘాయిత్యాల జ్ఞాపకాలను సజీవంగా ఉంచాలనుకోవడంలోని విజ్ఞత ఏమిటో తెలియదు కానీ, తెలంగాణలో రజాకార్ల దుర్మార్గాలంటూ విడిగా లేవు. అవి నిజాం రాజ్యంలో ప్రజల మనుగడ పోరాటంలో ఎదురైన దుర్మార్గాలు. పేరుకు నిజాం వ్యతిరేక పోరాటమే కానీ, సారాంశంలో అది భూస్వామ్య వ్యతిరేక పోరాటం. తెలంగాణ గ్రామాలలో నిజాం ప్రతినిధులు అత్యధికులు హిందూ భూస్వాములే. రజాకార్లకు ఆశ్రయాన్ని, పోషణను ఇచ్చిందీ వాళ్లే. రైతాంగ పోరాటానికి కేంద్రాలయిన ఊర్లు తిరిగితే, ఏ భూస్వామి అండతో ఎక్కడ రజాకార్లు హింసకు పాల్పడిందీ వివరంగా తెలుస్తుంది. ఇప్పుడు వివిధ పార్టీలలో ఉన్న భూస్వామ్య కుటుంబాల వారిలో కొందరి పూర్వీకులకైనా రజాకార్లతో సంబంధాలు ఉండి ఉంటాయి. బిజెపి కూడా అందుకు మినహాయింపు కాదు. నిజాం అధికారపీఠానికి మూలస్తంభాలు ఎవరో తెలిస్తే, తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం ఎందుకో, ఎవరితోనో తెలుస్తుంది. రజాకార్లు చేసిన అత్యాచారాలు, హత్యలు తెలుగు భూస్వాముల అండతో, ప్రోద్బలంతో జరిగిన హత్యలే. స్థానిక భూస్వాముల ప్రాపకం లేనిచోట ఎక్కడా రజాకార్ చర్యలు జరగలేదు. ఆ భూస్వామ్య శక్తుల వారసులతో కూడా తెలంగాణ ప్రజలు లెక్కలు తేల్చుకోవలసి ఉంటుందా మరి?


అతి కొద్దిమంది భూస్వాములు నిజాంకు వ్యతిరేకంగా గొంతెత్తారు కానీ, అత్యధికులు ఆఖరు నిముషం వరకు ఆ పాలనలోనే తమ ప్రయోజనాలను చూసుకున్నారు. నిజాంను గద్దె దించడానికి కాంగ్రెస్ పార్టీ చివరి ఏడాది, రెండేళ్లు కొంత ప్రయత్నించింది కానీ, అంతకు మునుపు లేదు. దేశీయ సంస్థానాలలో ఉద్యమాలు వద్దనేది కాంగ్రెస్ విధానంగా ఉండేది. కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం, ఆశయం వేరు, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని కోరుకున్నది నిజమే కానీ, ప్రధాన లక్ష్యం భూస్వామ్యం. కాబట్టే, పోరాటం 1948తో ఆగలేదు. నిజాంను లొంగదీసుకున్న తరువాత, ఆయనకు సాయుధమద్దతుదారులుగా ఉన్న రజాకార్లను అణచివేసిన తరువాత, యూనియన్ సైన్యం భూస్వాముల పెత్తనాన్ని పునరుద్ధరించింది, కమ్యూనిస్టులపై యుద్ధం మొదలుపెట్టింది. మొత్తం మీద ఈ పోలీసుచర్య వేలాది మరణాలకు దారితీసింది. రజాకార్ల దుర్మార్గాలు నిజమే, కానీ, దానికి ప్రతీకారం పేరుతో కర్ణాటక, మహారాష్ట్రలలోని నిజాం ప్రాంతాలలో పోలీసుచర్య సందర్భంగా పెద్ద ఎత్తున ఊచకోతలు కూడా జరిగాయి. అవన్నీ విషాదాలు! ఇప్పుడు ఏ చరిత్రను తట్టి లేపుదాం? ఏ తేనె తుట్టెను అదిలిద్దాం? బాధ్యత కలిగిన నాయకులు, చరిత్రలోని ద్వేషాన్ని వర్తమానంలోని ప్రేమ ద్వారా చల్లార్చాలి.


ఇప్పుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తమ చరిత్రను తామే చెరిపేసుకుంటూ, తన పోరాటస్మారకాలను పరులకు ధారాదత్తం చేస్తూ, సెప్టెంబర్ 17 సందర్భంగా సాయుధపోరాట ఉత్సవాలు జరుపుకుంటున్నాయి. (తమను అణచివేయడానికి జరిగిన కార్యక్రమాన్ని తామే వేడుకగా జరుపుకోవడం ప్రపంచంలో ఎక్కడా చూడము!) రాజకీయ ప్రజా ఉద్యమాలు తీవ్రంగా జరిగి, ప్రభుత్వాన్ని కూలదోసి ఉంటే, అది పెద్ద వేడుకకు ఆస్కారం ఇచ్చి ఉండేది. భారతసైన్యాలు బలప్రయోగంతో అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం వల్ల, అందులో ప్రజాభాగస్వామ్యం లేనందువల్ల ఆ సందర్భాన్ని జరుపుకోవడానికి సమాజంలో కుతూహలం పెద్దగా లేకపోయింది. పైగా, నిజాం పతనం, సైనికపాలన ముస్లిముల సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రతిపత్తులలో చాలా మార్పు తీసుకువచ్చాయి. సెప్టెంబర్ 17ను వేడుక జరుపుకోవడం ఆ గాయాలను గుర్తుచేసినట్టు అవుతుందన్న సున్నితత్వంతోనే ప్రభుత్వాలు దాటవేస్తూ వచ్చాయి. ఆ సున్నితత్వం రాజకీయ వ్యవస్థలో ఉండడం ఆరోగ్యకరం, అభిలషణీయం. తెలుగుదేశం, టిఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా అదే ఆనవాయితీని అనుసరించాయి. విమోచనం అనే మాట బదులు జాతీయ సమైక్యత అన్న మాటను ఎంచుకోవడంలో కూడా ఆ పట్టింపు ఉన్నది. మజ్లిస్ ఒత్తిడి వల్ల ఇంతకాలం సెప్టెంబర్ 17 వేడుకను జరపలేదు అన్న వాదన సరైనది కాదు, 1957 దాకా మజ్లిస్ పార్టీ మీద నిషేధమే ఉన్నది. 1960లో మాత్రమే మజ్లిస్ తరఫున మొదటి కార్పొరేటర్ ఎన్నికయ్యారు. 1970 దశకానికి ఆ పార్టీకి హైదరాబాద్ నగరంలో కొంత బలం సమకూరింది. మరి తొలినాటి ప్రభుత్వాలు ఎందుకు విమోచన దినం జరుపుకోలేదు?


ఇప్పుడు సహజంగా కలిగే సందేహం, కేంద్రప్రభుత్వం ద్వారా విమోచన దినం జరపడానికి బిజెపికి మాత్రం ఎనిమిదేండ్లు ఎందుకు పట్టింది? 2014 నుంచే చేయవచ్చును కదా? తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఈ సంవత్సరం జూన్ 2న ఢిల్లీలో ఆ పార్టీ మొదటిసారిగా జరిపింది. ఎందుకు ఇన్నేళ్లు జరపలేదు? అంటే, రాజకీయంగా తెలంగాణ మీద పూర్తిస్థాయి గురిపెట్టిన తరువాత మాత్రమే, రాష్ట్రావతరణ, విమోచన దినోత్సవాలను చేపట్టారు. తెలంగాణలో అధికారపార్టీ కూడా సెప్టెంబర్ 17 సమస్యను ముందే పరిష్కరించి ఉండవచ్చు, ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే ముందు తీసుకుని ఉండవచ్చు. కానీ, దానిని మరొక పక్షం తీవ్రస్థాయికి తీసుకువెళ్లి, ప్రమాదం ముంచుకు వచ్చేదాకా స్పందించలేదు. అన్ని సందర్భాలలోనూ ఇంత సమయం దొరకకపోవచ్చు. పరిష్కరించకుండా మురగబెట్టిన సమస్యలతో మొదటికే మోసం రావచ్చు.


ఉత్తరాదిలో చేసినట్టుగా తెలంగాణలో వివాదాస్పద చరిత్ర ఆధారంగా రాజకీయాలు నిర్వహించడం సులభం కాదని రాజకీయపక్షాలకు ఎవరైనా శ్రేయోభిలాషులు సలహా ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి, ఉద్యమాలు నిర్వహించడానికి అనేక ప్రజాసమస్యలున్నాయి. ప్రత్యామ్నాయంగా మారడానికి అనేక అవకాశాలూ ఉన్నాయి. తమకు తెలిసింది ఒకటే విద్య, పిడుక్కీ బియ్యానికీ అదే అంటే, భంగపాటు తప్పదు.


కె. శ్రీనివాస్

Updated Date - 2022-09-08T06:43:25+05:30 IST