Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మానవహక్కుల్లో మన ఒరవడి వేరు

twitter-iconwatsapp-iconfb-icon
మానవహక్కుల్లో మన ఒరవడి వేరు

మానవహక్కుల సంరక్షణలో ఇటీవల మన దేశం పాల్పడిన అవకతవకలపై అంతర్జాతీయ విమర్శలు, అభియోగాలను మనం తప్పక పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. విశ్వ మానవహక్కుల ప్రకటనలో పొందుపరిచిన మానవహక్కుల పునరుద్ధరణకు పటిష్ఠచర్యలు తీసుకోవాలి. ఇదే సమయంలో మనం మరింత సమగ్రమైన, న్యాయబద్ధమైన మానవహక్కుల ఒడంబడికను రూపొందించి ఐక్యరాజ్యసమితి ఆమోదానికి నివేదించాలి.


భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘన దారుణంగా జరుగుతోందని అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థలు అనేకం విమర్శిస్తున్నాయి. ప్రభుత్వేతర సంస్థలపై ఆంక్షలు, ప్రజా ఉద్యమాల కార్యకర్తల అరెస్టులు, పౌరసత్వ సవరణ చట్టం పర్యవసానాలపై ఐక్యరాజ్యమితి మానవ హక్కుల హై కమిషనర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారు, మానవహక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు మౌనం వహించేలా చేసేందుకు భారత ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను ఉపయోగించుకుంటోందని’ హ్యూమన్‌రైట్స్ వాచ్ విమర్శించింది. ఈ విమర్శలకు సహేతుకమైన కారణాలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి విశ్వమానవ హక్కుల ప్రకటన మానవహక్కుల సంరక్షణలో నిస్సందేహంగా ఒక మైలురాయి. మానవహక్కుల పట్ల భారత్ వైఖరి భిన్నమైనది. మనదైన ‘అభివృద్ధి చెందిన’ సమాజ భావన ఆ వైఖరిని నిర్దేశిస్తోంది. ఈ దృష్ట్యా మనకు, విశ్వ మానవహక్కుల ప్రకటన అనేక విషయాలలో ఒక తిరోగమన ప్రకటన వంటిదే. అంతర్జాతీయ మానవహక్కుల సంస్థల విమర్శలను మనం చిత్తశుద్ధితో పరిగణనలోకి తీసుకోవాలి. విశ్వ మానవహక్కుల ప్రకటనలో పొందుపరిచిన మానవహక్కుల పునరుద్ధరణకు పటిష్ఠచర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ప్రత్యామ్నాయ విశ్వ మానవ హక్కుల ప్రకటనను రూపొందించి ఐక్యరాజ్యసమితికి నివేదించాలి. 


‘మానవులు అందరూ హుందా, హక్కుల’లో సమానులే అని విశ్వమానవ హక్కుల ప్రకటన నిబంధన 1 నిర్దేశించింది. ప్రతి ఒక్కరికీ ‘జీవిత, స్వేచ్ఛ, భద్రత’ హక్కు ఉందని నిబంధన 3 వక్కాణించింది. చలనస్వేచ్ఛ, అంటే వలసపోయే హక్కు గురించి నిబంధన 13 వివరించింది. నిబంధన 26 (1) విద్యాహక్కు గురించి పేర్కొంది. సమస్యేమిటంటే ఈ సమానత్వాలలో ఏ రెండూ కూడా పరస్పరం పొసగని హక్కులు. అవి కలసికట్టుగా సమకూరడమనేది సుసాధ్యంగా కన్పించడం లేదు. 


ఒకే తరగతిలో విద్యాభ్యాసం చేస్తున్న ఒక తెలివైన విద్యార్థి, ఒక మందబుద్ధి అభ్యాసకుడికి మధ్య హుందాలో సమత్వం సమకూరాలంటే ఇద్దరి మధ్య హక్కుల విషయంలో అసమానతలను అంగీకరించి తీరాలి. ప్రతిభావంతుడైన విద్యార్థి హక్కును పరిమితం చేయాలి. అభ్యాసంలో వెనుకబడ్డ విద్యార్థి విషయంలో ఉపాధ్యాయులు మరింత సమయాన్ని వెచ్చించినప్పుడు మాత్రమే ఆ ఇరువురు సహాధ్యాయుల మధ్య సంబంధంలో సమ హుందా విలసిల్లుతుంది. మరి ఏ రెండు హక్కులు పరస్పరం కలిసి ఉండవు కదా. సమానత్వాన్ని సమకూర్చడానికి ఏ ‘హక్కు’ కీలకమో ముందస్తుగా నిర్దారించుకోవల్సిన అవసరం ఉంది. ఇతర ప్రమాణాలు అన్నిటిలో అసమానతలను అంగీకరించి తీరాలి. చెప్పవచ్చిన దేమిటంటే విశ్వ మానవహక్కుల ప్రకటన ఒక తీరూతెన్నూ లేని పరస్పర విరుద్ధ సమానతల ఒడంబడిక. 


అవకాశాలను స్వయంగా సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే ఇరువురు వ్యక్తుల మధ్య సమానత్వం సాధ్యమవగలదని మన సంప్రదాయం ఉద్ఘోషిస్తోంది. మానవులు తమ సంస్కారాలు (అంతర్గత ప్రేరణలు), సామర్థ్యాల విషయంలో భిన్నమైన వ్యక్తులు. ప్రతి ఒక్కరికి, ఆ వ్యక్తి సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే విధంగా అవకాశాలను సమకూర్చాలి. ధనార్జనే లక్ష్యంగా గల వ్యక్తికి వ్యాపార స్వేచ్ఛ నిచ్చితీరాలి. అయితే రాజ్య పాలన ప్రవృత్తి గల వ్యక్తికి ఆ స్వేచ్ఛను రిక్తపరిచి తీరాలి. ‘చట్టం ముందు అందరూ సమానులే’ అని విశ్వ మానవహక్కుల ప్రకటన నిబంధన 7 ఉద్ఘాటించింది. అంటే బలవంతులు, బలహీనులకు ఒకే విధమైన శాసన విహిత హక్కులు ఉంటాయి. ఆ హక్కులను వినియోగించుకోగల సామర్థ్య్ఝం బలహీనులకు సహజంగా ఉండదు. ఈ వాస్తవం దృష్ట్యా ఇటువంటి వ్యక్తుల విషయంలో సానుకూల దృక్పథాన్ని అనుసరించాలని మన సంప్రదాయం నొక్కి చెప్పింది. ఈ సత్యాన్ని గౌరవించేందుకు విశ్వ మానవహక్కుల ప్రకటనను సవరించి తీరాలి. ‘ప్రతి వ్యక్తి తన అంతర్గత ప్రేరణలతో స్వతస్సిద్ధ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకునేందుకు సమాన అవకాశాలకు అర్హుడు. ఇతర ప్రమాణాలు అన్నిటిలో అసమానత్వాన్ని అంగీకరించాలి’ అని ఆ ప్రకటన స్పష్టం చేయాలి. 


యుధిష్ఠిరుడి (ధర్మరాజు)ని యువరాజుగా ఎంపిక చేశారు. శూద్రులకు స్వల్ప శిక్ష, వైశ్య, క్షత్రియులకు తీవ్ర శిక్ష విధించడం వల్లే యుధిష్ఠురుడు యువరాజు పట్టానికి అర్హుడయ్యాడని వ్యాసుడు పేర్కొన్నాడు. ఒక వ్యక్తి సామాజిక బాధ్యతలకు అనుగుణంగా శిక్ష విధించాలనే ధర్మసూత్రాన్ని అనుసరించి యుధిష్టురుడు శిక్ష విధించాడు. ఈ సానుకూల అసమానత్వ సూత్రాన్ని విశ్వ మానవహక్కుల ప్రకటనలో పొందుపరచాలి. 


అసమానతల ప్రాతిపదికన నిర్మాణమైన ప్రస్తుత భద్రతామండలి సంవిధానాన్ని విశ్వ మానవ హక్కుల ప్రకటన సమర్థిస్తోంది. ఐక్యరాజ్యసమితి ఆదర్శాలకు వ్యతిరేకంగా ఏమీ చెప్పకూడదని, ఆచరించకూడదని నిబంధన 29 (3) పేర్కొంది. మానవాళి పౌర, రాజకీయ హక్కుల గురించి నిబంధనలు 4, 5, 14 (1), 15, 16, 19 ప్రస్తావించాయి. వీటి అనువర్తనీయత సార్వత్రికమైనది. అయితే ఆర్థికహక్కులు మాత్రం దేశాల సరిహద్దులకే పరిమితమవుతున్నాయి. ‘ఒక దేశ పౌరులకు ఆ దేశ సరిహద్దుల లోపల మాత్రమే చలనస్వేచ్ఛ ఉంటుందని’ నిబంధన 13 స్పష్టం చేసింది. ప్రపంచంలోని మానవులు అందరికీ సమాన హక్కులు ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు మరో దేశానికి వలస వెళ్ళడంపై ఆంక్షలు ఎందుకు? ప్రభుత్వ సేవలు సమానంగా అందుబాటులో ఉండే హక్కు సంబంధిత వ్యక్తుల ‘సొంత దేశం’లో మాత్రమే వర్తిస్తుందని నిబంధన 21 (2) స్పష్టం చేసింది. ఎందుకీ పరిమితి? పౌరహక్కులు సార్వత్రికమైనవి అయితే ప్రభుత్వ సేవలు ఎందుకు సార్వత్రికం లేదా విశ్వవ్యాప్తం కావు? ‘ప్రతి దేశంలో వనరులకు అనుగుణంగా సామాజిక భద్రత పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని’ నిబంధన 22 ఖరాఖండిగా చెప్పింది. ఈ హక్కును ఎందుకు ఇలా పరిమితం చేశారు? మరి ప్రతి దేశం పౌరులకు ఆ దేశ వనరులకు అనుగుణంగా రాజకీయ హక్కులు ఎందుకు సమకూర్చదు?


సంపన్న పారిశ్రామికదేశాలు రాజకీయహక్కుల నెపంతో అభివృద్ధి చెందుతున్న దేశాల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి ప్రస్తావిత నిబంధనలే ఆస్కారం కల్పిస్తున్నాయని నిష్ఠూరంగా చెప్పక తప్పదు. అయితే వర్థమాన దేశాలు తమ ఆర్థికహక్కులను కాపాడుకునేందుకు సంపన్నదేశాల విధానాలలో జోక్యం చేసుకోవడాన్ని ఆ నిబంధనలే అడ్డుపడుతున్నాయన్నది మరింత నిష్ఠుర సత్యం. ఆర్థికహక్కులను విశ్వవ్యాప్తం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సరే, మానవహక్కుల సంరక్షణలో ఇటీవల మన దేశం పాల్పడిన అవకతవకలపై అంతర్జాతీయ విమర్శలు, ఆరోపణలను మనం తప్పక పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. అయితే అదే సమయంలో మనం మరింత సమగ్రమైన, న్యాయబద్ధమైన మానవహక్కుల ఒడంబడికను రూపొందించి ఐక్యరాజ్యసమితి ఆమోదానికి నివేదించాలి.

మానవహక్కుల్లో మన ఒరవడి వేరు

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.