విడి విడి ఎన్నికలు, జమిలి వ్యూహం!

ABN , First Publish Date - 2022-02-17T06:34:10+05:30 IST

ప్రశాంత్ కిశోర్ అప్పుడే రంగంలోకి దిగారా? ఈ నెల మొదటి నుంచి కెసిఆర్‌లో కనిపిస్తున్న ధోరణి వెనుక ఆ వ్యూహకర్త ప్రమేయం ఉన్నదా? ఉంటే, మాత్రం అది విశేషమే....

విడి విడి ఎన్నికలు, జమిలి వ్యూహం!

ప్రశాంత్ కిశోర్ అప్పుడే రంగంలోకి దిగారా? ఈ నెల మొదటి నుంచి కెసిఆర్‌లో కనిపిస్తున్న ధోరణి వెనుక ఆ వ్యూహకర్త ప్రమేయం ఉన్నదా? ఉంటే, మాత్రం అది విశేషమే. ఓటర్ల నాడిని పట్టుకోవడంలో, రాజకీయ చక్రం తిప్పడంలో, పరిపాలనలో ఇతరుల సలహాలు అవసరం లేని ఆత్మనిర్భరత తెలంగాణ ముఖ్యమంత్రిది. ఆయన ఒక వృత్తి వ్యూహకర్తను నియమించుకుని, అందుకు అనుగుణంగా వ్యవహరించడం ఆశ్చర్యమే. స్వభావానికి సంబంధించిన ఈ సడలింపు ఒకటయితే, వచ్చే ఏడాది జరగవలసిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించిన అంచనాలలో తగినంత ఆశావహ పరిస్థితి కనిపించడం లేదన్న గ్రహింపు మరొకటి. అటువంటిదేదో లేకపోతే, ఎందుకు ఈ అవుట్ సోర్సింగ్?


తరచు పత్రికా ప్రతినిధుల సమావేశాల్లో పాల్గొనడం, మాట్లాడేటప్పుడు ఉత్సాహం, ఆవేశం, చమత్కారం, వెటకారం అన్నీ జనరంజకంగా మేళవించడం, భారతీయ జనతాపార్టీ మీద విమర్శ ఆగ్రహమై, పలుకు శస్త్రతుల్యమై శ్రుతి పెరిగిపోవడం, రాష్ట్ర కాంగ్రెస్‌ను ఖాతరు చేయకున్నా, జాతీయ కాంగ్రెస్ నేతలపై సానుభూతి ప్రకటించడం.. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవని అనిపించడం లేదు. పాపం, ఏం మాట్లాడినా ఆంతర్యం వేరే ఏదో ఉంటుందని కెసిఆర్‌ను అందరూ అనుమానిస్తారు. ఇవాళ్టి ఆవేశం రేపటికి మాయమవుతుందని అనుకుంటారు. కానీ, ఈసారి ఆయన భిన్నంగా కనిపిస్తున్నారు. నిలకడగా ఒకే పని మీద దృష్టి పెట్టి ఉన్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వ పెద్దలను, అధికారపార్టీని నిందించడంలో రోజురోజుకు డోసు పెంచుతున్నారు. ఈ తీవ్రత ఫలిస్తోంది కూడా. బెంగాల్ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి ఆయనకు ఫోన్లు వస్తున్నాయి. కేంద్రంపై యుద్ధానికి తగిన తోడు దొరికాడనో, తగిన నేత దొరికాడనో.. ఇంకా తెలియదు. ఉద్ధవ్ ఠాక్రే వంటి వారు కెసిఆర్‌ను అంతగా విశ్వసిస్తారా అన్నది అనుమానమే. బహుశా, ఈ సన్నివేశానికి నేపథ్య వ్యూహరచన ప్రశాంత్ కిశోర్‌ది కావచ్చునన్న చర్చ రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. ప్రతిపక్షాలను ఒకచోట చేర్చడానికి, ఒక సమర్థమైన కూటమిని నిర్మించడానికి ప్రశాంత్ కిశోర్ ఆసక్తిగా ఉన్నారు. తనతో కలసి ఆయన పనిచేయనున్నారని నాలుగు రోజుల కిందట కెసిఆర్ సూచించారు కానీ, పోయినేడాది జూన్ నుంచి ప్రశాంత్ కిశోర్‌తో సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. హుజూరాబాద్ ఫలితాల తరువాత, డిసెంబర్ మొదట్లో ఆ వృత్తి వ్యూహకర్తతో కలసి కెసిఆర్ అత్యవసర సమీక్ష కూడా చేశారు.


2012లో గుజరాత్‌లో నరేంద్రమోదీకి పనిచేసినప్పటి నుంచి, ప్రశాంత్ కిశోర్ ఖాతాదారులను గమనిస్తే, విజయావకాశాలు బొటాబొటిగా ఉండి, ఒక ఆలంబన అవసరమైన వారే ఆయనను ఆశ్రయించారు. 2009 నాటి ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ పరిస్థితి చూసినవారెవరూ 2014లో అంతటి ఘనవిజయం సాధ్యమని నమ్మలేరు. పార్టీలోనూ, బయటా కూడా అది ఖరారైన విజయం కాదు. తరువాత, పంజాబ్‌లో కాంగ్రెస్‌కు, బిహార్‌లో జెడియుకు, బెంగాల్‌లో తృణమూల్‌కు, తమిళనాడులో డిఎంకెకు, ఆంధ్రప్రదేశ్‌లో వైసిపికి విజయవంతమైన సేవలందించారు. ఆయా ఖాతాదారు పార్టీలన్నీ విజయాన్ని ఆశించాయి, అనుకూలతలను చూస్తున్నాయి, అయినప్పటికీ ఒక సహాయం ఉంటే ప్రమాదాన్ని తగ్గించుకోవడమో, విజయాన్ని ఖరారు చేసుకోవడమో చేయవచ్చుననుకుని భారీ ప్రతిఫలాలు చెల్లించి వృత్తి వ్యూహకారుణ్ణి నియమించుకున్నాయి. 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున పనిచేసినప్పుడు మాత్రమే ప్రశాంత్ కిశోర్ విఫలమయ్యారు. విజయపు సరిహద్దులో ఉన్నవారికి చేయి అందించి గట్టెక్కించగలడు కానీ, ఆమడదూరంలో ఉన్నవారికి ఆయన చేయగలిగే సాయం ఏమీ ఉండదు.


రాష్ట్ర ఎన్నికల కోసం కాదు, జాతీయస్థాయిలో బిజెపికి బుద్ధి చెప్పడానికే ప్రశాంత్ కిశోర్ అని మున్ముందు కెసిఆర్ వివరణ ఇవ్వవచ్చు. స్టాలిన్, మమతా బెనర్జీ ఇటీవలనే ప్రజాభిమతాన్ని పొందారు కాబట్టి, వారిప్పుడు తీరికగా జాతీయ రాజకీయాల మీద గురిపెట్టగలరు. కెసిఆర్‌కు ప్రస్తుతానికి ఆ సదుపాయం లేదు. అసెంబ్లీ, సాధారణ ఎన్నికలు రెంటికీ కలిపి జమిలిగా ఆయన వ్యూహరచన చేసుకోవాలి. బిజెపి మీద తీవ్రతను పెంచడం, కాంగ్రెస్ విషయంలో మెత్తపడడం రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కావచ్చును. బిజెపి వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వాల నేతల మధ్య సమన్వయం సమస్య ఉన్న మాట నిజమే కానీ, ఎట్లాగూ వ్యతిరేకులైన వారితో ఫోన్‌లో మాట్లాడినా భేటీలు నడిపినా బిజెపి పెద్దగా పట్టించుకోదు. కేంద్రంతో సామరస్యంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌నో, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌నో బరిలోకి దించే ప్రయత్నం కెసిఆర్ చేస్తే, అప్పుడు ఆయన నిజంగా బిజెపి ఫైరింగ్ రేంజ్‌లోకి వెళ్లినట్టు! అప్పటిదాకా లాలూచీకుస్తీ అనుమానం మిగిలే ఉంటుంది. ఇంతకీ, ప్రశాంత్ కిశోర్ కెసిఆర్‌కు ఖాతాదారు సేవలు అందిస్తున్నారా లేక, తన జాతీయ వ్యూహంలో కెసిఆర్‌ను పాత్రధారిని చేసుకున్నారా అన్నది కూడా సమాధానం వెదకవలసిన ప్రశ్న.


బహుశా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టిఆర్ఎస్‌కు సానుకూల పవనాలు మహా అయితే సుడిగాలులుగా మారవచ్చును కానీ, ప్రభంజనాలు కాబోవని ఆ పార్టీ నేతకు అనిపించి ఉండవచ్చు. రెండు దఫాలు వరుసగా అధికారంలో ఉండడం వల్ల సహజంగా ఏర్పడే వ్యతిరేకత, ప్రభుత్వాధినేత తీరు, పాలనలోని ప్రతికూల అంశాలు కలిగించే విముఖత కలసి, సంక్షేమ, అభివృద్ధి అంశాల మార్కులను మించిపోయే అవకాశమున్నది. ఉప ఎన్నికలలో వరుస అపజయాలు, ప్రతిపక్షాలలో పెరిగిన క్రియాశీలత.. విస్మరించగలిగే అంశాలు కావు. అందుకని, ఈసారి కూడా నాలుగున్నరేండ్లకే ఎన్నికలు తెచ్చుకుని, ప్రత్యర్థుల ఓట్లను తీవ్రంగా చీల్చి, ఒక ఉద్యమ వాతావరణం కల్పించి, సాధారణ ఎన్నికల కంటె చాలా ముందే అసెంబ్లీని గట్టెక్కించితే జాతీయ స్థాయిలో నాయకత్వం వీలవుతుందన్నది ఒక ఆలోచన కావచ్చును.


రాజకీయ లక్ష్యశుద్ధితో నిలకడగా ఒక వైఖరి మీద ఉండడంతో పాటు, నాయకులు చాపల్యాన్ని, పంతాన్ని కూడా వదులుకోవలసి ఉంటుంది. రాజ్యాంగం విషయంలో కెసిఆర్ అభిభాషణ మాత్రం ఆయన స్వయంకృతమే అయి ఉండాలి. ఏ రాజకీయ సలహాదారుడూ అటువంటి ప్రవచనాలను ప్రోత్సహించడు. మొదటిసారి ఏదో మాటజారినా, తరువాత దాన్ని సవరించుకునే అవకాశం ఉంటుంది. అననే అనలేదని బుకాయించే సదుపాయమూ ఉంటుంది. పొరపాటును గ్రహించకపోగా, పునరుద్ఘాటించడం అంటే, మూడు కాళ్ల కుందేలును ప్రదర్శించడమే. పైగా, కెసిఆర్ వ్యాఖ్యలకు వివరణలూ సమర్థనలూ ఇచ్చే అమాత్యులు మరీ విడ్డూరం. వేరే సందర్భాలలో అయితే, ‘‘నా మాటలకు వివరణ ఇచ్చే మగోనివి అయినవా’’ అని మంత్రులను గదమాయించే ముఖ్యమంత్రి, ఇప్పుడు తానూ బుకాయింపు సమర్థనలు చేసుకుంటున్నారు, ఇతరులనూ ప్రోత్సహిస్తున్నారు.


రాజ్యాంగం మీద కెసిఆర్ వ్యాఖ్యలు, కేంద్రం మీద చేస్తున్న విమర్శలు ఒకదానికొకటి పొసిగేవి కావు. అందుకే, కేంద్రం మీద, బిజెపి మీద దాడిలో చిత్తశుద్ధిపై ఇంకా శంకలు కలుగుతున్నాయి. ఏమేమి పనులు చేయడానికి కొత్త రాజ్యాంగాన్ని కోరుకుంటున్నానని కెసిఆర్ చెప్పారో, ఆ పనులు చేయడానికి కొత్త రాజ్యాంగం అవసరమే లేదు. చాలా వాటికి కనీసం సవరణలు కూడా అవసరం లేదు. దేశగమనానికి కీలకమయిన విధివిధానాలను, వాటి పరిధులను, హక్కులను, అధికారాలను నిర్వచించిన రాజ్యాంగానికి, ప్రభుత్వాలు రకరకాల వ్యాఖ్యానాలు చెప్పుకుని, స్ఫూర్తికి భిన్నమయిన పాలన అందిస్తున్నాయి. ఆ వైఫల్యం అన్వయానిదే తప్ప, ఆదర్శానిది కాదు. పరిపాలన భ్రష్టుపడితే, ప్రభుత్వాలను మార్చాలి, రాజ్యాంగాన్ని కాదు. రాజ్యాంగం ఏమిటో, అది ఇచ్చే మార్గదర్శనం ఏమిటో, దానికీ చట్టాలకు స్మృతులకు, నియమావళులకు, ఉత్తర్వులకు ఉన్న తేడా ఏమిటో, రాజకీయాలలో నాలుగు దశాబ్దాలుగా ఉన్న నాయకులకు తెలియాలి. అన్ని వేల పుస్తకాలు చదివారు, రాజ్యాంగం చదవలేదా అని విమర్శకుల చేత హేళనలు పొందడం ఏమి బాగుంటుంది? కొత్త రాజ్యాంగం కోరుకోవడం తప్పా అని కొందరు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. పాపమేమీ కాదు, రాజ్యాంగాన్ని మార్చుకోవడానికి, కొత్తది కోరుకోవడానికీ కూడా ప్రస్తుత రాజ్యాంగమే హక్కు ఇస్తోంది. కానీ, ఎవరు ఆ ప్రతిపాదనలు తెస్తున్నారు అన్నది కీలకమయిన ప్రశ్న. ఈ రాజ్యాంగం చెప్పుకున్న ఆదర్శాలను పరిపూర్తి చేయడానికి మరింత ఉపకరించే మార్పులు ఏమైనా చేయవచ్చును, అంటే అంబేడ్కర్ స్ఫూర్తికి కొనసాగింపు ఇవ్వవచ్చును. అందుకు భిన్నమైన సంస్కరణలు, మౌలిక మార్పులు అవాంఛనీయమైనవి. రాజ్యాంగం వాగ్దానం చేస్తున్న సానుకూల వివక్ష మీద, న్యాయ భావన మీద కొండంత ఆశ పెట్టుకున్న ప్రజానీకం అటువంటి ప్రయత్నాలను సమర్థించరు. రాజ్యాంగపు ఆత్మకు అనుగుణంగా పరిపాలించడానికి ప్రయత్నించే నాయకుల నోట కాకుండా, హక్కులను ప్రజాభాగస్వామ్యాన్ని ఖాతరు చేయని పాలకుల నోట రాజ్యాంగ సంస్కరణల మాట వినిపిస్తే, భయం వేస్తుంది. కొత్త రాజ్యాంగం ప్రస్తావన వస్తే, మనుస్మృతినే దేశ రాజ్యాంగం చేయాలని బాహాటంగా మాట్లాడేవారి ప్రయత్నాలు స్ఫురించి భవితవ్యం మీద ఆందోళన కలుగుతుంది. బిజెపి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయాన్ని, విపరీత కేంద్రీకరణను వ్యతిరేకించడానికి కెసిఆర్ ఇవ్వవలసిన నినాదం రాజ్యాంగ పరిరక్షణ. కొత్త రాజ్యాంగం వివాదంతో కెసిఆర్ చేసిన మేలు ఒక్కటే– రాజ్యాంగం మౌలిక స్వభావం మార్చడానికి తన వ్యతిరేకతను బిజెపి తెలంగాణ వరకైనా నమోదు చేసింది. 2024 తరువాత ఈ వైఖరిని వాళ్లకు గుర్తు చేయవలసి రావచ్చు.


జాతీయ రాజకీయాలపైన ఆసక్తి చూపిస్తున్న దశలో, పెద్ద పెద్ద విషయాల గురించి కెసిఆర్ జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతర రాష్ట్రాల నేతలతో కలసి ఉమ్మడి ఆచరణలోకి వెళ్లేటప్పుడు ప్రజలు గర్వించేటట్టు హుందాగా వ్యవహరించాలి.


కె. శ్రీనివాస్

Updated Date - 2022-02-17T06:34:10+05:30 IST