Abn logo
Sep 4 2020 @ 01:09AM

మార్చి నాటికి సెన్సెక్స్‌ @ 41,500

 • బీఎన్‌పీ పారిబా అంచనా

ముంబై: మార్కెట్లో సులభ ద్రవ్య లభ్యత కారణంగా ఈక్విటీ మార్కెట్లు మున్ముందూ ఎగువముఖంగానే పయనించనున్నాయని ఫ్రెంచ్‌ బ్రోకరేజీ సంస్థ బీఎన్‌పీ పారిబా పేర్కొంది. 2021 మార్చి నాటికి బీఎ్‌సఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ మరో 6 శాతం ఎగబాకి 41,500 స్థాయికి చేరుకోనుందని అంచనా వేసింది. గురువారం బీఎ్‌సఈలో ట్రేడింగ్‌ ముగిసేసరికి సూచీ 38,990 వద్దకు చేరుకుంది. కరోనా సంక్షోభంతో ఆర్థిక వృద్ధి రేటు మైనస్‌ స్థాయికి క్షీణించినప్పటికీ మార్కెట్లు ర్యాలీ తీస్తుండటంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధిక ద్రవ్య లభ్యతతో మార్కెట్లో మరికొంత ర్యాలీ కొనసాగనుందని బీఎన్‌పీ పారిబా భారత ఈక్విటీ రీసెర్చ్‌ విభాగ అధిపతి అమిత్‌ షా అన్నారు.

అయితే, ఆర్థిక వ్యవస్థ మూలాలు కదులుతున్నాయని షా హెచ్చరించారు. మార్చిలో మార్కెట్లు భారీగా పతనమైన సమయంలో రిటైల్‌ మదుపర్లు షేర్లను కొనుగోళ్లు జరపడాన్ని షా ప్రశంసించారు. సాధారణం గా మార్కెట్లు బాగా పెరిగి షేర్ల ధరలు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టే రిటైల్‌ మదుపర్లు.. సరైన సమయంలో మార్కెట్లోకి ప్రవేశించడం అసాధారణ సందర్భమన్నారు. బీఎన్‌పీ పారిబా ఆర్థిక విశ్లేషకులు పేర్కొన్న మరిన్ని ముఖ్యాంశాలు.. 


 1. అమెరికా, చైనా తరహాలో భవిష్యత్‌ తరం వ్యాపారాలను సృష్టించలేకపోయినప్పటికీ, వంద కోట్లకు పైగా వినియోగదారులే భారత్‌కున్న సత్తా
 2. ఆర్థిక సేవల రంగం విషయానికొస్తే, 2023 నాటికి ఫిన్‌టెక్‌లోకి 1,500 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు రావచ్చు. కరోనా సంక్షోభంతో దేశీయ వినియోగదారుల అలవాట్లలో వచ్చిన మార్పులు ఇందుకు దోహదపడనున్నాయి
 3. మొబైల్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ సేవల్లో పెట్టుబడులు పెట్టని బ్యాంకులు తమ డిపాజిట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. డిజిటల్‌ సేవల్లో చురుకైన బ్యాంకులు వీటి ని చేజిక్కించుకోవచ్చు
 4. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో చాలామంది ఇప్పటికీ ఇంటినుంచే పనిచేస్తుండటంతో ఐటీ కంపెనీల వ్యయాల్లో 2.5 శాతానికిపైగా ఆదా కానుంది. కరోనా సంక్షోభం ముగిసి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత కూడా 40 శాతానికి పైగా ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించే అవకాశం ఉంది  
 5. తీరిక సమయాల్లో సరదా రైడింగ్‌ కోరుకునే వారు పెరుగుతుండటంతో ద్విచక్ర వాహన రంగంలో ప్రీమియం బైక్‌లకు డిమాండ్‌ పెరగవచ్చు  
 6. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మరింత కరెక్షన్‌కు అవకాశం లేదు. సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో పెద్ద గృహాలకు డిమాండ్‌ పెరగనుంది. మనోళ్లకు ఈక్విటీలపై మోజు తక్కువే.. 

భారత కుటుంబాల్లో 14 శాతం మాత్రమే ఈక్విటీల్లో పెట్టుబడులు కలిగి ఉన్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే ఇది అత్యంత కనిష్ఠ స్థాయి అని రిపోర్టు వెల్లడించింది. అత్యధికంగా అమెరికాలో 45.5 శాతం కుటుంబాలు ఈక్విటీల్లో పెట్టుబడులు కలిగి ఉన్నాయి. స్పెయిన్‌ (42శాతం), కెనడా (37.9శాతం), చైనా (28.8శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నా యి. గత ఏడాది చివరినాటికి అమెరికన్‌ కుటుంబాల మొత్తం  ఆస్తులు 94 లక్షల కోట్ల డాలర్లని, ఆ దేశ జీడీపీకి 440 శాతంతో సమానమని నివేదిక వెల్లడించింది. అమెరికన్‌ కుటుంబాలు మొత్తం ఆస్తుల్లో 46 శాతం పెట్టుబడులను (43 లక్షల కోట్ల డాలర్లు) ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసినట్లు రిపోర్టు వెల్లడించింది. 


వినియోగ సామర్థ్యమే భారత వృద్ధికి చోదకమన్న బీఎన్‌పీ పారిబా.. తద్వారా లాభపడనున్న 8 కంపెనీల షేర్లను ఎంపిక చేసింది. అన్ని రంగాల్లోనూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పెరగడం ఈ ఎంపిక చేసిన స్టాక్స్‌లో చాలా వాటికి దోహదపడనుందని అంటోంది. ఇప్పటికే ఈ కంపెనీల షేర్లు గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్నప్పటికీ,మున్ముందు మరో 16 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. 


ఎంపిక చేసిన కంపెనీలు 

 1.   భారతీ ఎయిర్‌టెల్‌ 
 2.   హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ 
 3.   హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 
 4.   ఏషియన్‌ పెయింట్స్‌ 
 5.   రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 
 6.   అవెన్యూ సూపర్‌ మార్కెట్స్‌ 
 7.   టీసీఎస్‌ 
 8.   హిందుస్థాన్‌ యూనిలీవర్‌ 

Advertisement
Advertisement
Advertisement