Abn logo
May 19 2021 @ 00:18AM

మళ్లీ 50000 పైకి..

15,000 ఎగువ స్థాయికి నిఫ్టీ 2 నెలల గరిష్ఠానికి సూచీలు  

రెండ్రోజుల్లో రూ.5.78 లక్షల కోట్లు  పెరిగిన మదుపరుల  సంపద 

సెన్సెక్స్‌ 613 పాయింట్లు అప్‌ 


ముంబై: దేశంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో పాటు ఆర్థిక వృద్ధి పునరుద్ధరణ ఆశలు దలాల్‌ స్ట్రీట్‌లో ఉత్సాహం నింపాయి. వరుసగా రెండో రోజూ ట్రేడర్లు కొనుగోళ్ల జోరు కొనసాగించారు. దీంతో మంగళవారం సెన్సెక్స్‌ 50,000, నిఫ్టీ 15,000 పైకి చేరాయి. సూచీలకిది రెండు నెలలకు పైగా (మార్చి 10 తర్వాత) గరిష్ఠ స్థాయి. మంగళవారం సెన్సెక్స్‌ 612.60 పాయింట్ల లాభంతో 50,193.33 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 184.95 పాయింట్ల పెరుగుదలతో 15,108.10 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 25 లాభాల్లో ముగిశాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) షేరు 5.91 శాతం పెరుగుదలతో సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బజాజ్‌ ఆటో సైతం 5 శాతానికి పైగా పుంజుకోగా.. టైటాన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 4 శాతానికి పైగా బలపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌ షేరు మాత్రం అత్యధికంగా 2.41 శాతం క్షీణించింది. బ్లూచిప్‌ షేర్లతోపాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీలకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 1.87 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.28 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే, బీఎ్‌సఈ ఆటో సూచీ 3.19 శాతం లాభపడింది. కన్స్యూమర్‌ గూడ్స్‌, కన్స్యూ మర్‌ డ్యూరబుల్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఇండస్ట్రియల్స్‌, విద్యుత్‌ రంగ సూచీలు 2 శాతం పైగా పుంజుకున్నాయి. 


మరో రూ.2.75 లక్షల కోట్ల సంపద: కొనుగోళ్ల జోరుతో స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపద మంగళవారం రూ.2.75 లక్షల కోట్లు పెరిగింది. గడిచిన రెండు సెషన్లలో మొత్తం రూ.5.78 లక్షల కోట్లు పెరిగి రూ.216.39 లక్షల కోట్లకు చేరుకుంది. 


డిసెంబరు నాటికి సెన్సెక్స్‌ 61,000!

ఈ ఏడాది భారత ఈక్విటీ మార్కెట్‌ ఇతర వర్ధమాన దేశాల కంటే మెరుగైన పనితీరు కనబర్చనుందని మోర్గాన్‌ స్టాన్లీ తాజా నివేదిక పేర్కొంది. డిసెంబరు చివరి నాటికి సెన్సెక్స్‌ మరో 10 శాతం పెరిగి 55,000 స్థాయికి చేరుకునేందుకు 50 శాతం అవకాశాలున్నాయని అంటోంది. బుల్‌ జోరు కనబరిస్తే, ఏడాది చివరి నాటికి సూచీ 22 శాతం వృద్ధితో 61,000కు చేరొచ్చని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. ఇందుకు 30 శాతం అవకాశాలున్నాయంటోంది. బేర్‌ మళ్లీ పట్టుబిగిస్తే మాత్రం, సూచీ 41,000 స్థాయికి జారుకోవచ్చని కూడా ఈ బ్రోకింగ్‌ ఏజెన్సీ హెచ్చరించింది. ఇందుకు 20 శాతం అవకాశాలున్నాయని నివేదికలో పేర్కొంది. 


7 వారాల గరిష్ఠానికి రూపాయి 

దేశీయ కరెన్సీ విలువ 7 వారాల గరిష్ఠ స్థాయికి బలపడింది. అమెరికన్‌ డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో 17 పైసలు లాభపడింది. దాంతో డాలర్‌-రుపీ ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.73.05 వద్ద స్థిరపడింది. వరుసగా మూడు రోజులుగా రూపాయి విలువ పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయంగా డాలర్‌ బలహీనపడటంతో పాటు ఈక్విటీ మార్కెట్లలో సానుకూలత మన కరెన్సీకి కలిసి వచ్చాయి.