ఎగిసి ‘పడిన’ సెన్సెక్స్‌

ABN , First Publish Date - 2020-03-28T06:09:00+05:30 IST

మూడు రోజుల సెన్సెక్స్‌ వరుస లాభాలకు వారాంతంలో బ్రేక్‌ పడింది. ఒక దశలో రేసు గుర్రంలా 31,126.03 పాయింట్ల వరకు పరిగెత్తిన సెన్సెక్స్‌ చివరికి ఆర్థిక మాంద్యం భయాలతో...

ఎగిసి ‘పడిన’ సెన్సెక్స్‌

మూడు రోజుల సెన్సెక్స్‌ వరుస లాభాలకు వారాంతంలో  బ్రేక్‌ పడింది. ఒక దశలో రేసు గుర్రంలా 31,126.03 పాయింట్ల వరకు పరిగెత్తిన సెన్సెక్స్‌ చివరికి ఆర్థిక మాంద్యం భయాలతో 131.18 పాయింట్ల నష్టంతో 29,815.59 వద్ద క్లోజైంది. ఇంట్రా డేలో ఒక దశలో 29,346.99 పాయింట్ల కనిష్ఠ స్థాయినీ తాకింది. గరిష్ఠ స్థాయితో పోలిస్తే శుక్రవారం సెన్సెక్స్‌ దాదాదాపు 1,300 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ మాత్రం 18.80 పాయింట్ల స్వల్ప లాభంతో 8,660.25 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 17 కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. ఆర్‌బీఐ ప్రకటించిన రెపో రేటు ముప్పావు శాతం తగ్గించినా బ్యాంకింగ్‌, రియల్టీ, ఆటో కంపెనీల షేర్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. ఆర్థిక మాంద్యం భయాలు మార్కెట్‌ను వెంటాడాయి. రుణ వసూళ్లపై ఆర్‌బీఐ మూడు నెలల మారిటోరియం ప్రకటించడం మార్కెట్‌ను నిరాశ పరిచింది. కనీసం ఆరు నెలలైనా విరామం ప్రకటిస్తారని మార్కెట్‌ వర్గాలు ఆశించాయి. కోవిడ్‌-19 ప్రభావంతో వచ్చే ఆర్థిక సంవత్సరమూ (2020-21) జీడీపీ వృద్ధి రేటు 2.5 శాతం దాటదన్న ఇక్రా అంచనాలూ మార్కెట్‌  సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. కోవిడ్‌-19 వ్యాప్తి, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావమే ముందు ముందు మార్కెట్‌ గమనాన్ని నిర్ణయిస్తాయని మార్కెట్‌ వర్గాల అంచనా.

Updated Date - 2020-03-28T06:09:00+05:30 IST