డమాల్..!

ABN , First Publish Date - 2022-01-25T08:15:20+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై బేర్‌ మరింత పట్టుబిగించింది. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. ..

డమాల్..!

మార్కెట్లపై బేర్‌ పట్టు ..  కుప్పకూలిన సెన్సెక్స్‌

  1,545.67 పాయింట్ల క్షీణత  జూ ఇంట్రాడేలో ఏకంగా 2050 పాయింట్లు డౌన్‌

 468 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ జూ 2 నెలల్లో సూచీలకు ఇదే అతిపెద్ద పతనం

 5 రోజుల్లో రూ.19.50 లక్షల కోట్ల మార్కెట్‌ సంపద ఆవిరి 


ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లపై బేర్‌ మరింత పట్టుబిగించింది. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. మార్కెట్ల పతనంతో కరిగిపోతున్న సంపదను చూసి ఇన్వెస్టర్లు విలవిల్లాడుతున్నారు. సోమవారం స్టాక్‌ మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ సూచీ ఏకంగా 1,545.67 పాయింట్ల భారీ నష్టంతో 57,491.51 పాయింట్లకు చేరింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 468.05 పాయింట్లు కోల్పోయి 17,149.10 పాయింట్ల వద్ద స్థిరపడింది. దాదాపు రెండు నెలల్లో (నవంబరు 26) సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు ఒక్కరోజులో ఇంత భారీ నష్టాన్ని చవిచూడలేదు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచనుందన్న వార్తలతో పాటు ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీనత, దేశీయ పరిణామాలు స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. సోమవారం సెన్సెక్స్‌ పయనం బలహీనంగానే ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో సూచీ పతనం కొనసాగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 2,050 పాయింట్లకు పైగా నష్టపోయి డే కనిష్ఠ స్థాయి 56,984 పాయింట్లకు దిగజారింది. అయితే చివర్లో కాస్త కోలుకుని 57,491.51 పాయింట్ల వద్ద ముగిసింది. స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టపోవటం వరుసగా ఇది ఐదో రోజు.


ఞ సెన్సెక్స్‌ సూచీలో టాటా స్టీల్‌ అత్యధికంగా 5.98 శాతం నష్టపోయింది. తర్వాతి స్థానాల్లో బజాజ్‌ ఫైనాన్స్‌ (5.97 శాతం), విప్రో (5.35 శాతం), టెక్‌ మహీంద్రా(5.14 శాతం), టైటాన్‌ (4.97 శాతం), రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ (4.06 శాతం), హెచ్‌సీఎల్‌ టెక్‌ (3.84 శాతం) ఉన్నాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లు నష్టాన్ని చవిచూశాయి. 

ఞ బీఎ్‌సఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 4.43 శాతం, మిడ్‌క్యాప్‌ సూచీ 3.82 శాతం క్షీణించింది. 


ఒక్కరోజే రూ.9 లక్షల కోట్లు హాంఫట్‌

ఈక్విటీ మార్కెట్లో కొనసాగుతున్న నష్టాలతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైపోతోంది. వరుసగా ఐదు సెషన్లలో భారీ అమ్మకాలు కొనసాగడంతో సెన్సెక్స్‌ 3,817.4 పాయింట్లు కోల్పోయింది. ఫలితంగా బీఎ్‌సఈలో లిస్టయిన కంపెనీ మార్కెట్‌ విలువ రూ.19,50,288 కోట్లు ఆవిరైపోయి రూ.2,60,52,149.66 కోట్లకు చేరుకుంది. సోమవారం ఒక్క రోజే బీఎ్‌సఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.9,13,651.88 కోట్లు క్షీణించింది. ఈ నెల 17న ఈ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.280 లక్షల కోట్ల రికార్డు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 


3 వారాలకనిష్ఠానికి రూపాయి 

డాలర్‌ మారకంలో రూపాయి విలువ మరింత క్షీణించింది. సోమవారం 17 పైసలు పతనమై మూడు వారాల కనిష్ఠ స్థాయి 74.60 వద్ద ముగిసింది. అధిక ముడి చమురు ధరలు, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ నష్టాలు వంటి పరిణామాల నేపథ్యంలో రూపాయి బలహీనపడింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి ట్రేడింగ్‌ 74.43 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్ఠంగా 74.42, కనిష్ఠంగా 74.69 స్థాయిని తాకింది. చివరకు రూపాయి 17 పైసల నష్టంతో 74.60 వద్ద క్లోజైంది. 2021 డిసెంబరు 27 నుంచి చూస్తే ఇదే కనిష్ఠ స్థాయి ముగింపు.  


నవతరం టెక్‌ కంపెనీల 

షేర్లకూ నష్టాలు.. 

గత ఏడాది పబ్లిక్‌ ఇష్యూతో స్టాక్‌ మార్కెట్లోకి వచ్చిన నవతరం టెక్నాలజీ స్టార్టప్స్‌ షేర్లు కూడా భారీగా అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ కంపెనీల షేర్లు ఇష్యూ ధర కన్నా 20-50 శాతం డిస్కౌంట్‌తో ట్రేడవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. బీఎ్‌సఈలో పేటీఎం షేరు సోమవారం 4.43 శాతం నష్టంతో రూ.917.35 వద్ద, పాలసీబజార్‌ 10.16 శాతం కోల్పోయి రూ.776.60 వద్ద, నైకా 12.93 శాతం నష్టంతో రూ.1,734.85 వద్ద, జొమాటో 19.65 శాతం నష్టంతో రూ.91.40 వద్ద ముగిశాయి. 


 మాన్యవర్‌ ఐపీఓకు సెబీ అనుమతి 

ఎథ్నిక్‌ వేర్‌ బ్రాండ్‌ మాన్యవర్‌ను కలిగి ఉన్న వేదాంత్‌ ఫ్యాషన్స్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)తో నిధుల సమీకరణకు క్యాపిటల్‌ మార్కె ట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో భాగంగా 36,364,838 ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత షేరు హోల్డర్లు విక్రయించనున్నారు. మరోవైపు ఫ్యాబ్‌ ఇండియా కూడా పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఈ మేరకు సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇష్యూ ద్వారా రూ.4,000 కోట్లు సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా కళాకారులు, రైతులకు దాదాపు 7 లక్షల షేర్లు బహుమతిగా కంపెనీ ఇవ్వనుంది. 


నష్టాలకు కారణాలు..

 ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌,  దక్షిణ కొరియా మార్కెట్లు నష్టాలతో ముగియటం. యూరప్‌ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి 

  అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ రకం ముడి చమురు ధర 88.17 డాలర్ల స్థాయికి ఎగబాకటం

 యూఎస్‌ ఫెడ్‌ అంచనా వేసిన దానికన్నా వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయాలు

 రష్యా-ఉక్రెయిన్‌ మధ్య సరిహద్దు వివాదంపై కొనసాగుతున్న ఆందోళనలు 

 దేశీయ మార్కెట్లలో కొన్ని రోజులుగా ఎఫ్‌పీఐల అమ్మకాలు ఊపందుకోవటం


ఫెడ్‌ సమావేశ వివరాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్న నేపథ్యంలో మార్కెట్లలో రానున్న రోజుల్లో  హెచ్చుతగ్గులు మరింత ఎక్కువ ఉండొచ్చు. బడ్జెట్‌పై అంచనాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు, డెరివేటివ్స్‌ ముగింపు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. 

                                                                     - అజిత్‌ మిశ్రా, వీపీ-రీసెర్చ్‌, రెలిగేర్‌ బ్రోకింగ్‌ 

Updated Date - 2022-01-25T08:15:20+05:30 IST