కరోనా దెబ్బకు ఘోరంగా పతనమైన స్టాక్ మార్కెట్

ABN , First Publish Date - 2020-03-23T21:41:54+05:30 IST

కరోనా వైరస్ ప్రభావంతో ఇండియా మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా

కరోనా దెబ్బకు ఘోరంగా పతనమైన స్టాక్ మార్కెట్

ముంబై: కరోనా వైరస్ రోజు రోజుకూ విస్తరిస్తున్న కారణంగా భారత్ మొత్తం లాక్‌డౌన్‌ స్థితిలోకి వెళ్లిపోతోంది. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఎన్నడూ లేనంత దారుణంగా కుప్పకూలాయి. బెంచ్‌మార్క్ బీఎస్‌ఈ సెన్సెక్స్ తొలిసారి దాదాపు 4000 పాయింట్ల నష్టాన్ని చవిచూడగా... నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ సైతం 1000 పాయింట్లకు పైగా కుప్పకూలింది. కరోనా ఎఫెక్ట్ ఎంత కాలం కొనసాగుతుందో అనే భయాందోళనలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. మదుపరులు అందినకాడికి షేర్లను అమ్ముకునేందుకు మొగ్గుచూపడంతో ట్రేడింగ్ మొదలైన కాసేపటికే మార్కెట్లు 10 శాతం నష్టపోయి లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో కాసేపు ట్రేడింగ్‌ ఆపేశారు. ఆ తర్వాత మళ్లీ ట్రేడింగ్ కొనసాగినప్పటికీ నష్టాలు ఆగలేదు. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 3,935 పాయింట్లు పతనమై 25,981కి పడిపోయింది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 3950 పాయింట్ల వరకు నష్టపోయింది. మరోవైపు నిఫ్టీ సైతం 1,135 పాయింట్లు కోల్పోయి 7,610కి దిగజారింది.


బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు అత్యధిక నష్టాలను మూటగట్టుకున్నాయి. మార్కెట్లు లోయర్ సర్క్యూట్‌ను తాకడం వల్ల ట్రేడింగ్ నిలిచిపోవడం గత ఏడు సెషన్లలో ఇది రెండోసారి. బీఎస్ఈ సెన్సెక్స్‌లో అత్యధికంగా నష్టపోయిన వాటిలో యాక్సిస్ బ్యాంక్ (-27.63%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-23.67%), బజాజ్ ఫైనాన్స్ (-27.39%),  ఐసీఐసీఐ బ్యాంక్ (-18.15%), మారుతి సుజుకి (-17.28%) తదితర కంపెనీలు ఉన్నాయి. కాగా ఇవాళ సెన్సెక్స్‌లో ఒక్క కంపెనీ షేరు కూడా లాభాల్లో ముగియకపోవడం గమానార్హం.

Updated Date - 2020-03-23T21:41:54+05:30 IST