59,000 శిఖరంపై సెన్సెక్స్

ABN , First Publish Date - 2021-09-17T08:12:33+05:30 IST

టెలికాం, వాహన రంగాలకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు స్టాక్‌ మార్కెట్‌ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపాయి.

59,000 శిఖరంపై సెన్సెక్స్

  • 17,600 ఎగువకు నిఫ్టీ 
  • సరికొత్త ఆల్‌టైం గరిష్ఠానికి ప్రామాణిక ఈక్విటీ సూచీలు 
  • రూ.260 లక్షల కోట్లు దాటిన మార్కెట్‌ వర్గాల సంపద


ముంబై: టెలికాం, వాహన రంగాలకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు స్టాక్‌ మార్కెట్‌ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపాయి. మదుపర్లు కొనుగోళ్ల జోరు కొనసాగించడంతో గురువారం  ఈక్విటీ సూచీలు సరికొత్త జీవిత కాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌  తొలిసారిగా 59,000 మైలురాయిని దాటగా.. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 17,600 స్థాయిని అధిగమించింది. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ సరికొత్త ఆల్‌టైం గరిష్ఠ స్థాయి రూ.260.78 లక్షల కోట్లకు చేరుకుంది. వరుసగా మూడో రోజూ లాభాల్లో పయనించిన సెన్సెక్స్‌.. గురువారం 417.96 పాయింట్లు ఎగబాకి 59,141.16 వద్ద క్లోజైంది. నిఫ్టీ 110.05 పాయింట్లు బలపడి 17,629.50 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 59,204.29 వద్ద, నిఫ్టీ 17,644.60 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డులను సైతం నమోదు చేసుకున్నాయి. గడిచిన మూ డు రోజుల్లో స్టాక్‌ మా ర్కెట్‌ వర్గాల సంపద రూ.4.46 లక్షల కోట్లకు పైగా పెరిగింది. 


సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ 7.34 శాతం లాభపడి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఐటీసీ షేరు 6.83 శాతం ఎగబాకింది. ఎస్‌బీఐ 4.46 శాతం బలపడింది. మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 2.07 శాతం పుంజుకుంది.


వొడాఫోన్‌ షేరు 28% అప్‌ 

ప్రభుత్వ ప్యాకేజీతో టెలికాం షేర్లు మెరిశాయి. బీఎ్‌సఈలో వొడాఫోన్‌ ఐడియా షేరు ఒకదశలో 28.44 శాతం వరకు ఎగబాకింది. చివరికి 25.98 శాతం లాభంతో రూ.11.25 వద్ద స్థిరపడింది. బుధవారం కూడా ఈ షేరు 2.76 శాతం లాభపడింది. మరో ప్రైవేట్‌ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌ షేరు ఇంట్రాడేలో 2.52 శాతం లాభంతో రూ.743.90 వద్ద ఏడాది సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. అయితే, మదుపర్ల లాభాల స్వీకరణ కారణంగా చివరికి 1.02 శాతం నష్టంతో రూ.718.15 వద్ద స్థిరపడింది.


ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌ 

బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ (క్యాపిటలైజేషన్‌) 3.54 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుందని బీఎస్‌ఈ సీఈఓ ఆశిష్‌ చౌహాన్‌ ట్వీట్‌ చేశారు. స్టాక్‌ మార్కెట్‌ సంపదపరంగా ప్రస్తుతం ప్రపంచంలో ఐదో అతిపెద్ద దేశంగా భారత్‌ నిలిచిందన్నారు.  


50 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. చైనా (12 లక్షల కోట్ల డాలర్లు), జపాన్‌ (7.5 లక్షల కోట్ల డాలర్లు), హాంకాంగ్‌ (6.5 లక్షల కోట్ల డాలర్లు), బ్రిటన్‌ (3.5 లక్షల కోట్ల డాలర్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 


23.85%

ఈ ఏడాదిలో సెన్సెక్స్‌ వృద్ధి ఇది. గడిచిన ఎనిమిదిన్నర నెలల్లో సూచీ 11,389 పాయింట్లు పెరిగింది.

 

ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లో క్లాసికల్‌ బుల్‌ ర్యాలీ కొనసాగుతోంది. ఇది వచ్చే 2-3 ఏళ్ల వరకు కొనసాగవచ్చు. అయితే, మధ్యలో సూచీలు అడపాదడపా కొంత దిద్దుబాటుకు లోనుకావడం సహజమే. స్వల్పకాలిక ట్రెండ్‌ను పరిశీలిస్తే, ఈనెలాఖరు వరకు ర్యాలీ కొనసాగేందుకు ఆస్కారం ఉంది. ఈ నెలలోనే సెన్సెక్స్‌ 60,000 మైలురాయికి చేరుకోవచ్చని అంచనా. అక్టోబరులో మాత్రం సూచీల్లో కొంత కరెక్షన్‌ జరగవచ్చు.     - సంతోష్‌ మీనా, స్వస్తిక ఇన్వె్‌స్టమెంట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ 

Updated Date - 2021-09-17T08:12:33+05:30 IST