Hyderabad లో హెల్త్ సర్వే.. సంచలన విషయాలు వెలుగులోకి.. త్వరగా ఈ సమస్యను గుర్తించండి..!

ABN , First Publish Date - 2021-09-03T20:26:18+05:30 IST

సర్వేలో పాల్గొన్న వారిలో 73 శాతం మంది బి 12 కోసం కూరగాయలు..

Hyderabad లో హెల్త్ సర్వే.. సంచలన విషయాలు వెలుగులోకి.. త్వరగా ఈ సమస్యను గుర్తించండి..!

హైదరాబాద్‌ సిటీ : నరాల బలహీనతతో ఇబ్బంది పడుతున్న విషయం చాలా మందికి తెలియడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. నరాల ఆరోగ్యంపై ఎంత మందికి అవగాహన ఉంది, ఏదైనా సమస్య వస్తే గుర్తించగలుగుతున్నారా... అంశాలపై ప్రోక్టర్‌ అండ్‌ గాంబుల్‌ హెల్త్‌ లిమిటెడ్‌ (పీ అండ్‌ జీ) నెర్వ్‌ హెల్త్‌ సర్వే నిర్వహించింది. హైదరాబాద్‌ సహా దేశంలోని 12 నగరాలల్లో 1800 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. 


60 శాతం మంది నిర్లక్ష్యం..

ఈ సర్వేలో 35 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు పాల్గొన్నారు. ఇందులో పురుషులు, మహిళలను సమానంగా తీసుకున్నారు. నరాల అనారోగ్యం విషయంలో 60 శాతం మంది నిర్లక్ష్యం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ తరహా వ్యక్తులు హైదరాబాద్‌లో 34 శాతం మంది ఉన్నట్లు నిర్దారించారు. నాడీ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండడం చాలా ముఖ్యమని సర్వేలో పాల్గొన్న 90 శాతం మంది పేర్కొన్నారు. నరాలు, రక్తనాళాలు వేరన్న విషయం తెలిసిన వారు కేవలం 38 శాతం మందే ఉన్నట్లు సర్వేలో తేలింది.


50 శాతం మందికి అవగాహన లేదు..

నరాలు దెబ్బతినడం వల్ల కొన్ని లక్షణాలు కనిపించినప్పటికీ వాటిని చాలా మంది గుర్తించడం లేదు. లక్షణాలపై 50 శాతం మందికి మాత్రమే అవగాహన ఉందని సర్వే ద్వారా తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 73 శాతం మంది బి 12 కోసం కూరగాయలు, 69 శాతం మంది పండ్లు తింటున్నట్లు తేలింది. 13 శాతం మందికి మధుమేహం, 16 శాతం మందికి ఆల్కహాల్‌ వల్ల నరాలపై ప్రబావం చూపినట్లు సర్వే ద్వారా తేలింది. 


ఇబ్బందులు ఇవీ..

నరాల బలహీనత, బి-12 విటమిన్‌ లోపం వల్ల కొంత మంది మహిళలలో తల తిరుగుడు, కొద్దిగా తలనొప్పి, కండరాల బలహీనత, నరాలు మెలి తిప్పినట్లు అనిపించడం, మైకం రావడం, శరీరం తిమ్మిరిగా అనిపించడం వంటి సమస్యలు ఎదురైనట్లు సర్వేలో పాల్గొన్న వారు వివరించారు. నరాల ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు వివరించారు. 


బి-12 లోపమే కారణం

బి-గ్రూప్‌ విటమిన్లు లేకపోతే శరారీనికి శక్తి ఉండదు. కొన్ని నెలల పాటు ఎవరైనా సరిగ్గా ఆహారం తీసుకోకపోతే విటమిన్‌ బి-12 లోపం ఏర్పడుతుంది. నరాలు దెబ్బతినడానికి ప్రధాన కారణం బి-12 లోపమేనని వైద్యులు పేర్కొంటున్నారు. ఆహారం ద్వారా కానీ, విడిగా కానీ బి-12ను తగినంత మొత్తంలో తీసుకోవడం చాలా అవసరమని ఉస్మానియా వైద్య కళాశాల ఎండోక్రైనాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాకేష్‌ స్పష్టం చేశారు. నరాల అనారోగ్యాన్ని ఎలా గుర్తించాలి, సమతుల ఆహారం, మందులతో ఎలా నయం చేసుకోవచ్చు అనే అంశాలను ప్రజలకు వివరిస్తున్నట్లు పీ అండ్‌ గాంబుల్‌ హెల్త్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మిళింద్‌ తాటే తెలిపారు.

Updated Date - 2021-09-03T20:26:18+05:30 IST