Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 26 Nov 2021 03:29:17 IST

భారత నారి.. ఆధిక్య భేరి

twitter-iconwatsapp-iconfb-icon
భారత నారి.. ఆధిక్య భేరి

 • దేశంలో పురుషులకన్నా మహిళలే ఎక్కువ
 • ప్రతి 1000 మంది మగవాళ్లకు
 • 1020 మంది ఆడవాళ్లు
 • పట్టణాల్లో 985 మంది మహిళలు..
 • గ్రామీణప్రాంతాల్లో 1037 మంది 
 • 12 రాష్ట్రాల్లోనే పురుషుల జనాభా ఎక్కువ
 • సంతానోత్పత్తి రేటు 2.2 నుంచి 2 కు 
 • టీఎఫ్టీ 2 కన్నా తక్కువగా ఉంటే 
 • కాలక్రమేణా జనాభా తగ్గుదల
 • పెరిగిన కండోమ్‌ల వినియోగం.. 
 • 5.6 నుంచి 9.5 శాతానికి చేరిక 
 • కుటుంబ సర్వేలో సంచలన వివరాలు


న్యూఢిల్లీ, నవంబరు 25: భారత్‌ అంటే ఇక నారీ శక్తి! మన దేశ జనాభాలో సింహభాగం వాటా మహిళలదే! విద్య, ఉద్యోగాల్లో ఇంతింతై ఎదిగి.. అదీ ఇదీ అని కాకుండా అన్ని రంగాల్లోనూ సగమై పురుషులను ఔరా అనిపించేలా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన మహిళా లోకం, ఇప్పుడుజనాభాలోనూ పురుషులను వెనక్కు నెట్టింది. భారత్‌లో తొలిసారిగా మహిళల జనాభా, పురుషుల జనాభాను మించిపోయింది. దేశంలో ప్రస్తుతం ప్రతి 1000 మంది పురుషులకు 1020 మంది మహిళలు ఉన్నారు. లింగ నిష్పత్తి పరంగా మహిళల జనాభా నగరాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండడం మరో విశేషం. నగరాల్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 985 మంది మహిళలు ఉండగా, గ్రామాల్లో 1037 మంది మహిళలు ఉన్నారు. ఈ విషయం, కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స)లో తేలింది. ఈ మేరకు 2019-2020కి సంబంధించి రెండు దశల్లో జరిగిన ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స సర్వే పూర్తి వివరాలను కేంద్రం వెల్లడించింది.  ఐదేళ్ల క్రితం 2015-16 ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స సర్వేలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 919 మంది మహిళలు మాత్రమే ఉన్నట్లు తేలింది. కాగా జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్‌.. జనాభా స్థిరీకరణ దిశగా అడుగులు వేస్తోందని ఈ సర్వే ద్వారా వెల్లడైంది. మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్టీ) 2.2 నుంచి 2.0కు పడిపోయింది.


టీఎఫ్టీ 2 కన్నా తక్కువగా ఉంటే కాలక్రమేణా జనాభాలో తగ్గుదల నమోదవుతుందని లెక్క. ఇక దేశంలో కండోమ్‌ల వినియోగం 5.6శాతం నుంచి 9.5శాతానికి పెరిగింది. 15-49 ఏళ్లలోపు పురుషుల్లో 82 శాతం మంది హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నిరోధించేందుకు కండోమ్‌ సురక్షితమైనదిగా అభిప్రాయపడ్డారు. మొత్తంగా సంతానోత్సత్తి, కుటుంబ నియంత్రణ, వివాహ వయసు, మహిళల సాధికారత పరంగా చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించినట్లయిందని ఈ సర్వే ద్వారా వెల్లడైందని చెబుతున్నారు. అయితే, ఈ సర్వే ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశముంది.


తాజా సర్వే వివరాలు..

 • గుజరాత్‌, మహరాష్ట్ర, అరుణాచల్‌ ప్రదేశ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో.. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్‌, చండీగఢ్‌, ఢిల్లీ, అండమాన్‌ నికోబార్‌, దాద్రానగర్‌ హవేలీ, లద్దాఖ్‌లో మహిళలకన్నా పురుషులు ఎక్కువగా ఉన్నారు.    
 • కేరళలో అత్యధికంగా ప్రతి వెయ్యిమంది పురుషులకు 1,121 మంది మహిళలు ఉన్నారు. గత సర్వే (1,049) కన్నా 72 మంది చొప్పున పెరిగారు. 
 • మొత్తం సంతానోత్పత్తి రేటు కేరళలో మరింత మెరుగుపడింది. గత సర్వేలో టీఎఫ్టీ 1.8గా ఉంటే ప్రస్తుతం 1.6గా నమోదైంది. 
 • బిహార్‌, మేఘాలయ, మణిపూర్‌, జార్ఖండ్‌, యూపీలో మాత్రం మొత్తం సంతానోత్పత్తి రేటు 2 కన్నా ఎక్కువగా నమోదైంది. బిహార్‌లో ఇది 3గా ఉండటం విశేషం అయితే గత ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స సర్వేలో అక్కడ టీఎఫ్టీ 3.4గా నమోదవడంతో ఆ రాష్ట్రం మెరుగుపడినట్లే. 
 • దేశంలో దాదాపు 78శాతం తల్లులకు ప్రసవించిన రెండు రోజుల్లోనే డాక్టర్లు/నర్సులు/ఎల్‌హెచ్‌వీ/ఎన్‌ఎన్‌ఎం నుంచి చక్కని వైద్య సేవలు అందాయి. తద్వారా దేశంలో శిశు మరణాలు తగ్గాయి. 
 • దేశంలో పెళ్లయిన 15-49 ఏళ్ల లోపు మహిళల్లో 66.7శాతం మంది గర్భదారణను ఆలస్యం లేదా నిరోధించడం కోసం కుటుంబ నియంత్రణ సాధనాల్లో ఏదో ఒకటి వాడుతున్నారు. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఈ ధోరణి గణనీయంగా పెరిగింది. అప్పట్లో ఇది 53.5శాతంగానే ఉండేది. 
 • దేశంలో జననాల నమోదు కూడా గణనీయంగా పెరిగింది. ఐదేళ్ల క్రితం ఇది 79.7శాతంగా ఉంటే ప్రస్తుతం 89.1శాతంగా ఉంది. 
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.