BJP MLA రాజాసింగ్‌పై సంచలన ఆరోపణలు.. ఏమవుతుందో..!?

ABN , First Publish Date - 2021-11-26T20:10:04+05:30 IST

BJP MLA రాజాసింగ్‌పై సంచలన ఆరోపణలు.. ఏమవుతుందో..!?

BJP MLA రాజాసింగ్‌పై సంచలన ఆరోపణలు.. ఏమవుతుందో..!?

  • మాజీ కార్పొరేటర్‌ ఫైర్‌
  • సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు


హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సోషల్‌మీడియా వేదికగా మాజీ కార్పొరేటర్‌, టీఆర్‌ఎస్‌కు చెందిన ముఖేష్‌సింగ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళ్‌హాట్‌ డివిజన్‌ పరిధిలోని దిలావర్‌గంజ్‌లో ఉన్న 402 గజాల భూమి విషయంలో వీరి మధ్య వివాదం రాజుకుంది. సదరు భూమి ప్రభుత్వ స్థలమని ఎమ్మెల్యే ఆసీఫ్‌నగర్‌ తహసీల్దార్‌కు లేఖ రాశారని, అధికారులు అది ప్రైవేట్‌ స్థలమని నిర్ధారించారని మాజీ కార్పొరేటర్‌ ముఖేష్‌ సింగ్‌ ఆరోపించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన.. ఎమ్మెల్యే తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే అన్యాయం చేస్తున్నాడని, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. 


ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి రమేష్‌ పట్టేదార్‌ బోరు వేసే విషయం మొదలు కొన్ని మగ్రా, ధూల్‌పేట్‌లలో స్థల వివాదాలు, హజారీ భవన్‌ కూల్చివేయాలని తదితర అంశాల్లో ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు. లోథ్‌ సమాజ్‌ యువత ఒక సారి ఆలోచించి, వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉందంటూ వీడియో పోస్ట్‌ చేశారు. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్‌  స్పందిస్తూ తన సామాజిక వార్గనికే చెందిన వారు వచ్చి స్థలం విషయంలో ఫిర్యాదు చేయగా, ఆ స్థలం ప్రైవేటుదా...? ప్రభుత్వ స్థలమా..? నిర్ధారించాలని తహసీల్దార్‌కు లేఖ రాశానన్నారు.


సమస్య ఉందని తన వద్దకు వచ్చే వారికి న్యాయం చేసేందుకు లేఖ ఇచ్చానని, ఆయినా తనను ప్రశ్నించే అధికారం ముఖేష్‌ సింగ్‌కు లేదని, నిరాదారమైన ఆరోపణలు చేయడం సరికాదని ఆయన  మరో వీడియోను పోస్ట్‌ చేశారు. దీనిపై ముఖేష్‌ సింగ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే వల్ల నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బాదితుల పక్షాన ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.  ముఖేష్‌ సింగ్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఇదే స్థలం విషయంలో 2019లో కొందరు వచ్చి రూ. 20 లక్షలు డిమాండ్‌ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే వేధింపులపై బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానన్నారు.

Updated Date - 2021-11-26T20:10:04+05:30 IST