సీనియర్‌ జర్నలిస్టు అంకబాబు అరెస్టు

ABN , First Publish Date - 2022-09-23T08:26:04+05:30 IST

సీనియర్‌ జర్నలిస్టు అంకబాబు అరెస్టు

సీనియర్‌ జర్నలిస్టు అంకబాబు అరెస్టు

బంగారం స్మగ్లింగ్‌ పోస్టు ఫార్వర్డ్‌ చేసినందుకే!

విజయవాడ, అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): సీనియర్‌ జర్నలిస్టు కొల్లు అంకబాబును సీఐడీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కొద్దిరోజుల క్రితం గన్నవరం విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు ఓ మహిళ నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పలు వ్యాఖ్యానాలు ట్రోల్‌ అయ్యాయి. అందులో ఒక పోస్టింగ్‌ను అంకబాబు మరొకరికి పంపారన్న అభియోగంతో మంగళగిరిలోని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అయనను విజయవాడలో అరెస్టు చేశారు. 73ఏళ్ల కొల్లు అంకబాబు న్యాయవిద్యను అభ్యసించారు. వివిధ దినపత్రికల్లో పలు హోదాల్లో పని చేశారు. వివిధ ఆరోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అంకబాబు అరెస్టును టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. 73 ఏళ్ల వయస్సున్న ఒక జర్నలిస్టును అరెస్టు చేయడం జగన్‌ ఫాసిస్టు మనస్తత్వాన్ని చాటుతోందని ధ్వజమెత్తారు. అంకబాబును వెంటనే విడుదల చేయాలని డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. కాగా, వాట్సా్‌పలో పోస్టు ఫార్వార్డ్‌ చేయడం తప్పయితే.. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఏ శిక్ష వేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. కాగా, అంకబాబును సీఐడీ పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేసి, తెలియని ప్రదేశాలకు తరలించడం చాలా అన్యాయమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. 


Updated Date - 2022-09-23T08:26:04+05:30 IST