సీనియర్ ఇండియన్, చైనీస్ మిలిటరీ కమాండర్స్ చర్చలు?

ABN , First Publish Date - 2020-05-27T02:49:29+05:30 IST

తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితిని చక్కదిద్దేందుకు

సీనియర్ ఇండియన్, చైనీస్ మిలిటరీ కమాండర్స్ చర్చలు?

న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత దేశం, చైనా సైనిక ఉన్నతాధికారులు ఈ నెల 22, 23 తేదీల్లో చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు న్యూఢిల్లీ, బీజింగ్‌లలో దౌత్యమార్గాల్లో కూడా కృషి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో చైనా వాస్తవాధీన రేఖ వెంబడి మే నెల ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శిస్తోంది. భారత సైనికులతో తలపడుతోంది.


చైనా దురాక్రమణ బుద్ధి గురించి తెలిసిన భారతీయ దళాలు కూడా తూర్పు లడఖ్, గాల్వన్ సెక్టర్లలో బలగాలను భారీగా మోహరిస్తున్నట్లు సమాచారం. భారత దేశ సరిహద్దుల అఖండతను కాపాడేందుకు సైన్యం దీటుగా వ్యవహరిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీలేని ధోరణి ప్రదర్శిస్తోందని తెలుస్తోంది. భారత దేశ భూభాగాన్ని కాపాడటంలో అత్యంత దృఢంగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. 


భారతీయ దళాలతో చైనా తలపడటం ఇది కొత్త కాదు. 1962లో చైనా-భారత్ యుద్ధం తర్వాత చైనా చాలాసార్లు దురాక్రమణ ధోరణిని ప్రదర్శించింది. 2008లో సిక్కింలోనూ, 2013లో డెస్పాంగ్‌లోనూ, 2014లో చుమర్‌లోనూ, 2017లో డోక్లాంలోనూ భారత సైన్యంతో తలపడింది. 


భారత దేశంవైపుగల వాస్తవాధీన రేఖ వెంబడి దర్బుక్-ష్యోక్-డీబీఓ రోడ్డును భారత దేశం నిర్మిస్తోంది. ఇది చైనాకు ఇష్టం లేదు. 255 కిలోమీటర్ల పొడవైన రోడ్డు 2000వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. లడఖ్‌లో భారత ప్రభుత్వం రోడ్లు, తదితర మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున నిర్మిస్తుండటంతో చైనా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది. సదుపాయాలు పెరగడంతో స్థానిక ప్రజలు కూడా వాటిని ఉపయోగించుకుంటున్నారు. 


చైనావైపు వాస్తవాధీన రేఖ వెంబడి ఆ దేశం కూడా మౌలిక సదుపాయాలను పెంచుకుంటోంది, సైనిక గస్తీని పెంచుతోంది, అయినప్పటికీ భారత ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.


Updated Date - 2020-05-27T02:49:29+05:30 IST