కాళ్లు కట్టేశారు.. ఇక విశ్రాంతి: సీనియర్ కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-23T02:08:51+05:30 IST

రప్పితో నిండిన ఎన్నికల సముద్రంలో సంస్థాగత స్థాయిలో సహకార హస్తం అందించడానికి బదులు, సహాయ నిరాకరణ జరుగుతోంది. ఇలాంటి సమయంలో సముద్రాన్ని ఈదాల్సి రావడం కష్టమే. అధికారం ఇక్కడ మొసళ్లను వదిలేసింది..

కాళ్లు కట్టేశారు.. ఇక విశ్రాంతి: సీనియర్ కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

డెహ్రడూన్: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించారు. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా కాంగ్రెస్ ఎన్నికల ఇంచార్జిగా ఉన్న రావత్ ఈ ప్రకటన చేయడం ఉత్తరాఖండ్ కాంగ్రెస్ వర్గీయులను తీవ్రంగా కలచి వేస్తోంది. అయితే తన విశ్రాంతికి గల కారణాలను రావత్ చెప్పుకొచ్చారు. ఎన్నికల మహా సముద్రంలో తాను చాలా ఆటు పోట్లను ఎదుర్కొని ఈదానని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి సరైన సహకారం అందకపోవడం వల్ల తాను ఇక విశ్రాంతికి మొగ్గు చూపినట్లు చెప్పుకొచ్చారు.


ఇందుకు సంబంధించి తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. ‘‘రప్పితో నిండిన ఎన్నికల సముద్రంలో సంస్థాగత స్థాయిలో సహకార హస్తం అందించడానికి బదులు, సహాయ నిరాకరణ జరుగుతోంది. ఇలాంటి సమయంలో సముద్రాన్ని ఈదాల్సి రావడం కష్టమే. అధికారం ఇక్కడ మొసళ్లను వదిలేసింది. అయినప్పటికీ ఈత కొట్టాలని చూసినా ప్రయోజనం లేదు. కాళ్లు కట్టేసి వారి ఆదేశాల మేరకే ఈదాలని నిర్ణయిస్తున్నారు. హరీష్ రావత్ ఇలాంటివి చాలా ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నారు. నా మదిలో ఇప్పుడు ఎన్నికల ఆలోచనలు లేవు. నూతన సంవత్సరమూ సరైన మార్గం చూపుతుంది. ఆ దిశానిర్దేశం కేదార్‌నాథుడే చూపిస్తాడనే నమ్మకం నాకుంది’’ అని రావత్ వరుస ట్వీట్లు చేశారు.


కొద్ది రోజుల క్రితం వరకు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జిగా ఉన్న రావత్.. సీఎం పదవి నుంచి కెప్టెన్ అమరీందర్‌ను తప్పించడంలో కీలకంగా వ్యవహరించారు. అంతే కాకుండా గాంధీ కుటుంబానికి ఆయన ఎంతో విధేయుడన్న వార్త కూడా వినిపిస్తోంది. అయితే చాలా చోట్ల నూతన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోన్న కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే సీనియర్ నేతలను పక్కన పెడుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే రావత్ ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-12-23T02:08:51+05:30 IST