మోదీ, షాలకు చరిత్ర తెలియదు : చిదంబరం

ABN , First Publish Date - 2022-02-13T18:17:11+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు చరిత్ర

మోదీ, షాలకు చరిత్ర తెలియదు : చిదంబరం

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు చరిత్ర తెలియదని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆరోపించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, గోవా శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే, ఐదు నిమిషాల్లోనే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతామన్నారు.


గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న పి చిదంబరం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 2017లో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత గోవా శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే, ఐదు నిమిషాల్లోనే గవర్నర్‌ను కలుస్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతామని చెప్పారు. టీఎంసీతో పొత్తు గురించి తమ పార్టీ అధిష్ఠానం నుంచి ఆదేశాలేవీ లేవని తెలిపారు. 


మార్పు దిశగా గోవా 

పదేళ్ళ బీజేపీ పాలన సక్రమంగా లేదని గోవా ప్రజలు భావిస్తున్నారని చిదంబరం చెప్పారు. ఈసారి ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బీజేపీపై వ్యతిరేకతను, ప్రభుత్వంపై వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మార్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.  కాంగ్రెస్, గోవా ఫార్వర్డ్ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పారు. 


గోవాకు స్వాతంత్ర్యం రావడం ఆలస్యమైందని, దీనికి కారణం అప్పటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూయేనని ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించిన విషయాన్ని ప్రస్తావించినపుడు చిదంబరం జవాబిస్తూ, ఈ చరిత్రను సాధారణ బీజేపీ పద్ధతిలో తిరగరాశారన్నారు. 1947లో భారత దేశం యువ, స్వతంత్ర దేశమని చెప్పారు. అప్పట్లో ప్రపంచంలో మనకు ఎక్కువ మంది స్నేహితులు లేరన్నారు. బాండుంగ్ కాన్ఫరెన్స్ (ఆసియా-ఆఫ్రికా దేశాలు) తీర్మానాలకు అనుగుణంగా  దేశాన్ని ఎనిమిదేళ్ళపాటు నెహ్రూ చాకచక్యంగా నడిపించారన్నారు. 1961లో సరైన సమయం వచ్చిందన్నారు. ప్రపంచ వేదికపైకి మనం వచ్చిన వెంటనే గోవాకు విముక్తి కల్పించారన్నారు. కనీసం ఒక దేశమైనా మనల్ని వ్యతిరేకించలేదన్నారు. మోదీ, షా ఏం చెప్పినా, వారికి చరిత్ర తెలియదని ప్రజలకు తెలుసునన్నారు. 


గోవా శాసన సభ ఎన్నికల్లో పొత్తు కోసం ఎన్‌సీపీ, శివసేన తమను సంప్రదించాయని, అయితే ఎక్కువ స్థానాలను అడిగాయని, అందుకు అంగీకరించే పరిస్థితిలో తాము లేమని తెలిపారు. 


Updated Date - 2022-02-13T18:17:11+05:30 IST