పంజాబ్‌లో ‘భయ్యా’ వివాదాన్ని అమెరికాలో నల్లజాతి సమస్యతో పోల్చిన మనీశ్ తివారీ

ABN , First Publish Date - 2022-02-18T17:51:47+05:30 IST

ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలవారిని ఉద్దేశించి పంజాబ్ ముఖ్యమంత్రి

పంజాబ్‌లో ‘భయ్యా’ వివాదాన్ని అమెరికాలో నల్లజాతి సమస్యతో పోల్చిన మనీశ్ తివారీ

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలవారిని ఉద్దేశించి పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మనీశ్ తివారీ తీవ్రంగా ఖండించారు. వలస కూలీలకు వ్యతిరేకంగా దురదృష్టకరమైన వ్యవస్థీకృత సాంఘిక పాక్షిక దృష్టికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని ఆరోపించారు. ఇది అమెరికాలో నల్లజాతి సమస్య వంటిదని చెప్పారు. లౌకికవాదంలో ఇటువంటి ఆలోచనలకు తావులేదని చెప్పారు. 


పంజాబ్ సీఎం, కాంగ్రెస్ నేత చరణ్ జిత్ సింగ్ చన్నీ బుధవారం ఓ సభలో మాట్లాడుతూ, ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన సోదరులను పంజాబ్‌లో అడుగు పెట్టనివ్వొద్దని ప్రజలను కోరారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినపుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆయన పక్కనే ఉండి, చిరునవ్వుతో ప్రశంసించారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు అనేక మంది నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రియాంక గాంధీ, చన్నీ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చన్నీ ఆరోపించారు. చన్నీ ఉద్దేశం అది కాదని ప్రియాంక కూడా చెప్పారు. 


ఈ నేపథ్యంలో మనీశ్ తివారీ శుక్రవారం ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. అమెరికాలోని నల్లజాతి సమస్య వంటిదే భయ్యా వివాదమని తెలిపారు. వలస కార్మికుల పట్ల హరిత విప్లవం ప్రారంభంనాటి దురదృష్టకరమైన వ్యవస్థీకృత, సంస్థాగత సాంఘిక పాక్షిక దృష్టిని ఇది ప్రతిబింబిస్తోందన్నారు. తన తల్లి జాట్ సిక్కు అని, తన తండ్రి పంజాబ్‌లో ఉన్నత వర్గాల నుంచి వచ్చినవారని, ఆయన హిందూ, సిక్కుల ఐకమత్యం కోసం జీవితాన్ని త్యాగం చేశారని చెప్పారు. చన్నీ (యూపీ, బిహార్ కే భయ్యా) యూపీ, బిహార్ రాష్ట్రాల సోదరులను పంజాబ్ రానివ్వొద్దని చెప్పడం సరికాదని, ఇటువంటి వాటిని మూలం నుంచి తొలగించాలని చెప్పారు. లౌకికవాదం అమలవుతున్న భారత దేశంలోని పంజాబ్‌లో ఇటువంటి ఆలోచనలకు తావు లేదని చెప్పారు. 


Updated Date - 2022-02-18T17:51:47+05:30 IST