Abn logo
Sep 19 2021 @ 17:57PM

ముఖ్యమంత్రుల మార్పుపై కపిల్ సిబల్ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ఇటీవలి కాలంలో కాంగ్రెస్, బీజేపీ తమ ముఖ్యమంత్రులను మార్చుతుండటంపై సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ట్విటర్ వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రుల మార్పు ద్వారా పరిస్థితులను చక్కదిద్దడానికి పార్టీలకు కొంత సమయం లభిస్తుందా? అని ప్రశ్నించారు. సకాలంలో సమస్యను పరిష్కరిస్తే మరిన్ని సమస్యలను తప్పించవచ్చునని పేర్కొన్నారు. 


కపిల్ సిబల్ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘నాయకత్వ మార్పు. ఉత్తరాఖండ్, గుజరాత్, పంజాబ్. పాత కాలం సామెత : సకాలంలో ఓ సమస్యను పరిష్కరించడం వల్ల తదుపరి కష్టాలు తగ్గుతాయి. ఔనా?’’ అని పేర్కొన్నారు. 


సమస్య తీవ్రరూపందాల్చే వరకు వేచి చూడకుండా, సకాలంలో పరిష్కరించడం వల్ల ఫలితం ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి మార్పుల వల్ల బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రయోజనం కలుగుతుందా? అని ప్రశ్నించారు. 


పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తోంది. 


ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర రావత్, తీరథ్ సింగ్ రావత్ తర్వాత పుష్కర్ సింగ్ ధామిని ముఖ్యమంత్రిగా బీజేపీ నియమించింది. అదే విధంగా గుజరాత్‌లో విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో భూపేంద్ర పటేల్‌ను బీజేపీ ముఖ్యమంత్రిగా నియమించింది. 


కర్ణాటకలో కూడా నాయకత్వ మార్పు జరిగింది. కానీ సిబల్ దీనిని తన ట్వీట్‌లో పేర్కొనలేదు. యడియూరప్పను తొలగించి బసవరాజ్ బొమ్మయ్‌ను ముఖ్యమంత్రిగా బీజేపీ నియమించింది.


ఇవి కూడా చదవండిImage Caption