‘నేను గాంధీ భవన్‌లోనే కూర్చుంటా.. ఎవరు గెలుస్తారో చూద్దామా..!?’

ABN , First Publish Date - 2021-04-11T18:59:10+05:30 IST

నేను గాంధీ భవన్‌లో కూర్చుంటా.. ఎవరు గెలుస్తారో చూద్దామా..?..

‘నేను గాంధీ భవన్‌లోనే కూర్చుంటా.. ఎవరు గెలుస్తారో చూద్దామా..!?’

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక రాజకీయాన్ని జానారెడ్డి తన వైపు తిప్పుకోవాలనుకుంటున్నారా? ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల కన్నా తానే హైలైట్‌ కావాలనుకుంటున్నారా? బైపోల్‌ వార్త ఏదైనా తన గురించే ప్రస్తావన ఎక్కువగా ఉండాలనుకుంటున్నారా? అందుకే అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీపై మాటల దాడి పెంచారా? సింగిల్ హ్యాండ్‌తో ప్రచారం చేస్తాననడం కూడా ఇందులో భాగమేనా? అసలు సంగతేంటో.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూద్దాం.


నేను గాంధీ భవన్‌లో కూర్చుంటా..!

నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో జానారెడ్డి మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు సవాళ్లు విసురుతూ పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారు. ఇటీవల హాలియాలో జరిగిన కాంగ్రెస్ గర్జన సభలో టీఆర్ఎస్, బీజేపీకి జానారెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. టీఆర్ఎస్, బీజేపీ, తాను నామినేషన్లు వేసి ప్రచారం చేయకుండా ప్రజల అభీష్టానికి వదిలేద్దాం.. ప్రగతి భవన్‌లో కేసీఆర్ కూర్చోవాలి.. బీజేపీ వాళ్లు వాళ్ల ఆఫీసులో కూర్చోవాలి.. నేను గాంధీ భవన్‌లో కూర్చుంటా.. ఎవరు గెలుస్తారో చూద్దామా..? నా సవాల్ స్వీకరిస్తారా..? అంటూ ఛాలెంజ్ చేశారు.


కేసీఆర్ జవాబు చెప్పాలి!

హాలియా సభలో కేసీఆర్‌ సర్కార్‌పై జానారెడ్డి విరుచుకుపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలోనే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు నీరందించిన వ్యక్తి జానారెడ్డి అన్నారు. సాగునీరు, రోడ్లు, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాల్లో తాను చేసిన అభివృద్ధిపై లెక్కలతో వచ్చిన జానారెడ్డి టీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో 953 కిలోమీటర్లు రోడ్లు ఉన్నది సాగర్ నియోజకవర్గంలోనేనన్నారు. తన గణాంకాలకు సీఎం కేసీఆరే జవాబు చెప్పాలని.. వేరే వాళ్లు చెబితే లెక్కచేయనని జానా రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ నేతలు అభివృద్ధికి దాతలు కాదు.. అనుభవ శూన్యులంటూ విమర్శించారు. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి రాజులుగా నిలబడాతారా? బానిసలుగా అమ్ముడు పోతారా? తేల్చుకోవాలంటూ నియోజకవర్గ ప్రజలను ప్రశ్నించారు.


సింగిల్ హ్యాండ్‌తోనే...

ఇక అంతకుముందు సింగిల్ హ్యాండ్‌తో ప్రచారం చేస్తానన్న జానా వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అయితే దుబ్బాక ఉపఎన్నికలో గ్రామాల వారీగా ఇంఛార్జులను పెట్టుకుని కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహం రచించింది. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ అయితే గ్రామానికి, మండలానికో సీనియర్ కాంగ్రెస్‌ నేతను ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ దుబ్బాకలో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పలేదు. కాంగ్రెస్‌ సీనియర్ నాయకులు కూడా ఎవరికి వారుగా సాగర్‌లో మండలాల వారీగా బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించారట. కీలక నాయకులు వచ్చి ప్రచారం చేస్తే ఇబ్బంది లేదనీ.. దుబ్బాక తరహాలో గ్రామానికో నాయకుడు అవసరం లేదని జానారెడ్డి అన్నారట. అన్నీ తానై నడిపించుకోవాలని చూస్తున్న జానారెడ్డి.. స్వయంగా గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా మీటింగ్‌లు పెడుతున్నారు.


బీజేపీకి షాక్ ఇస్తారా..!? 

జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డి ఉపఎన్నిక ప్రచారం రూట్ మ్యాప్‌ సిద్ధం చేయడంతో పాటు..ప్రచారానికి వచ్చే నాయకులను కోఆర్డినేట్‌ చేస్తున్నారని సమాచారం. జానారెడ్డికి నాగార్జునసాగర్‌ కొట్టిన పిండి. గ్రామస్థాయిలో పరిచయాలూ ఎక్కువే. ఇప్పటికే సాగర్‌ నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి.. 8వ సారి విజయం సాధించి అధికార పార్టీతో పాటు బీజేపీకి షాక్‌ ఇవ్వాలనుకుంటున్నారు. చురుకైన వాగ్భాణాలు ఎక్కుపెడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్న జానారెడ్డి..సాగర్‌లో సత్తా చాటుతారో లేదో చూడాలి.



Updated Date - 2021-04-11T18:59:10+05:30 IST